ర్యాగింగ్ మానవ ప్రవృత్తికాదు

11 Aug, 2015 01:26 IST|Sakshi

న్యాయమూర్తి నిరంజన్
 
వన్‌టౌన్ : ర్యాగింగ్ లాంటి చర్యలు మానవ ప్రవృత్తి కాదని వాటికి విద్యార్థులు దూరంగా ఉండాలని అదనపు మెట్రోపాలిటిన్ సెషన్స్ జిల్లా న్యాయమూర్తి ఆర్.నిరంజన్ అన్నారు. కేబీఎన్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విభాగం, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ, విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ‘ర్యాగింగ్ రహిత విద్యావ్యవస్థ’పై అవగాహన సదస్సును ఆ కళాశాల ప్రాంగణంలో సోమవారం సాయంత్రం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హజరైన న్యాయమూర్తి ఆర్.నిరంజన్ మాట్లాడుతూ ఎదుటి వ్యక్తుల మనోభావాలను దెబ్బతీసే ప్రతి చర్య చట్టవ్యతిరేకమేనన్నారు.  ఒక విద్యార్థి ఆరు మాసాల కన్నా అధికంగా శిక్ష అనుభవిస్తే ఏ విద్యాసంస్థలోనూ చదువుకోవడం కుదరదన్నారు. 

కొత్తపేట సీఐ ఎన్.దుర్గారావు మాట్లాడుతూ  ర్యాగింగ్‌కు పాల్పడటం వల్ల  విద్యార్థులు జీవితాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ర్యాగింగ్ వంటి చర్యలను నిర్మూలించేందుకు విద్యార్థులు పోలీసుశాఖతో కలిసి నడవాలని కోరారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఎస్.రజిత్‌కుమార్ మాట్లాడుతూ  కళాశాలలో 60 శాతం విద్యార్థినులే ఉన్నారని, వారందరినీ కంటికి రెప్పలా కాపాడుకునేందుకు అప్రమత్తంగా ఉంటున్నామన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.కృష్ణమూర్తి , వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి.నారాయణరావు మాట్లాడుతూ కళాశాలలో తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్-2 ప్రొగ్రామ్ ఆఫీసర్ వి.శేషగిరిరావు నిర్వహించగా తెలుగు విభాగాధిపతి డాక్టర్ చలపతిరావు వందన సమర్పణ చేశారు. అధ్యాపకులు జే.పాండురంగారావు, ఎం.సాంబశివరావు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు