బడ్జెట్‌ రైలు ఆగేనా?

1 Feb, 2020 04:02 IST|Sakshi

రాష్ట్రంలో పలు పెండింగ్‌ ప్రాజెక్టులు

విశాఖ రైల్వే జోన్‌కు ఊతమిచ్చేనా?

నడికుడి–శ్రీకాళహస్తి, కోటిపల్లి– నరసాపురం, కడప–బెంగళూరు, ఓబులవారిపల్లి–కృష్ణపట్నం

రైల్వే లైన్లకు నిధులిస్తేనే మోక్షం

విజయవాడ–కాజీపేట, విజయవాడ–గూడూరు మూడో లైన్‌ ప్రాజెక్టులదీ అదే పరిస్థితి 

గణనీయంగా ఆదాయం అందిస్తున్నా ఏటా మనకు అన్యాయమే

సాక్షి, అమరావతి: పార్లమెంట్‌లో నేడు రైల్వే బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈసారైనా కేంద్రం కరుణిస్తేనే పలు కీలక ప్రాజెక్టులు పట్టాలెక్కే అవకాశం ఉంది. దక్షిణ మధ్య రైల్వేలో అధిక శాతం ఆదాయం ఏపీ నుంచే లభిస్తున్నా ఆ మేరకు న్యాయం జరగడం లేదు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినా నిధులు, విధులు తేలక అయోమయం నెలకొంది. రాష్ట్రంలో ప్రాధాన్య ప్రాజెక్టులన్నీ కాస్ట్‌ షేరింగ్‌ విధానంలో మంజూరయ్యాయి.

రాష్ట్రం తన వాటాగా భూ సేకరణ జరిపి భూమిని అప్పగిస్తే రైల్వే శాఖ నిధులు మంజూరు చేసి ప్రాజెక్టులు పూర్తి చేయాలి. నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే లైన్‌ అంచనా వ్యయం పెరగకముందే నిధులు కేటాయించి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు. కోటిపల్లి–నరసాపురం, కడప–బెంగళూరు, డబ్లింగ్‌ ప్రాజెక్టులు, మూడో లైన్ల పూర్తికి కేంద్రం ఏ మేరకు సహకరిస్తుందో చూడాల్సిందే. ఇక 2012, 2013లోనే మంజూరైన భద్రాచలం–కొవ్వూరు, కొండపల్లి–కొత్తగూడెం ప్రాజెక్టులు పూర్తి కావాలంటే నిధులు అత్యవసరం.

పట్టాలెక్కని ప్రతిపాదనలు!
స్టేషన్‌ రీ డెవలప్‌మెంట్‌ కింద తిరుపతి, విజయవాడ, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, గుంతకల్‌ స్టేషన్లను అభివృద్ధి చేసేందుకు రైల్వే శాఖ గతంలో అంగీకరించింది. విజయవాడను శాటిలైట్‌ స్టేషన్‌గా తీర్చిదిద్దాలని ఏన్నో ఏళ్ల నుంచి ప్రతిపాదనలున్నాయి. గతంలో గుంతకల్‌ డివిజన్‌లో చంద్రగిరి, గుంటూరు డివిజన్‌లో న్యూ గుంటూరు, ఫిరంగిపురం, విజయవాడ డివిజన్‌లో రామవరప్పాడు స్టేషన్లను మహిళా స్టేషన్లుగా ప్రకటించారు. మొత్తం మహిళా సిబ్బంది ఈ స్టేషన్లలో విధులు నిర్వహించేలా రైల్వే శాఖ ఆదేశాలిచ్చింది. వీటిని అభివృద్ధి చేయాల్సి ఉంది.  

కొత్త రైల్వే లైన్లపై కరుణించేనా?
నరసరావుపేట–మచిలీపట్నం, కంభం–ఒంగోలు, చిత్తూరు–కుప్పం వయా పలమనేరు, ఓబులవారిపల్లె–వాయల్పాడు రైల్వే లైన్ల సర్వేపై బోర్డు ఏమీ తేల్చడం లేదు. మచిలీపట్నం–బాపట్ల కనెక్టివిటీ కోసం సర్వే చేసి అంచనా వ్యయం రూ.793 కోట్లుగా తేల్చినా నివేదికను పక్కన పెట్టారు.  

ప్రైవేట్‌ రైళ్ల ప్రతిపాదనలు..
విజయవాడ–దువ్వాడ మధ్య 335 కి.మీ. మేర మూడో లైన్‌ను నిర్మించాలి. విశాఖకు కనెక్టివిటీ పెంచేందుకు 2015–16లోనే రూ.3,873 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు రూపొందించారు. ఈ బడ్జెట్‌లో మూడో లైన్‌కు నిధులు కేటాయించాలని కోరుతున్నారు. తేజాస్‌ తరహాలో తిరుపతి–విశాఖ, సికింద్రాబాద్‌–విశాఖ మధ్య ప్రైవేట్‌ రైళ్ల ప్రతిపాదనలున్నాయి. 

మరిన్ని వార్తలు