రూ.వెయ్యితో ఏం చేయాలి..?

7 Feb, 2020 13:05 IST|Sakshi

అవి చదివింపులా.. విదిలింపులా..

వాల్తేరు డివిజన్‌లో పలు పనులకు రూ.వెయ్యి చొప్పున కేటాయింపు

రూ.కోట్లు ఖర్చయ్యే డబ్లింగ్‌ పనులకూ అదే విదిలింపు

కొత్తలైన్ల నిర్మాణాలకూ అంతే..

బడ్జెట్‌ కేటాయింపులపై పెదవి విరుస్తున్న రైల్వే అధికారులు

నలుగురు ఉన్న ఫ్యామిలీ సినిమాకి వెళ్తే కనీసం రూ.2 వేలు ఖర్చవుతుంది.ఇంట్లో చిన్న మరమ్మతు చేయాలన్నా వెయ్యికి పైగానే ఖర్చవుతుంది..చిన్న షాపులో మౌలిక వసతులు కల్పించాలంటే కనీసం 10 వేలు చేతిలో ఉండాల్సిందే..మరి.. ప్రపంచంలోని అతి పెద్ద వ్యవస్థల్లో ఒకటిగా చెప్పుకొంటున్న రైల్వేలో ఓ చిన్నపాటి ప్రాజెక్టు ప్రారంభించాలంటే..?కనీసం లక్షల నుంచి కోట్లలోనే అవసరమవుతాయి..
ఒక ప్రాజెక్టుకు డీపీఆర్‌ సిద్ధం చేయాలంటేనే లక్ష రూపాయల వరకు వెచ్చించాల్సిందే..అలాంటిది.. దాని కోసం రూ.వెయ్యి మాత్రమే ఇస్తే..?!వాటితో ఏం చేస్తారు.?ఏమో..? సదరు రైల్వే మంత్రిత్వ శాఖకే తెలియాలి!ఆ వెయ్యి రూపాయలు కేటాయించిందీ.. ఏవో మిసిలేనియస్‌(చిల్లర) ఖర్చులకు కాదండోయ్‌..రూ.లక్షలు.. కోట్లు ఖర్చయ్యే ప్రాజెక్టులకు.. పెళ్లికి చదివించినట్లు వెయ్యి రూపాయలు చొప్పున కేటాయించారు.2020–21 బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు చూస్తే.. ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు.ఆ ప్రాజెక్టులేంటో..? వెయ్యి రూపాయల విడ్డూరమేంటో.. ఓసారి చదివేద్దాం..

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పార్లమెంటులో ఫిబ్రవరి ఒకటో తేదీన ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో వాల్తేరు డివిజన్‌కు విదిల్చిన నిధుల వివరాలు చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకు రూ.170 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసిన ప్రభుత్వం.. బడ్జెట్‌లో మాత్రం రూ.3 కోట్లు విదిల్చిన వైనం చూస్తే.. జోన్‌ ఏర్పాటుకు ఇప్పట్లో కేంద్రం సిద్ధంగా లేదన్న విషయం అర్థమైపోతుంది. ప్రస్తుతం తూర్పుకోస్తా రైల్వే జోన్‌ పరిధిలో ఉన్న వాల్తేరు డివిజన్‌కు చేసిన కేటాయింపులూ ఏమంత ఆశాజనకంగా లేవు. మొత్తంగా డివిజన్‌కు రూ.878 కోట్లు మంజూరు చేశారు. ఇందులో 2, 3 లైన్ల నిర్మాణాలకు రూ.580.50 కోట్లు ఇవ్వగా.. ప్రాజెక్టులకు రూ.94.98 కోట్లు కేటాయించారు. అదేవిధంగా సిగ్నల్‌ వ్యవస్థ, వంతెనలు, సబ్‌వే నిర్మాణాలు, యార్డుల ఆధునికీకరణ, ట్రాక్‌ మరమ్మతులు సహా ఇతర పనులకు మొత్తం రూ.202.40 కోట్లు కేటాయించారు. ఇదంతా ఒకెత్తయితే.. కొన్ని ప్రాజెక్టులకు చేసిన కేటాయింపులు మరీ హాస్యాస్పదంగా ఉన్నాయి.

అబ్బో.. వెయ్యి రూపాయలా..?!
బడ్జెట్‌కు సంబంధించి రైల్వే బోర్డు బుధవారం విడుదల చేసిన పింక్‌ బుక్‌లో వాల్తేరు డివిజన్, విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ పేర్లు అనేక చోట్ల కనిపిస్తున్నాయి కానీ.. ఆయా ప్రాజెక్టులకు కేటాయించిన నిధుల అంకెలు మాత్రం అవాక్కయ్యేలా చేస్తున్నాయి. నిర్మాణాలకు కావల్సిన మెట్రిక్‌ టన్ను ఐరన్‌ కొనుగోలుకే కనీసం రూ.40వేలు అవసరం. అలాంటిది ఒక రైల్వే యార్డు రీ మోడలింగ్‌కు రూ.1000 ఇస్తే.. అది దేనికి పనికొస్తుంది? అదే విధంగా రైల్వే లైన్‌ డబ్లింగ్‌ పనులకు వెయ్యి రూపాయిలిస్తే ఏం చేసుకుంటారు..?? కానీ చాలా కేటాయింపులు అలాగే ఉన్నాయి. పోనీ అవేమైనా.. వేలు, లక్ష రూపాయతో పూర్తయ్యే పనులా అంటే.. అదీ కాదు.. కనీసం అర కోటి అయినా కేటాయించకపోతే.. పనులు పట్టాలెక్కని పరిస్థితి. అలాంటిది కేవలం వెయ్యి రూపాయిలిచ్చి.. పని చేపట్టమంటే ఏం చేయాలని వాల్తేరు రైల్వే డివిజన్‌ అధికారులు సైతం విస్తుపోతున్నారు.

ఇంతకీ రూ.1000 అందుకున్న పనులు..వాటి వాస్తవ అంచనా వ్యయం చూద్దాం
విజయనగరం–కొత్తవలస మధ్య 34.7 కిమీ మేర మూడోలైన్‌ అంచనా వ్యయం రూ. 288.37 కోట్లు.. గత రెండు బడ్జెట్లలో రూ.254 కోట్లు ఇచ్చినా.. ఈ బడ్జెట్‌లో వెయ్యి మాత్రమే ఇచ్చారు.
ఉత్తర సింహాచలం–గోపాలపట్నం మధ్య 2.07 కిమీ బైపాస్‌ లైన్‌ డబ్లింగ్‌ పనుల అంచనా వ్యయం రూ.2.60 కోట్లు. దీనికి ఇప్పుడు వెయ్యి, గత బడ్జెట్‌ రూ.లక్ష కేటాయించారు.
ఉత్తర సింహాచలం, గోపాలపట్నం యార్డు రీ మోడలింగ్‌ వ్యయ అంచనా రూ.11.27 కోట్లు
డివిజన్‌ పరిధిలోని 36 ప్రాంతాల్లో ఇంటర్‌లాక్డ్‌ లెవల్‌ క్రాసింగ్‌ల వద్ద ఇంటిగ్రేటెడ్‌ పవర్‌ సప్‌లై పనులు
డివిజన్‌ పరిధిలోని మరో 10 మానవ రహిత లెవల్‌ క్రాసింగ్‌ల పనులు
విశాఖ రైల్వే స్టేషన్‌ పరిధిలోని 15 లెవల్‌ క్రాసింగ్‌ల వద్ద పనులు
140 మానవ రహిత లెవల్‌ క్రాసింగ్‌ పనులు
కొత్తవలస–పెందుర్తి మధ్య 484 మైలు రాయి వద్ద 2 లెవల్‌ క్రాస్‌ పనులు
పలాస–విశాఖపట్నం మధ్య 20.28 కిమీ ట్రాక్‌ రెన్యువల్‌ పనులు
పలాస– విశాఖపట్నం మధ్య 134 చోట్ల ట్రాక్‌ మరమ్మతులు
కొత్తవలస– కిరండూల్‌ మధ్య 6 స్టేషన్లలో టెలికమ్యునికేషన్‌ పనులు
పలాస–విశాఖపట్నం మధ్య 10 ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాక్డ్‌ వ్యవస్థకు చెందిన గూమ్‌టీల వద్ద సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్‌ పనులు
విశాఖపట్నం సెంట్రల్‌ సిక్‌లైన్‌ అప్‌గ్రెడేషన్, ఓర్‌ ఎక్సే్ఛంజ్‌ సెంటర్‌ వ్యాగన్‌ డిపో పనులు
విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫారాల్లో షెల్టర్ల నిర్మాణం
విశాఖ రైల్వే స్టేషన్‌లో 7, 8 ప్లాట్‌ఫారాల్లో మౌలిక సదుపాయాలు కల్పన
విశాఖ రైల్వే స్టేషన్‌లోని 6, 7, 8 ప్లాట్‌ఫారాల దక్షిణ భాగంలో మెట్లు, ర్యాంపుల నిర్మాణ పనులు
విశాఖ రైల్వే స్టేషన్‌లో సెంట్రల్‌ ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి విస్తరణ పనులు
ఎస్‌.కోట, అరకు రైల్వే స్టేషన్ల మధ్య పలు ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులు
విశాఖ రైల్వే స్టేషన్‌ పరిధిలో మల్టీ డిసిప్లినరీ ట్రైనింగ్‌ సెంటర్‌ నిర్మాణం

కొసమెరుపు..
పెళ్లిళ్లకు, పేరంటాలకు చదివించినట్లు.. పైన పేర్కొన్న వెయ్యి రూపాయలు చొప్పున జరిపిన విదిలింపులపై రైల్వే ఉద్యోగులు సైతం ఇది మా శాఖ చదివింపుల కార్యక్రమం అంటూ సెటైర్లు వేస్తున్నారంటే.. కేటాయింపులు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయో వేరే చెప్పక్కర్లేదు.

మరిన్ని వార్తలు