చలిదెబ్బకు రైల్వేకు వణుకు

14 Dec, 2019 08:35 IST|Sakshi
విరిగిన రైలుపట్టాలను మరమ్మతులు చేస్తున్న గ్యాంగ్‌మెన్‌ (ఫైల్‌పోటో)

విరుగుతున్న రైలు కమ్మీలు

నెల రోజుల్లో 9 ప్రాంతాల్లో విరిగిన పట్టాలు 

సాక్షి, గుంతకల్లు: శీతాకాలం అంటే రైల్వే అధికారులకు హడల్‌. ఈ కాలంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో రైలు కమ్మీలకు తగినంత ఉష్ణోగ్రత లేని కారణంగా రైలు కమ్మీలు, రైల్‌ వెల్డింగ్‌లు విరిగిపోవడం సర్వసాధారణం. ముఖ్యంగా నల్లరేగడి, చెరువుల సమీపాన ఉన్న ట్రాక్‌ల వద్ద ఈ సమస్య అధికంగా ఉంటుంది. వేకువజామున 3.00 గంటల నుంచి ఉదయం 7.00 గంటల వరకు, సాయంత్రం 7.00 రాత్రి 10.00 గంటల మధ్య రైలు కమ్మీలు చలి తీవ్రతకు బ్రేక్‌ అవుతుంటాయి. గడిచిన నెలరోజుల్లో డివిజన్‌ వ్యాప్తంగా 09 ప్రాంతాల్లో రైలు పట్టాలు విరిగినట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. రైలు మార్గాలను అనునిత్యం పర్యవేక్షించడానికి ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన అధికారులు, సిబ్బంది పని చేస్తుంటారు. ముఖ్యంగా రైల్వే లోకో సిబ్బంది (రైళ్ల డ్రైవర్లు, సహా డ్రైవర్లు) అప్రమత్తంగా లేకపోతే ఘోర ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.  

ఒక్కరితోనే 16 కి.మీల గస్తీ.. 
ట్రాక్‌ పరిరక్షణలో అత్యంత కీలకమైన ట్రాక్‌మెన్‌ రోజూ 16 కి.మీలు గస్తీ నిర్వహించాల్సి ఉంటుంది. ఒక్కొక్క గ్యాంగ్‌మెన్‌ 4 కి.మీలు పరిధి పర్యవేక్షించాల్సి ఉంటుంది. రెండు పర్యాయాలు ఈ మార్గంలో గ్యాంగ్‌మెన్‌ తనిఖీ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం 6.00 నుంచి అర్ధరాత్రి 12.00 గంటల దాకా ఒక షిప్టు, ఇదిలా ఉండగా మధ్యరాత్రి 12.15 గంటల నుంచి ఉదయం 6.00 గంటల వరకు నిర్వహించే నైట్‌ పెట్రోలింగ్‌ (రాత్రి గస్తీ) విధులకు ఇద్దరు గ్యాంగ్‌మెన్‌ పని చేస్తుంటారు. ప్రస్తుతం నైట్‌ పెట్రోలింగ్‌ విధులకు ఒక్క గ్యాంగ్‌మెన్‌ నియమించడం భయాందోళన కల్గిస్తోందని గ్యాంగ్‌మెన్లు చెబుతున్నారు. ఇతర డివిజన్లలో నైట్‌ పెట్రోలింగ్‌ ఇద్దరు గ్యాంగ్‌మెన్‌తో చేయిస్తుంటే గుంతకల్లు రైల్వే డివిజన్‌ పరిధిలో ఒక్కరేతోనే నిర్వహిస్తుండటం దారుణమంటున్నారు.

అసలే చలి కాలం రాత్రిపూట రైలు పట్టాల వెల్డింగ్‌ చలికి కరిగిపోయి పట్టాలు పగిలే ప్రమాదం ఉంది. దురదష్టవశాత్తు రైలు ప్రమాదాలు సంభవిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైలు మార్గాలను అనునిత్యం పర్యవేక్షిస్తూ పెట్రోలింగ్‌ విధులు నిర్వర్తిస్తూ రైలు ప్రమాదాలు నివారించాలంటే రైల్వేబోర్డు నిబంధనల ప్రకారం తగినంత సిబ్బందిని నియమించాల్సి ఉంది. ఈనెల 03న డివిజన్‌లోని వైఎస్సార్‌ కడప జిల్లా రైల్వే కోడూరు సమీపంలో రైలు పట్టాల అసైన్‌మెంట్‌ విరిగి తిరుపతి–షిరిడీ వెళ్లే సాయినగర్‌ షిరిడీ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. ఆ సమయంలో రైలు తక్కువ స్పీడ్‌తో వెళ్తుండటంతో పెను ప్రమాదం జరగలేదు. ఇది ఓ ఉదాహరణ మాత్రమే. ఇలాంటి ప్రమాదాలను అరికట్టాలంటే మాత్రం సిబ్బందిని పెంచాల్సిందే.  

రైలు పట్టాల ఉష్ణోగ్రతపై ఆరా.. 
ప్రస్తుతం చలికాలం కావడంతో రైలు పట్టాలు విరిగే అవకాశం ఎక్కువగా ఉండటంతో రైలు పట్టాల ఉష్ణోగ్రత వివరాలపై ఆరా తీస్తున్నట్లు రైల్వే మార్గాల పర్యవేక్షణ అధికారులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పుల కారణంగా రైలు పట్టాలను తరుచుగా అల్ట్రా సోనిక్‌ ఫ్ల డిటెక్టర్‌ ద్వారా పరీక్షలు చేయాలని సూచించి ఆ వివరాలను తమకు తెలియజేయాలని ఆదేశించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.  

వేధిస్తున్న సిబ్బంది కొరత.. 
గుంతకల్లు డివిజన్‌ మొత్తం మీద 1354.27 కి.మీల రైలు మార్గం విస్తరించి ఉంది. ఈ మార్గాన్ని పర్యవేక్షించడానికి డివిజన్‌ పరిధిలో 23 ఇంజనీరింగ్‌ డిపోలు రేయింబవళ్లు పని చేస్తున్నాయి. అయినప్పటికీ సిబ్బంది కొరత ఉంది. డివిజన్‌ వ్యాప్తంగా దాదాపు 1700 ట్రాక్‌మెన్‌ పోస్టులు ఖాళీ ఉండగా గడిచిన ఆగస్టు నెలలో 986 పోస్టులు భర్తీ చేశారు. ఇంకా 714 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా