ప్రతిపాదనలు పట్టాలెక్కేనా..

3 Dec, 2014 01:02 IST|Sakshi
ప్రతిపాదనలు పట్టాలెక్కేనా..

రైల్వేబోర్డుకు ఎంపీల ప్రతిపాదనలు
వచ్చేనెలలో సాధ్యాసాధ్యాలపై చర్చ
ఏటా మిగులుతున్న నిరాశ
ఈసారైనా ప్రజాకాంక్షలకు బడ్జెట్
పట్టంకట్టేనా..

 
విశాఖపట్నం సిటీ: ఈసారైనా బడ్జెట్లో తమ డిమాండ్లు నెరవేరాలని రైల్వే ప్రయాణికులు కోరుకుంటున్నారు. బడ్జెట్‌కు ముందస్తు కసరత్తు దగ్గరపడ్డంతో ప్రజాప్రతినిధులు ఎలాంటి ప్రతిపాదనలు చేస్తారోనని వీరంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎప్పటిలాగే ఇండియన్ రైల్వే టైంటేబుల్ కమిటీ(ఐఆర్‌టిటిసి) నవంబర్‌లో ఎంపీల నుంచి ప్రతిపాదనలను కోరింది. దీనిపై కొందరిప్పటికే నివేదికలు సమర్పించారు. మరి కొందరు ఇవ్వాల్సి వుంది. ఈనెల మొదటి వారంలో ఎంపీలు కోరిన ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉన్నతాధికారులు సర్వే చేస్తారు. సర్వే అనంతరం వచ్చే నెలలో వీటిపై చర్చించి కొన్నింటిని ఆమోదిస్తారు. ఆమోదం పొందిన అంశాలను బడ్జెట్లో పొందుపరుస్తారు. ఈసారి ఎంపీలు ఐఆర్‌టిటిసికి ఇచ్చిన ప్రతిపాదనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
 
ఇవీ ప్రయాణికుల డిమాండ్లు
     
వారణాసికి రెగ్యులర్ రైలు అవసరముంది. లేకుంటే భువనేశ్వర్, సికింద్రాబాద్ వెళ్లి అక్కడి నుంచి మరో రైలు మారి ప్రయాణించాల్సి వస్తోంది. ఢిల్లీకి నాన్ స్టాప్ ఎక్స్‌ప్రెస్ రైలు కావాలి.
     
విశాఖ నుంచి అవృతసర్‌కు వెళుతున్న హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్‌ను రెగ్యులర్ చేయాలి. ప్రతీ సోమ, గురు, శుక్రవారాల్లో విశాఖ నుంచి బయల్దేరుతున్న ఈ రైలును రెగ్యులర్ చేస్తే ప్రస్తుతానికి కాస్త రద్దీని నియంత్రించేనట్టేనని రైల్వే వర్గాలంటున్నాయి.
     
విశాఖ-సికింద్రాబాద్ మధ్య నాన్‌స్టాప్ ఏసీ దురంతో ఎక్స్‌ప్రెస్ ఆది, మంగళ, గురువారాల్లో బయల్దేరుతుంది. ఈ రైలును రెగ్యులర్ చేస్తే కాస్త హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికులకు ఉపయోగకరంగా వుంటుంది.
     
నగరం నుంచి బెంగుళూరుకు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ ఒక్కటే దిక్కయింది. మరొక రైలు కోసం ఎంపీలు పట్టుబడితే ప్రయోజనం వుంటుంది.

రైల్వేబోర్డును ఎంపీలడిగిన రైళ్లివి:
 
ఎంపీ కె. హరిబాబు ఢిల్లీకి విశాఖ నుంచి రైలు కావాలని అడుగుతున్నారు. రైల్వే జోన్ డిమాండ్‌ను ఆయన ప్రస్తావించలేదని తెలిసింది. విజయవాడ నుంచి తెలంగాణా మీదుగా వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను విశాఖ మీదుగా మళ్లించాలని కోరారు.అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు నర్సీపట్నం నుంచి వయా చోడవరం మీదుగా కొత్తవలసకు కొత్త రైల్వే లైన్ కావాలంటున్నారు. అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి రైల్వే స్టేషన్‌లలో ప్లాట్‌ఫారాలు పొడవు, ఎత్తు పెంచాలని, రైల్వే జోన్ కావాలని లేఖ రాశారు.
     
అరుకు ఎంపీ కొత్తపల్లి గీత అరుకు రైలుకు విస్టాడూమ్ అద్దాలున్న బోగీలు కావాలంటూ పాత ప్రతిపాదనే చేసినట్టు తెలిసింది. విజయనగరం ఎంపీ పి. అశోక్ గజపతి రాజు విశాఖ రైళ్లపై కన్నేశారు. విశాఖ-హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్, విశాఖ-తిరుపతి తిరుమల ఎక్స్‌ప్రెస్‌లను విజయనగరం వరకూ పొడిగించాలని కోరుతున్నారు.
 
 
 
 
 

మరిన్ని వార్తలు