గవర్నర్‌ ప్రసంగం.. తేదేపా అబద్దాల కరపత్రం: రఘువీరా రెడ్డి

6 Mar, 2017 22:38 IST|Sakshi
గవర్నర్‌ ప్రసంగం.. తేదేపా అబద్దాల కరపత్రం: రఘువీరా రెడ్డి
విజయవాడ: అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం తేలుగు దేశం పార్టీ తయారు చేసిన అబద్దాల కరపత్రమని ఏపీసీసీ అధ్యక్షలు ఎన్‌ రఘువీరారెడ్డి విమర్శించారు. సోమవారం గవర్నర్‌ ప్రసంగంపై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గవర్నర్‌ ప్రసంగంలో పార్టీ ఫిరాయింపులు, ఓటుకు నోటు కేసు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల వివరాలు, అమెరికాలో ఆంధ్రులపై జరుగుతున్న దాడులు ప్రస్తావించకపోవడం శోచనీయమన్నారు. ప్రత్యేక హోదా విషయం ముగిసిన అధ్యాయం అని గవర్నర్‌ ప్రసంగంలో పేర్కొనడం రాష్ట్ర ప్రజలను దగా చేయడమేనని, ఈ విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. 
 
ప్రజలు చంద్రబాబును 2019 వరకే ఎన్నుకున్నారని, అప్పటి వరకు ఏం చేస్తారో చెప్పకుండా 2022 ,2029 లో ఏం చేస్తామో చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తీరు అమ్మకు అన్నం పెట్టలేడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నట్లుందన్నారు.  ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో నదుల అనుసంధానం జరిగిందని, తెలుగుదేశం అనుసంధానానికి నాందీ పలికినట్లు గవర్నర్‌ ప్రసంగంలో ప్రస్తావించడం విడ్డూరంగా ఉందన్నారు.
 
మహిళా సాధికారత కోసం నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం బంగారుతల్లి పథకాన్ని ప్రవేశ పెడితే ఆ బంగారు తల్లి గొంతు పిసికి మహిళా సాధికారత గురించి మాట్లాడడం విస్మయానికి గురి చేస్తోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దోమలు స్వైర విహారం చేస్తుంటే ప్రభుత్వం దోమలపై దండయాత్రలు చేసిందని చెప్పుకోవడం సిగ్గు చేటని విమర్శించారు. ప్రభుత్వం పట్ల 80 శాతం సానుకూలత ఉందని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. అదే నిజమైతే ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలచేత రాజీనామా చేయించి ఎన్నికలకు ఎందుకు వెళ్లడంలేదని ప్రశ్నించారు. రాష్ట్ర కరవు పరిస్థితులపై గవర్నర్‌ ప్రసంగం ప్రత్యేక శ్రద్ద వహించినట్లు లేదని, ఇప్పటికే రాష్ట్రమంతా కరవు విలయతాండం చేస్తోందని తెలిపారు. ఉపాథి హామి పథకం సక్రమంగా అమలుకాక పల్లెలకు పల్లెలు వలసపోతున్నాయన్నారు. పల్లెల్లో ప్రజలు బాబు వస్తే కరవు వస్తుందని చెప్పుకుంటున్నారని చెప్పారు. 
మరిన్ని వార్తలు