రైల్వే టెండర్లలో అపశ్రుతి

3 Mar, 2015 03:20 IST|Sakshi

సిండి కేట్‌ను విఫలం చేశాడని కాంట్రాక్టర్‌పై దాడి
 
రైల్వేలో పనులకు నిర్వహించిన టెండర్లకు సంబంధించిన వ్యవహారం ఓ కాంట్రాక్టర్‌పై దాడికి దారితీసింది. సిండికెట్‌గా మారి తక్కువకు టెండర్ దక్కించుకోవాలని పలువురు కాంట్రాక్టర్లు వ్యూహం పన్నారు. అయితే ఓ కాంట్రాక్టర్ ఈ విషయం తెలియక విడిగా టెండ ర్ దాఖలు చేశారు. దీంతో మరికొందరు అదే బాట పట్టారు. తమ వ్యూహం దెబ్బతినడానికి కారణమయ్యాడని కొందరు ఆ కాంట్రాక్టర్‌పై దాడి చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు కేసు నమోదు అయింది.      
 
గుంతకల్లు: గుంతకల్లు డివిజన్ పరిధిలోని రేణిగుంట రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫారం నం-01 నుంచి 05ల మధ్య క్లీనింగ్ పనులకు కోటి 91 లక్షల వ్యయ అంచనాలతో రెండేళ్ల కాలపరిమితితో టెండర్లు నిర్వహించారు. ఈ పనులకు హైదరాబాద్, గుంతకల్లు, కడప, రేణిగుంట, ఆదోని తదితర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు టెండరును దక్కించుకోవడానికి శతవిధాల యత్నించారు. ఈ క్రమంలోనే వీరంతా సిండికేట్‌గా ఏర్పడి గుడ్‌విల్ మాట్లాడుకున్నారు. అయితే హైదరాబాద్‌కు చెందిన ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్ ఏజెన్సీ ప్రతినిధి లక్ష్మీరెడి ఇదే పనికి షెడ్యూల్ దాఖలు చేశారు.

సిండికేట్‌గా ఏర్పడిన కాంట్రాక్టర్లు ఈ విషయం తెలిసి ఖంగుతిన్నారు. ఎవరికివారు తమ తమ షెడ్యూళ్లను దాఖలు చేశారు. దీంతో ఈ పనికి పోటీ ఏర్పడింది. సిండికేట్ యత్నం వీగడానికి కారణమైన ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్ ఏజెన్సీ ప్రతినిధి లక్ష్మీరెడ్డిపై మధ్యాహ్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కాంట్రాక్టర్ లక్ష్మీరెడ్డి ముఖంపై రక్తగాయాలయ్యాయి. వన్‌టౌన్ ఎస్‌ఐ బీవీ నగేష్‌బాబు తమ సిబ్బందితో రైల్వే డీఆర్‌ఎం కార్యాలయానికి చేరుకుని విచారణ చేపట్టారు.

బాధితుడు లక్ష్మీరెడ్డిని ఆరా తీయగా దాడి చేసిందెవరో తెలియదని, తనకు ఈ ప్రాంతం కొత్త అని సమాధానమిచ్చినట్లు ఎస్‌ఐ చెప్పారు. కాంట్రాక్టర్‌పై దాడి హేయం అని, ఇలాంటివి పునరావృతం కాకుండా పోలీసులు దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఓబీసీసెల్ రాష్ట్ర కార్యదర్శి, కాంట్రాక్టర్ గాలి మల్లికార్జున ఈ సందర్భంగా ఎస్‌ఐను కోరారు. బాధిత కాంట్రాక్టర్ లక్ష్మీరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వివరించారు.

>
మరిన్ని వార్తలు