రైతుల పాలిట వ్యాగన్

17 Jan, 2014 06:13 IST|Sakshi

సాక్షి, హన్మకొండ: వ్యాగన్ పరిశ్రమ కలసాకారమయ్యే వేళ మరో చిక్కుముడి వచ్చి పడింది. పాలకులు, ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్య వైఖరే ఇందుకు కారణం. 2009-10 రైల్వే బడ్జెట్‌లో కాజీపేటలో రైల్వే వ్యాగన్ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్లు అప్పటి రైల్వే శాఖ మంత్రి మమతా బెనర్జీ  ప్రక టించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో నిర్మిస్తామని వెల్లడిం చారు.  ఇందులో భాగంగా మడికొండ సమీపంలోని మెట్టుగుట్ట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధీనంలోని 54.38 ఎకరాల భూమిని వ్యాగన్ పరిశ్రమ ఏర్పాటుకు అనువైనదిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. కానీ..  ఆలయ భూములను ఇచ్చేందుకు దేవాదాయ శాఖ విముఖత వ్యక్తం చేయడంతో వ్యాగన్ పరిశ్రమ ఏర్పాటు అటకెక్కింది.  కొంత కాలానికి పరిశ్రమ ఏర్పాటు కోసం ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలని కోరుతూ హై కోర్టును ఆశ్రయించింది.
 
 ఈ మేరకు 2013 ఫిబ్రవరిలో హై కోర్టు అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణకు రూ.18 కోట్లు కేటాయిస్తూ 2013 నవంబర్ 7న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దేవాదాయశాఖకు చెందిన భూములను స్వాధీనం చేసుకునేందుకు జిల్లా యంత్రాగం పనులు మొదలు పెట్టింది. ఎట్టకేలకు పనులు మొదలుపెట్టే సమయం ఆసన్నమైన తరుణంలో మరో వివాదం వ్యాగన్ ఏర్పాటుకు అడ్డంకులు సృష్టిస్తోంది. వ్యాగన్ ఫ్యాక్టరీకి కేటాయించిన 54 ఎకరాలపై 20 రైతు కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి.  తమకు జీవన భృతి చూపకుండా మెట్టుగుట్ట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ భూములను వ్యాగన్ పరిశ్రమకు ఎలా కేటాయిస్తారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఈ భూములను సాగు చేస్తున్నామని... ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే సర్వే చేసేందుకు వెళ్లిన అధికారులను అడ్డుకోవడంతో వివాదం ముదురుతోంది.  
 
 నిర్లక్ష్య ఫలితమే...
 వాస్తవానికి దేవాదాయశాఖకు చెందిన భూములను ఎటువంటి అనుమతి లేకుండానే రైతులు సాగు చేసుకుంటున్నారు.ముప్పై ఏళ్లుగా దేవాదాయశాఖ అధికారులు ఈ రైతులకు నోటీసులు ఇవ్వడం కానీ, కౌలు రైతులుగా గుర్తించేందుకు కానీ ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. మరోవైపు గడిచిన ఐదేళ్లుగా కాజీపేట వ్యాగన్ పరిశ్రమ వ్యవహారం రైల్వే, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నలుగుతోంది. ఈ సందర్భంలో అయినా వ్యాగన్‌కు కేటాయించే భూములపై సర్వే చేయించి ఆ భూములపై ఆధారపడ్డ ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం వహించింది. వ్యాగన్ పరిశ్రమకు ఆలయ భూములు కేటారుుస్తారనే ప్రచారం జరగడంతో తమను కౌలు రైతులుగా గుర్తించడమో... లేకుంటే తమకు ప్రత్యామ్నాయ మార్గం చూపాలని ఇక్కడి రైతులు గ్రీవెన్స్‌సెల్‌లో పలుదఫాలుగా దరఖాస్తు చేసుకున్నారు. అవన్నీ బుట్టదాఖలు కావడంతో సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకుంటున్నారు. మరో నెల రోజుల వ్యవధిలో కేంద్రం  2014-15 రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ వివాదానికి అధికారులు సత్వర పరిష్కారం చూపించాల్సిన అవసరం ఏర్పడింది. సాధ్యమైనంత త్వరగా భూమిని సేకరించి రైల్వేశాఖకు అప్పగించకపోతే.. మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
 
 తాతల నాటి నుంచీ దున్నుకుంటున్నాం
 మేము తాతల కాలం నుంచి దేవాలయ భూములను దున్నుకుంటున్నం. ఇప్పుడు వ్యాగన్ పరిశ్రమకు భూములు ఇస్తే మేము ఎట్ల బతకాలే. నష్టపరిహరం చెల్లించి, ఇంటికొక్కరికి ఉద్యోగం కల్పించాలి. అప్పుడే భూములను అప్పగిస్తాం. ఇన్నేళ్లుగా గ్రామ పంచాయతీకి భూమి సిస్తు చెల్లించినం, బావుల కాడ కరెంట్ బిల్లులు ఉన్నాయి. ఈ భూమిపై మాకే హక్కుంది.
 - ఉల్లేంగుల శ్రీనివాస్  
 
 60 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్నం
 నేను 60 ఏళ్ల్ల సంధి భూమి సాగు చేస్తున్న. ఇప్పుడు ప్రభుత్వం దాన్ని తీసుకుంటే ఎట్ల... నష్ట పరిహారం కట్టియ్యాలే. ఇంట్లో ఒకరికి  వ్యాగన్ పరిశ్రమలో కొలువు ఇయ్యాలే .
 - మామిండ్ల ఉప్పలయ్య  
 
 మొత్తం వ్యాగన్ పరిశ్రమకే పోతున్నది
 నాకు ఉన్న నాలుగెకరాల భూమి మొ త్తం వ్యాగన్ ఫ్యాక్టరీకే పొతున్నది. నేను 50 ఏళ్ల నుంచి సాగు చేసుకుం టున్నా. ఇప్పుడు భూములు తీసుకుంటే కుటుంబం ఎట్లా గడుస్తది.
 - ఎల్పుల వెంకటయ్య

మరిన్ని వార్తలు