రద్దీ.. రద్దీ..

14 Oct, 2019 11:06 IST|Sakshi

దసరా రద్దీ కొనసాగుతూనే ఉంది. ఆర్టీసీ బస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసి ఉంటున్నాయి. తెలంగాణలో దసరా సెలవులు పొడిగించడం.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు పండుగ సెలవుల మూడ్‌ నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి గమ్యస్థానాలకు బయలుదేరుతుండటంతో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. ఆర్టీసీ, రైల్వే శాఖలు ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నాయి. రద్దీని ఆసరాగా చేసుకుని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ అధిక టికెట్‌ ధరలతో ప్రయాణికుల జేబులకు చిల్లులుపెడుతున్నాయి.  

సాక్షి, విజయవాడ : స్వస్థలాలు, ఉద్యోగ ప్రాంతాలు, చదువుకునే ప్రదేశాలకు వెళ్లేవారు.. వచ్చేవారితో బస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. గత మంగళవారం విజయదశమి వేడుకలు ముగిసినప్పటికీ ఇప్పటికీ ప్రయాణికుల రద్దీ కొనసాగుతూనే ఉంది. బుధవారం సుమారు 250 ప్రత్యేక బస్సులతో సేవలందించిన ఆర్టీసీ శనివారం 80 బస్సులు నడిపింది. ఆదివారం 100కుపైగా ప్రత్యేక బస్సులు నడిపే అవకాశం ఉంది.  

బస్సులు, రైళ్లు ఫుల్‌.. 
ప్రత్యేక రైళ్లు, బస్సులు ఏర్పాటు చేసినా అన్నీ నిండిపోతున్నాయి. రాత్రి అయ్యే సరికి రైల్వే స్టేషన్, బస్‌స్టేషన్‌ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. అర్ధరాత్రి దాటేవరకు రద్దీ తగ్గడం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుల రద్దీతో వారం రోజులుగా రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్‌లో వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి.
 

ప్రత్యేక బాదుడు 
ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని ప్రత్యేక బస్సులను ఏ రోజుకు ఆ రోజు పెంచుతున్నారు. అయితే ప్రయాణికుల సౌకర్యం కోసం మాత్రమే ప్రత్యేక బస్సులు వేస్తున్నారుకుంటే పొరపాటు పడినట్టే. ఈ బస్సులు, రైళ్లలో 50 శాతం అదనపు చార్జీలను వసూలు చేస్తున్నారు.  ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సిటీ బస్సులనే దూర ప్రాంతాలకు నడిపేస్తున్నారు. ఈ సిటీ బస్సుల్లో దూర ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రయాణికులకు నరకం కనిపిస్తోంది. విజయవాడ నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, రాజమండ్రి, అన్నవరం, బెంగళూరు, చెన్నై, కడప, కర్నూలుకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఇక రైల్వే ఐఆర్‌సీటీసీ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నా.. అవి సకాలంలో రావడం లేదు. 

ప్రైవేట్‌ ట్రావెల్స్‌లో రెట్టింపు ధరలు   
బస్‌స్టేషన్‌ (విజయవాడ):   రద్దీని ఆసరాగా చేసుకుని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ నిర్వాహకులు ప్రయాణికులను దోపిడీ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, రైళ్లు కిటకిటలాడుతుండటంతో   ప్రయాణికులు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో వారు రెట్టింపు ధరలతో ప్రయాణికుల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. డిమాండ్‌ పెరగడంతో రేట్లు అమాంతంగా పెంచేశారు. ఏసీ బస్సుల్లో  ప్రయాణం చేయాలంటే దూరాన్ని, రద్దీని బట్టి ఒక్కో టికెట్టుపై వెయ్యి, రూ.2 వేలు అదనంగా వసూలు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు