రైల్వే అలర్ట్‌

17 Dec, 2018 02:59 IST|Sakshi

గుంటూరు, విజయవాడల్లో హెల్ప్‌లైన్‌ కేంద్రాలు

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌కు పెథాయ్‌ తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. సోమవారం తుపాను తీరాన్ని దాటనున్న నేపథ్యంలో ప్రయాణికుల భద్రతపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ఈ విషయమై దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌ కుమార్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తుపానుపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ప్రయాణికుల భద్రత, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. రైలు పట్టాల వెంబడి నిరంతర గస్తీని కొనసాగించాలని స్పష్టం చేశారు.

కోస్తాంధ్రాలోని అన్ని రైల్వేస్టేషన్ల స్టేషన్‌ మాస్టర్లు రాష్ట్ర అధికారులు, రైల్వే ఉన్నతాధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని, పరిస్థితిని బట్టి సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. అవసరమైతే.. ఆహారం, నీరు తదితర సదుపాయాలు కల్పించాలని తెలిపారు. తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు గుంటూరు, విజయవాడల్లో 24 గంటలు పనిచేసే రెండు హెల్ప్‌లైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు