రైల్వే ఆదాయం అంతంత మాత్రమే!

4 Oct, 2013 01:26 IST|Sakshi

విజయవాడ, న్యూస్‌లైన్  : రాష్ట్ర విభజన నిర్ణయం వెలువడంతో   రెండు నెలల నుంచి రోడ్డు రవాణా సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు పలు ఇబ్బందులకు గురయ్యారు. అయితే రైళ్లకు ఈ సమైక్య సెగ తగలకపోవడంతో యథావిధిగా నడవడంతో పాటు ఆదాయాన్ని పెంచుకోగలిగింది. కానీ ఆదాయం పెరుగుదల అనుకున్నంత మేర రాలేదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదాయం పెంచుకోవడానికి దక్షిణ మధ్య రైల్వే అనేక ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపడంతో పాటు మరికొన్ని రైళ్లకు అదనపు కోచ్‌లను  ఏర్పాటు చేశారు.

అయితే విజయవాడ రైల్వే డివిజన్‌లో గత సంవత్సరం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లు, అదనపు కోచ్‌లు ఈ ఏడాది ఏర్పాటు చేసిన అదనపు రైళ్లు, కోచ్‌లు ఈ విధంగా ఉన్నాయి. 2012-13లో ఆగస్టులో విజయవాడ మీదుగా 23 ప్రత్యేక రైళు,్ల సెప్టెంబర్ నెలలో 34 ప్రత్యేక రైళ్లు నడిచాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు నెలలో 62, సెప్టెంబర్ నెలలో 90 ప్రత్యేక రైళ్లు నడిచాయి. అదేవిధంగా విజయవాడ డివిజన్‌లో ఈ ఆగస్టులో 10, సెప్టెంబర్‌లో 12 ప్రత్యేక రైళ్లను నడపగా వీటి ద్వారా 10 రైళ్లకు గానూ రూ.22,21,887 ఆదాయం రాగా, సెప్టెంబర్‌లో నడిపిన 12 రైళ్లకు గానూ రూ.31,43,900 ఆదాయం లభించింది.

ఇవి కాక పలు రైళ్లకు 2012-13 సంవత్సరంలో ఆగస్టు నెలలో 76 అదనపు కోచ్‌ల  ద్వారా రూ.  29,48,622 ఆదాయం, సెప్టెంబర్‌లో 83 అదనపు కోచ్‌ల ద్వారా  రూ.29,94,440 ఆదాయం లభించింది. ఈ ఏడాది ఆగస్టు నెలలో 33 అదనపు కోచ్‌లకు గానూ రూ.9,53,160 ఆదాయం రాగా, సెప్టెంబర్ నెలలో నడిపిన 37 అదనపు కోచ్‌లకు గానూ రూ.14,54,857 ఆదాయం లభించింది. దీని ద్వారా రైల్వేకు వచ్చిన ఆదాయం నామమాత్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే విజయవాడ నుంచి హైదరాబాద్‌కు రోడ్డు మార్గం ద్వారా ప్రతిరోజు దాదాపు 500 నుంచి600 బస్సులు నడుస్తూ కోట్లాది రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తూ ఉండేవి. రాష్ట్ర విభజన నిర్ణయం వెలువడిన వద్ద నుంచి ప్రయాణికులు తమ రాకపోకలను తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజులు ఈ సమ్మె కొనసాగినట్లయితే ఆ ప్రభావం అన్ని విభాగాలపై పడే అవకాశముంటుందని అధికారులు అభిప్రాయ పడుతున్నారు.

మరిన్ని వార్తలు