రైల్వే డివిజన్‌లో పెరిగిన ప్రయాణికుల రద్దీ

31 Mar, 2016 01:38 IST|Sakshi
రైల్వే డివిజన్‌లో పెరిగిన ప్రయాణికుల రద్దీ

 రైల్వే యూజర్స్ కమిటీ సమావేశంలో డీఆర్‌ఎం  
 
నగరంపాలెం (గుంటూరు) : గత ఏడాదితో పోలిస్తే ఈసారి గుంటూరు రైల్వే డివిజన్‌లో ప్రయాణికుల వృద్ధి రేటు పెరిగిందని డీఆర్‌ఎం విజయశర్మ తెలిపారు. పట్టాభిపురంలోని రైల్ వికాస్ భవన్‌లోని కొండవీడు కాన్ఫరెన్స్ హాలులో బుధవారం జరిగిన నాల్గవ డివిజను రైల్వే యూజర్స్ కన్సల్టెంట్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సరుకు రవాణాలో మార్పులు లేకపోయినా ప్రయాణికులు మాత్రం 6.6 శాతం పెరిగారన్నారు.  రైల్వేస్టేషన్లలో బల్లలు, ఇతర అవసరాలు ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలు, ప్రజా ప్రతినిధులు ముందుకు వస్తే అనుమతులు ఇస్తామన్నారు.

డివిజన్‌లో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులు, ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఆదాయం తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సమావేశంలో డీఆర్‌ఎం వివరించారు. డివిజన్ పరిధిలో రాజధాని ఏర్పాటు అవుతున్నందున గుంటూరు స్టేషను నుంచి నేరుగా ఢిల్లీకీ, వారణాసికీ రైళ్ళు నడపాలని మెంబరు ఆతుకూరి ఆంజనేయులు కోరారు. గుంటూరు - తెనాలి డబ్లింగ్ పనులు త్వరగా పూర్తి చేసి విజయవాడ-గుంటూరు-తెనాలికి సర్క్యులర్ రైళ్ళు నడపాలని కోరారు. సమావేశంలో మెంబర్లు వి. శ్రీనివాసులు, ఆర్.కె.జె. నరసింహం, ఎం. కోటిరెడ్డి, జి.ఎన్. మూర్తి, కిలారి రామారావు, జి. కిరణ్, కె. వెంకటరెడ్డి, ఏడీఆర్‌ఎం అంబాడే పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు