బడ్జెట్‌ అంతా అబద్దాలే: రఘువీరా

17 Mar, 2017 19:26 IST|Sakshi
బడ్జెట్‌ అంతా అబద్దాలే: రఘువీరా

► అంకెల ఘనం - ఖర్చులలో కోత
► ఇదీ చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్‌ లెక్కలు, ఖర్చుల తీరు
► రానురాను బడ్జెట్‌ను అపహాస్యం చేస్తున్నారు
► ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు డాక్టర్‌ ఎన్‌. రఘువీరారెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గత మూడు బడ్జెట్‌లలో చేసిన విధంగానే 2017-18 లోనూ అంకెలు ఘనంగా చూపించారు. కేటాయింపులు ఘనంగా చూపించడం కోసమే కానీ ఖర్చు చేయడానికి కాదు అన్నట్లు బడ్జెట్‌లను చంద్రబాబు ప్రభుత్వం అపహాస్యం చేస్తున్నది. గత మూడు బడ్జెట్‌లలో బలహీన వర్గాలకు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించిన నిధులలో 30 శాతం కూడా ఖర్చుచేయలేదు.
 
రైతు రుణమాఫీకి ఈ బడ్జెట్‌లోనూ అన్యాయం
3,600 కోట్లు వడ్డీకి కూడా సరిపోవు.
రైతు రుణమఫీ హామీ ఇచ్చిన చంద్రబాబు రాష్ట్రంలో 85 వేల కోట్లు రుణాలు ఉన్నట్లు లెక్క తేల్చారు.  కోటయ్య కమిటీ వేసి 24 వేల కోట్లకు వాటిని కుదించారు. అదీ 5 సంవత్సరాల్లో హామీ నెరవేరేస్తామన్నారు. గత మూడు బడ్జెట్‌లలో 8,600 కోట్లు కేటాయించగా ఇప్పుడు 2017-18 బడ్జెట్‌లో కేవలం 3,600 కోట్లు కేటాయించారు. మొత్తం కలిపితే 12,200 కోట్లు. అంటే చంద్రబాబు కుదించిన 24 వేల కోట్లకు కూడా రైతు రుణమాఫీ చేయడం లేదని బడ్జెట్‌ కేటాయింపులను బట్టి అర్ధమయింది. రైతు రుణమాఫీ పేరుతో ఓట్లు వేయించుకొని చంద్రబాబు రైతులను నిండా ముంచాడని ఈ బడ్జెట్‌లో మరోసారి రుజువైంది.

డ్వాక్రా రుణాల మాఫీ కూడా లేనట్లే..!
మహిళా లోకాన్ని అప్పుల్లోకి నెట్టిన బాబు ప్రభుత్వం.
డ్వాక్రా గ్రూపులకు 1600 కోట్లు క్యాపిటల్‌ ఇన్‌ప్యూజన్‌ పేరుతో కేటాయింపు. డ్వాక్రా గ్రూపు రుణాలకు పూర్తిగా మాఫీ చేస్తానని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు.  కానీ గెలిచాక రుణమాఫీకి బదులు మూలనిధికి ఒక్కొకరికి 10 వేలు వేస్తామన్నాడు. తీరా ఒక్కొకరికి 3 వేలు మాత్రమే కేటాయించి వాటిని తీసుకోవడానికి వీలులేదని మూలనిధి అంటూ బ్యాంకుల్లోనే ఉంచాడు. ఇప్పుడు ఈ బడ్జెట్‌లో కూడా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ నిధులు  కేటాయించ కుండా అన్యాయం చేశాడు.

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయింపులు చూపిస్తున్నారు... ఖర్చులు చేయడంలేదు.
ఈ బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉపప్రణాళిక చట్టం ప్రకారం లెక్కల్లో శాతాన్ని చూపించారు. కానీ గత మూడు బడ్జెట్‌లలో ఖర్చుల అనుభవం చూస్తుంటే కనీసం 30 నుంచి 40 శాతం నిధులు ఖర్చు చేయడంలేదు. కొన్ని నిధులను దారిమళ్లిస్తున్నారు. కనుక లెక్కలను చూపి ప్రభుత్వం హీనవర్గాలను మాయచేయాలని చూస్తోంది.

నిరుద్యోగులకు మరో మోసం..!
ఆర్థిక సాయం పేరిట 500 కోట్లు.. ఒక్కొక్కరికి రూ. 100 కూడా రావు.
చంద్రబాబు 2014 ఎన్నికల్లో నిరుద్యోగ యువతకు నెలకు ఒక్కొక్కరికీ 2 వేల రూపాయలు నిరుద్యోగభృతి ఇస్తామని హామీ ఇచ్చారు. గత మూడు బడ్జెట్‌లలో దీనికి సంబంధించి ఎటువంటి కేటాయింపులు లేవు. ఈ బడ్జెట్‌లో నిరుద్యోగ భృతికి అనకుండా ఆర్థిక సాయంకు 500 కోట్లు అని చెప్పారు. ఆ మొత్తం ఒక్కొక్క నిరుద్యోగికి నెలకు కనీసం రూ. 100 కూడా రావు.

ఇంటికో ఉద్యోగం హామీ ఏమైంది..?
బడ్జెట్‌ సందర్భంగా ప్రభుత్వం ఇప్పటి వరకూ ప్రభుత్వ ఉద్యోగాలను కేవలం 869 ఉద్యోగాలను ఇచ్చినట్టు మరో 10వేల ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు చెప్పింది. అంటే ఇంటికో ఉద్యోగం హామీ కూడు మోసమేనని చెప్పకనే చెప్పింది.

విద్యుత్‌ చార్జీల పెంపుకు ప్రభుత్వం సిద్ధమైందా..?
విద్యుత్‌ రంగానికి ఈ బడ్జెట్‌లో 3,735  కోట్లను కేటాయింపులు చూపింది. దీనిలో సుమారు 2 వేల కోట్లు సబ్సిడీలకే సరిపోతుంది. కనుక విద్యుత్‌ చార్జీలను పెంచి ఆర్థికలోటును పూడ్చుకోవాలని ప్రభుత్వ ఆలోచన చేస్తున్నట్లు అర్ధమవుతోంది.

పేదలకు గృహ నిర్మాణం కలేనా..?
చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకూ పేదలకు గృహనిర్మాణాలు చేపట్టలేదు. ఈ బడ్జెట్‌లో కూడా 1200 కోట్లు కేటాయింపులు చూపారు. ఇవి ఆ శాఖ జీతభత్యాలకే సరిపోతుంది. అంటే ఈ బడ్జెట్‌లో కూడా పేదలకు గృహనిర్మాణాలకు పెద్దగా కేటాయింపులు చేయలేదు. ఇది గూడులేని పేదలకు అన్యాయం చేయడమే.

అక్రమ మద్యరహిత రాష్ట్రం అంటే మరో మోసం..
చంద్రబాబు ఎన్నికల్లో దశలవారీగా మధ్యనియంత్రణ ద్వారా మద్య నిషేదానికి హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు అక్రమ మద్య రహిత రాష్ట్రం అంటూ నినాదం మార్చారు.

నదుల అనుసంధానం ద్వారా 10 లక్షల ఎకరాల స్థిరీకరణ జరిగిందంట.. ఎంత అబద్దం..?
పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నదుల అనుసంధానం జరిగి సుమారు 10 లక్షల ఎకరాల స్థిరీకరణ జరిగిందని బడ్జెట్‌లో చెప్పడం హాస్యాస్పదం.

వైద్య, ఆరోగ్యశాఖలకు నిధుల తగ్గింపు..!
బడ్జెట్‌లో కనీసం 6 శాతం వైద్య, ఆరోగ్య రంగాలకు కేటాయించాల్సి ఉంటుంది. అంటే ఈ బడ్జెట్‌లో కనీసం 9 వేల కోట్లు కేటాయించాలి.  ఈ రంగాలకు కూడా నిధుల కుదింపు జరిగింది. అంటే ప్రభుత్వ వైద్యం ప్రజలకు అందుబాటులో ఉంటుందా అనే అనుమానం కలుగుతోంది. ప్రభుత్వమే ప్రైవేట్‌ వైద్యదోపిడీకి అనుకూలంగా ఉన్నట్లు అర్ధమవుతోంది. ఇప్పటికే 104, 108 సేవలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. భవిష్యత్తులో వీటి సేవలు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉందని ఈ బడ్జెట్‌ నిధుల కేటాయింపు ద్వారా తెలుస్తోంది.

ప్రత్యేక హోదాను 14వ ఆర్ధిక సంఘం వద్దని చెప్పిందనడం అబద్దమే..
ఈ బడ్జెట్‌ సందర్భంగా ఏపికి ప్రత్యేక హోదాను 14వ ఆర్థిక సంఘం వద్దని చెప్పిందని ఆర్థిక మంత్రి చెప్పి రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించారు. దీనిని 14వ ఆర్థిక సంఘం ఎక్కడా చెప్పలేదు.

కరువు సహాయం ప్రస్తావన లేదు.
రాష్ట్రంలో మెజారిటీ మండలాలు కరువుతో అల్లాడుతున్నాయి. ప్రభత్వం కరువు పీడిత ప్రాంతాలకు న్యాయం చేసేవిధంగా బడ్జెట్‌లో ఎలాంటి ప్రస్తావనా లేదు.

మొత్తంగా బడ్జెట్‌ అంకెల గారడీ...
బడ్జట్‌ ప్రతిపాదన -1,56,999 కోట్లు
రెవెన్యూ వ్యయం - 1,25,912 కోట్లు
రెవెన్యూ లోటు - 7,302 కోట్లు
ఆర్థికలోటు - 21, 863 కోట్లు
2016-17 కంటే  15.70 శాతం పెరుగుదల చూపించారు.
ప్రస్తుత ఆర్థక వృద్ధిరేటు 11.61 శాతంగా చూపించారు.
విజన్‌ 2029 లక్ష్యంగా ఏటా 12 శాతం వృద్ధిని నిర్దేశించామని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు