అమ్మో.. నెల్లూరు రైల్వేస్టేషన్!

10 Apr, 2017 12:55 IST|Sakshi
అమ్మో.. నెల్లూరు రైల్వేస్టేషన్!

 తొక్కిసలాట కేంద్రంగా గుర్తించిన రైల్వే శాఖ
 
 నెల్లూరు(సెంట్రల్) : నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న చెన్నై-కోల్‌కతా మార్గమధ్యంలోని ప్రధాన రైల్వేస్టేషన్‌లలో నెల్లూరు ఒకటి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైల్వేశాఖ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో పండగ సందర్భాల్లో తొక్కిసలాట జరిగే అవకాశం ఉన్న కేంద్రాల్లో నెల్లూరు ఒకటని అధికారులు వెల్లడించారు. ఏటా నెల్లూరులో జరిగే రొట్టెల పండగ సందర్భంగా మన రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళల నుంచి లక్షల సంఖ్యలో యాత్రికులు వస్తుంటారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని రైల్వే అధికారులు ఆ శాఖ ఉన్నతాధికారులకు నివేదిక పంపారు.  

 తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతి, వరంగల్‌లో జరిగే సమ్మక్క- సారలమ్మ జాతర, రొట్టెల పండగకు నెల్లూరు రైల్వేస్టేషన్ అత్యంత తొక్కిసలాట జరిగే ప్రాంతంగా రైల్వే అధికారులు గుర్తించారు. దీంతో తొక్కిసలాట జరగకుండా ఏఏ చర్యలు తీసుకుందాం అనే దానిపై కూడా నిపుణుల కమిటీని నియమించనున్నారు. నెల్లూరులో ప్రస్తుతం రైల్వే రాకపోకలకు నాలుగు ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. రైల్వే స్టేషన్ కెపాసిటీ  10 వేల మంది మాత్రమే. సాధారణ రోజుల్లో 4 నుంచి 5 వేల మంది ప్రయాణాలు సాగిస్తుంటారు.

అదే ఆదివారం, పండగ రోజుల్లో  10 వేలకు పైగా ఉంటారు. రొట్టెల పండగ సందర్భంగా దాదాపు 50 నుంచి 60 వేల మంది వస్తుంటారని అంచనా. అంటే స్టేషన్ కెపాసిటీకి ఐదు రెట్లు అధికంగా వస్తుంటారు. ఈ స్టేషన్ మౌలిక సదుపాయాలపై రైల్వే అధికారులు ప్రత్యేక పరిశీలన జరపనున్నారు. సౌత్‌స్టేషన్‌తో పోలిస్తే వేదాయపాళెం ప్లాట్‌ఫారాలు అనువుగా ఉన్నట్లు భావిస్తున్నారు. నెల్లూరు నగరం బుజబుజ నెల్లూరు వరకూ విస్తరించడంతో ప్రయాణికుల  సౌకర్యార్థం వేదాయపాళెం రైల్వే స్టేషన్‌ను అబివృద్ధి చేయాల్సి ఉంది.

పండగ సందర్భంగా సౌత్‌స్టేషన్‌లో కొన్ని రైళ్లను ఆపితే కొంత వరకు ప్రయోజనం ఉంటుందని పలువురు రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంపై త్వరలోనే కమిటీ వేయనున్నట్లు సమాచారం. స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఎస్కలేటర్ సౌకర్యం రోజుకు 1220 యూనిట్లు వాడకం మాత్రమే. ఈ యూనిట్లు సంఖ్యకూడా పెంచాలని పలువురు కోరుతున్నారు.

 సౌకర్యాలు నిల్
 బాంబ్‌స్క్వాడ్,మెటల్‌డిటెక్టర్,షిఫ్టుల వారిగా తనికీ సిబ్బం ది ఉండాలి. కాని నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్‌లో మాత్రం మెటల్‌డిటెక్టర్‌ను సిబ్బంది కొరతతో తొలగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా స్టేషన్‌లోని ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఇవి ఏర్పాటు చేయాలి.
 
తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతి, సమ్మక్క-సారలమ్మ జాతరకు వరంగల్ జిల్లా, రొట్టెల పండగకు నెల్లూరు రైల్వేస్టేషన్ అత్యంత తొక్కిసలాట జరిగే ప్రాంతంగా రైల్వే అధికారులు ఆ శాఖ ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు.
 
 అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం:
 తొక్కిసలాట కేంద్రంగా గుర్తించారు. అందుకు అనువుగా ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నాం. త్వరలోనే నిపుణుల కమిటీతో సమావేశం ఏర్పాటు చేయనున్నాం. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం.
 - షాజహాన్, స్టేషన్ సూపరింటెండెంట్

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా