'పెద్దబాబుకు బ్రీఫ్కేసు, చిన్నబాబుకు సూట్కేసు'

25 May, 2015 12:44 IST|Sakshi
'పెద్దబాబుకు బ్రీఫ్కేసు, చిన్నబాబుకు సూట్కేసు'

హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబును మించినవారు ఎవరూ లేదన్నారు. 'ఏపీకి ప్రత్యేక హోదా' సదస్సులో ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ  ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బాబు పూర్తిగా అటకెక్కించారని అన్నారు. అన్ని విషయాల్లోనూ ప్రజలను దగా చేశారని రఘువీరా మండిపడ్డారు. అందుకే టీడీపీ చేసుకోవాల్సింది మహానాడు కాదని, దగానాడు అని ఆయన అన్నారు.

ఎన్టీఆర్ను ఎలా మోసం చేసిందీ, ఆయన అకాల మరణానికి కారణమైన తీరుపై దగానాడులో చర్చించాలని రఘువీరా ఈ సందర్భంగా చంద్రబాబుకు సూచించారు. హరికృష్ణ సహా మిగతా వాళ్లను ఎలా మోసం చేశారో దగ్గుబాటి వెంకటేశ్వరరావు 'ఒక చరిత్ర-కొన్ని నిజాలు...' అనే పుస్తకం కూడా రాశారని ఆయన అన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ను ప్రతి ఊరు తిప్పి, బాగా వాడుకుని, ఇప్పుడు ఆమడదూరంలో పెట్టారని రఘువీరారెడ్డి అన్నారు. లోకేశ్ను ప్రమోట్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ను పక్కన పెట్టారని విమర్శించారు. పెద్దబాబుకు బ్రీఫ్కేసు...చిన్నబాబుకు సూట్కేసు ఇస్తేనే పనులు అవుతున్నాయని రఘువీరా వ్యాఖ్యలు చేశారు. ఇది సూట్కేసు-బ్రీఫ్కేసు ప్రభుత్వమని ఆయన ఎద్దేవా చేశారు. రైతులు, మహిళలను చంద్రబాబు వంచించారని, బీజేపీతో పొత్తు పెట్టుకుని తప్పు చేశామన్న ఆయన ..మళ్లీ అదే పార్టీతో పొత్తు కొనసాగించటం రాజకీయ వ్యభిచారమే అన్నారు. ఏపీ రాజధాని నిర్మాణానికి విరాళాల సేకరణ కోసం హుండీ ఏర్పాటు చేశారని, ఆ విరాళాలు ప్రత్యేక విమానాల్లో విదేశాలకు వెళ్లేందుకే అని రఘువీరా మండిపడ్డారు.

మరిన్ని వార్తలు