గాలీవాన బీభత్సం

23 Apr, 2016 02:14 IST|Sakshi

బండరాయిపడి మహిళ మృతి
హడలిపోయిన  తిరుపతి వాసులు

 

తిరుపతిలో గాలీవాన బీభత్సం సృష్టించింది. శుక్రవారం సాయంత్రం బలమైన ఈదురుగాలులతో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. బండరాయి పడి ఓ మహిళ మృతి చెందింది. విద్యుత్ స్తంభాలు నేలకూలాయి.  ఇళ్లపై వేసిన రేకులు ఎగిరిపోయాయి. చెట్ల కొమ్మలు పడి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. గంటకుపైగా కురిసిన గాలీ వానతో స్థానికులు హడలిపోయారు.

 

తిరుపతి కార్పొరేషన్: నగరంలో శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. నెత్తిపై బండరాయి పడి జీవకోనకు చెందిన ఓ మహిళ మృతిచెందింది. రాజీవ్‌గాంధీ కాలనీలోని వెంకటగిరి స్కూల్ వద్ద దాదాపు 20 ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. వర్షానికి కాలువలు, డ్రైన్లు పొంగిపొర్లాయి. మురుగునీరు రోడ్లపైకి చేరింది. సాయంత్రం 5 నుంచి దాదాపు గంటకు పైగా కుండపోత వర్షం స్థానికులను ఉక్కిరిబిక్కిరి చేసింది. వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. కాలువల నిర్మాణాల కోసం తవ్విన గుంతల్లో పడి పలువురు గాయపడ్డారు.

 
విరిగిన చెట్లు- ధ్వంసమైన కార్లు

ఈదురు గాలులకు నగరంలోని పలు కూడళ్లలో చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. జీవకోనలో చెట్ల కొమ్మలు విరిగి ఇళ్లపై పడ్డాయి. ఇదే ప్రాంతంలో దాదాపు 11 పెంకుటిళ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వీధుల్లో మోకాటి లోతు నీరు నిలిచిపోయింది. వరదరాజనగర్, పాచిగుంట ప్రాంతంలో ఈదురు గాలులు ప్రతాపం చూపాయి. చెట్ల కొమ్మలు విరిగిపడడంతో రోడ్డుపై వెళ్తున్న వాహనాలు దెబ్బతిన్నాయి. రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన కార్లు ధ్వంసమయ్యాయి.

 
వీఆర్‌వోకు తప్పిన ప్రమాదం

వరదరాజనగర్, పాచిగుంట ప్రాంతంలో అర్హులైన పేదలకు మంజూరైన ఇంటి స్థలాల విషయమై వీఆర్‌వో విశ్వనాథం విచారణకు వెళ్లారు. సాయంత్రం 5.30గంటల ప్రాంతంలో ఒక్క సారిగా  రెండు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. మూడు చెట్లు నేలకూలాయి. అదే సమయంలో అక్కడ ఉన్న వీఆర్‌వోతో పాటు స్వయం సహాయక సంఘాల ఆర్‌పీ సూర్యకుమారి, స్థానిక మహిళలు తప్పించుకుని పరుగులు తీయడంతో ప్రాణపాయం తప్పింది.

 
బందార్లపల్లెలో..

బందార్లపల్లె (పూతలపట్టు): మండలంలోని బందార్లపల్లె వద్ద గాలిబీభత్సం సృష్టించింది. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో బందార్లపల్లె నుంచి యం.బండపల్లె వరకు విపరీతమైన గాలి వీచడంతో రోడ్డు పక్కన ఉన్న చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. బందార్లపల్లె వద్ద ఉన్న ఒక సింగిల్‌ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్, రెండు హెచ్‌వీడీఎస్ ట్రాన్స్‌ఫార్మర్లు, 5 విద్యుత్ స్తంభాలు నేలకొరిగి కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది.  సుమారు 3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. రోడ్డుకు అడ్డంగా పడిన చెట్లను తొలగించి పూతలపట్టు పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. గాలితో వీయడంతోపాటు చిరుజల్లులు పడ్డాయి. ట్రాన్స్‌కో ఏఈ వేలు, లైన్‌మెన్లు బద్రి, యాకుబ్ తాత్కాలికంగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.

 

బండరాయి పడి మహిళ మృతి
గాలీవాన బీభత్సానికి జీవకోనకు చెందిన నిర్మల కుమార్తె అమ్ములు(45) మృతిచెందింది. మృతురాలు తిరుమలలోని ఓ ప్రైవేటు హోటల్‌లో పనిచేస్తోంది. శుక్రవారం సాయంత్రం సొంత పనుల నిమిత్తం కొర్లగుంటకు వచ్చింది. అప్పటికే గాలీవాన రావడంతో అక్కడే ఉన్న ఓ ఇంటివద్ద ఆగింది. అదే సమయంలో ఆ ఇంటి రేకులపై ఉన్న పెద్ద రాయి అమ్ములు తలపై పడింది. హుటాహుటిన ఆమెను స్థానిక రుయాకు తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఈస్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.

 

మరిన్ని వార్తలు