పర్యాటకశాఖకు రైల్వే షాక్‌!

16 Aug, 2018 06:54 IST|Sakshi
అరకు అందాలు చూపించే కిరండూల్‌ పాసింజర్‌

ఆరు నెలలుగా ఆర్‌ఆర్‌ ప్యాకేజీకి బ్రేక్‌

గణనీయంగా పడిపోయిన ఆదాయం

వచ్చే నెల నుంచి సీజను ఆరంభం

అప్పటికైనా అనుమతివస్తుందని ఆశాభావం     

సాక్షి, విశాఖపట్నం: విశాఖ అంటేనే పర్యాటకుల స్వర్గధామం.. ప్రకృతి రమణీయతతో పులకరింపజేసే మన్యం అందాలు అదనపు ఆభరణం.. వాటిని ఆస్వాదించడానికి దేశవిదేశాల నుంచి ఏటా లక్షలాది మంది పర్యాటకులు వస్తుంటారు. ఇందులో అధికశాతం టూరిస్టులు అరకు ప్రాంతానికి వెళ్లడానికి ఇష్టపడతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పర్యాటకశాఖ గతంలోనే అరకుకు రైల్‌ కం రోడ్డు (ఆర్‌ఆర్‌) ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాకేజీలో విశాఖ నుంచి ఉదయం 7 గంటలకు కిరండూల్‌ పాసింజర్‌ రైలులో అరకు తీసుకెళ్లి తిరుగు ప్రయాణంలో బస్సులో రాత్రి నగరానికి తీసుకొస్తుంది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్‌ను ఉచితంగా అందిస్తుంది. ఇందుకోసం ఒక్కొక్కరికి రూ.960 వసూలు చేస్తోంది. విశాఖ నుంచి అరకు 128 కిలోమీటర్ల దూరం ఉంది. మార్గంమధ్యలో లోతైన లోయలు, ఎత్తయిన పర్వతశ్రేణులు, దిగువన గలగల పారే సెలయేళ్లు, కొండలపై నుంచి జలజల పారే జలపాతాలు కనువిందు చేస్తాయి. మధ్యమధ్యలో పచ్చని పొలాలు, వంపులు తిరుగుతూ వెళ్లే రైలు నుంచి అగుపిస్తాయి. మార్గంమధ్యలో పొడవైన గుహల్లోని రైలు దూసుకుపోతుంటే పర్యాటకులు ఎంతో తీయని అనుభూతి పొందుతారు. ఇలా నాలుగు గంటలపాటు ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ మైమరచిపోతుంటారు. తిరుగు ప్రయాణంలో పర్యాటకశాఖ బస్సుల్లో బొర్రాగుహలు, టైడా జంగిల్‌బెల్స్‌ వంటి పర్యాటక ప్రదేశాలకు తీసుకెళ్తారు. ఇలా ఇటు రైలు మార్గం, అటు బస్సు రూటు ద్వారా అందాలను తనివి తీరా ఆస్వాదించే అవకాశం ఉండడం వల్ల ఆర్‌ఆర్‌ ప్యాకేజీకి ఎంతో డిమాండ్‌ ఉంది.

మోకాలడ్డిన రైల్వే..
ఈ తరుణంలో ఈ రైలులో పర్యాటకులను రిజర్వేషన్లు లేకుండా అనుమతించబోమంటూ ఆరు నెలల క్రితం రైల్వేశాఖ అభ్యంతరం చెప్పింది. ఇన్నాళ్లూ ఈ కిరండూల్‌ పాసింజర్‌లో ఒక బోగీని పర్యాటకశాఖ సిబ్బంది అనధికారికంగా ఆక్రమించుకుని అందులో ఆర్‌ఆర్‌ ప్యాకేజీ తీసుకున్న పర్యాటకులను ఎక్కించేవారు. దీనికి రైల్వే అధికారులు బ్రేకులు వేయడంతో ఆర్‌ఆర్‌ ప్యాకేజీని అర్థాంతరంగా నిలిపేయాల్సి వచ్చింది. ఆర్‌ఆర్‌ ప్యాకేజీని ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే సదుపాయం ఉంది. అయితే పర్యాటక అధికారులు వెనువెంటనే దానిని తొలగించక పోవడంతో కొంతమంది ఆన్‌లైన్‌లో ఈ ప్యాకేజీని బుక్‌ చేసుకునేవారు. తీరా ఇక్కడకు వచ్చాక రైలు సదుపాయం లేదని చెప్పడంతో పర్యాటకశాఖ సిబ్బందికి, పర్యాటకులకూ వాగ్వాదాలు చోటు చేసుకునేవి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఇటీవలే ఆన్‌లైన్‌ బుకింగ్‌ను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. దీంతో విశాఖలోని సెంట్రల్‌ రిజర్వేషన్‌ ఆఫీసులో విధులు నిర్వహించే జనరల్‌ హెల్పర్లు పనిలేకుండా ఉన్నారు.

ఎడతెగని ప్రయత్నాలు..
ఈ పరిస్థితుల్లో అప్పట్నుంచి పర్యాటకశాఖ అధికారులు రైల్వే ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. రోజుకు తమకు ప్రత్యేకంగా ఒక బోగీ కేటాయించాలని వీరు కోరుతున్నారు. ఇందుకు రైల్వే అధికారులు రూ.40 వేలు అద్దె చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అంటే ఒక్కో పర్యాటకునికి సగటున రూ.500 చొప్పున చెల్లించాల్సి వస్తుందన్న మాట! ఇది భారమని, అద్దె తగ్గించాలని చేస్తున్న విజ్ఞప్తికి ఇంకా స్పందన రాలేదు. మరోవైపు సెప్టెంబర్‌ నుంచి బెంగాలీ పర్యాటకుల సీజను మొదలవుతుంది. రోజూ పెద్ద సంఖ్యలో మూడు నెలల పాటు అరకు పర్యటనకు వెళ్తుంటారు. వీరంతా ఆర్‌ఆర్‌ ప్యాకేజీకే మొగ్గు చూపుతారు. పర్యాటక శాఖ హోటళ్లలో బస చేస్తారు. ఇది టూరిజం శాఖకు ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే రైల్వే శాఖ నుంచి సానుకూల స్పందన వస్తుందని, ఆర్‌ఆర్‌ ప్యాకేజీని పునరుద్ధరిస్తామని పర్యాటకాభివృద్ధి సంస్థ డివినల్‌ మేనేజర్‌ ప్రసాదరెడ్డి ‘సాక్షి’కి చెప్పారు.

బస్సు ప్యాకేజీపై అసంతృప్తి
అప్పట్నుంచి ఏజెన్సీకి పర్యాటకులను ఈ ప్యాకేజీలో బస్సులో తీసుకెళ్లి తీసుకొస్తున్నారు. దీంతో వీరు రానూపోనూ చూసిన అందాలనే చూడాల్సి వస్తోంది. రైలు మార్గంలో కనిపించే అందాలన్నీ అగుపించడం లేదు. దీంతో టూరిస్టులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బస్సు ప్యాకేజీకి ఆసక్తి చూపకపోవడంతో వీరి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఆర్‌ఆర్‌ ప్యాకేజీలో రోజుకు సగటున 90 మంది వరకు వెళ్లే వారు. తిరుగు ప్రయాణంలో రావడం కోసం వీరికి మూడు బస్సులను కేటాయించేవారు. ఇప్పుడా సంఖ్య 20–25 కూడా ఉండడం లేదు. ఫలితంగా కొన్ని సందర్భాల్లో వచ్చిన పర్యాటకులను వెనక్కి పంపలేక, వారిని తీసుకెళ్లలేక సతమతమయ్యే పరిస్థితి తలెత్తుతోంది. పర్యాటకులు తగ్గిపోవడంతో ఆ శాఖకు ఆదాయం బాగా పడిపోయింది.

మరిన్ని వార్తలు