ఎమ్మెల్యే యరపతినేని దౌర్జన్యకాండ

18 Feb, 2019 03:24 IST|Sakshi
ఆదినారాయణను బెదిరిస్తున్న శ్రీనివాసరావు (వృత్తంలో వ్యక్తి)

పల్నాడులో రెచ్చిపోతున్న మైనింగ్‌ మాఫియా

మాజీ ఎమ్మెల్యే జీఎంఆర్‌ కుమారునికి చెందిన క్వారీ ఆక్రమణ

క్వారీ వద్దకు వెళ్లి ప్రశ్నిస్తే బెదిరించిన ఎమ్మెల్యే అనుచరుడు శ్రీనివాసరావు

యరపతినేనితో మాట్లాడుకోవాలని స్పష్టీకరణ

అన్యాయం చేయవద్దంటూ వేడుకున్న కుటుంబసభ్యులు

ఇచ్చినంత తీసుకువెళ్లాలంటూ ఎమ్మెల్యే హుకుం 

జీఎంఆర్‌ కుమారుడు ఆదినారాయణకు ఫోన్‌ చేసి హెచ్చరికలు

మనస్థాపానికి గురై ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్యాయత్నం

ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు.. ఐసీయూలో చికిత్స

ఎమ్మెల్యే పేరు చెప్పొద్దొంటూ ఆస్పత్రి వద్ద అనుచరుల బేరసారాలు

లొంగకపోవడంతో దౌర్జన్యం.. మీడియాపై దురుసు ప్రవర్తన

టీడీపీ కోసం ఎంతో సేవ చేస్తే తగిన శాస్తి జరిగిందని బంధువుల ఆవేదన

తమకేం జరిగినా ఎమ్మెల్యేదే బాధ్యతని స్పష్టీకరణ  

సాక్షి, గుంటూరు: తన ఆకలి తీర్చుకోవడానికి పాము తన పిల్లల్ని తానే తింటుందని చెబుతుంటారు. అదే తీరున గుంటూరు జిల్లా గురజాల అధికార పార్టీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ధనదాహానికి సొంత పార్టీ నేతల్నే బలి తీసుకుంటున్నారు. యరపతినేని కనుసన్నల్లో నడుస్తున్న మైనింగ్‌ మాఫియా.. క్వారీల యజమానులు, లీజుదారులను బెదిరించి దౌర్జన్యంగా క్వారీలను ఆక్రమించి అక్రమ తవ్వకాలకు తెగబడుతోంది. ఇప్పుడు వీరి కన్ను సొంత పార్టీ నేతల క్వారీలపై పడింది. వీరి బారిన పడిన అనేక మంది భూములు కోల్పోయి అప్పులపాలై ఊరు వదలి వెళ్లిపోయారు. తాజాగా గురజాల మాజీ ఎమ్మెల్యే గడిపూడి మల్లికార్జునరావు కుమారుడు ఆదినారాయణ అలియాస్‌ బుజ్జి.. యరపతినేని బెదిరింపులతో మనస్థాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్చగా.. అక్కడికి చేరుకున్న మైనింగ్‌ మాఫియా యరపతినేని పేరు బయట పెట్టవద్దంటూ ఆదినారాయణ సోదరులు, బంధువులతో బేరసారాలకు దిగారు. వాటికి లొంగకపోవడంతో దౌర్జన్యానికి దిగారు. మీడియాపై కూడా దురుసుగా ప్రవర్తిస్తూ నెట్టివేశారు. తమ కుటుంబానికి ఎమ్మెల్యే వల్ల ప్రాణహాని ఉందని, తమకేం జరిగినా ఆయనదే బాధ్యతని కుటుంబసభుల్య మీడియా ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే అనుచరుల క్వారీల దురాక్రమణ
దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే గడిపూడి మల్లికార్జునరావు కుమారుడు ఆదినారాయణ, ఆయన బావమర్ది బెల్లంకొండ పూర్ణచంద్రరావులకు సర్వే నెంబర్‌ 325లో 2. 10 ఎకరాల భూమి ఉంది. అందులో తెల్లరాయి నిక్షేపాలు ఉండటంతో క్వారీ లీజు అనుమతి కోసం దరఖాస్తు చేశారు. దీంతో 2018 జూలై 10వ తేదీన పూర్ణచంద్రరావు పేరుతో మైనింగ్‌ అధికారులు అనుమతులిచ్చారు. ఎమ్మెల్యే యరపతినేని కనుసన్నల్లో నడుస్తున్న మైనింగ్‌ మాఫియాపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం, సీబీసీఐడీ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో మైనింగ్‌ మాఫియా వ్యూహాన్ని మార్చేసింది. గతంలో మూతబడ్డ క్వారీలు, వీరు బెదిరించి నిలుపుదల చేసిన క్వారీలను దౌర్జన్యంగా లాక్కుని వాటికి తిరిగి అనుమతులు తెప్పించుకుని తెల్లరాయిని అక్రమంగా దోచేసే కుట్రకు తెరతీశారు. ఇందులో భాగంగా కేసానుపల్లిలో ఆదినారాయణకు చెందిన క్వారీని కూడా లాగేసుకుని తవ్వకాలు మొదలు పెట్టారు. తమ క్వారీని అప్పగించాలంటూ ఆదినారాయణ గత పదిరోజులుగా యరపతినేని అనుచరుడు, అక్రమ మైనింగ్‌ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న నెల్లూరి శ్రీనివాసరావును కోరినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఎమ్మెల్యే తమకు అప్పగించారని, ఆయనతో మాట్లాడుకుని తేల్చుకోవాలంటూ శ్రీనివాసరావు చెప్పాడు.

ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు
తన క్వారీని లాక్కుని అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న నెల్లూరి శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలంటూ ఆదినారాయణ శనివారం దాచేపల్లి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే పోలీసులు పట్టించుకోలేదు. దీంతో శనివారం రాత్రి ఆదినారాయణ సోదరుడు కోటేశ్వరరావు ఎమ్మెల్యే యరపతినేని వద్దకు వెళ్లి తమ క్వారీ అప్పగించాలంటూ వేడుకున్నారు. ఎంతో కొంత తీసుకుని వెళ్లిపోవాలంటూ చెప్పడంతో చేసేదేమీ లేక వెనక్కు వచ్చేశారు. ఆదివారం ఉదయం ఎమ్మెల్యే ఫోన్‌ చేసి బెదిరించడంతో తీవ్ర మనస్థాపం చెందిన ఆదినారాయణ ఇంటికి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి కొన ఊపిరితో ఉన్న ఆదినారాయణను పిడుగురాళ్ల పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స చేస్తున్నారు. 

యరపతినేని వల్ల మా కుటుంబానికి ప్రాణహాని ఉంది
ఎన్టీ రామారావు టీడీపీని స్థాపించినప్పటి నుంచి మా తండ్రి, మాజీ ఎమ్మెల్యే గడిపూడి మల్లిఖార్జునరావు పార్టీకి అండగా ఉన్నారు. యరపతినేని ఎమ్మెల్యేగా గెలిపించడం కోసం మేం ఎంతో కష్టపడ్డాం. అలాంటి మాపై యరపతినేని వ్యవహరించిన తీరు బాధాకరం. మా సోదరుని క్వారీని ఎమ్మెల్యే అనుచరులు ఆక్రమించారని ఆయన వద్దకు వెళ్లి చెబితే ఎంతోకొంత డబ్బులు తీసుకోమని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే కొడుకులమైన మాకే ఇలా జరిగితే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోండి. అలాగే మా బావమరిదిని కూడా బెదిరించి క్వారీని స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే ఫోన్‌లో మాట్లాడిన తరువాతే మా తమ్ముడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యరపతినేని వల్ల మా కుటుంబానికి ప్రాణ హాని ఉంది. మాకు ఏం జరిగినా ఆయనదే బాధ్యత.
– గడిపూడి కోటేశ్వరరావు, లక్ష్మయ్య(ఆదినారాయణ సోదరులు)

మరిన్ని వార్తలు