బాబోయ్!

7 Jul, 2014 02:31 IST|Sakshi
బాబోయ్!

‘‘వర్షం పడితే.. వర్షం పడుతోందని కరెంట్ తీసేస్తారు.. వర్షం పడకపోతే.. వర్షాల్లేవని కరెంట్ తీసేస్తారు.. అఫిషియల్‌గా ఆరు గంటలు.. అన్ అఫిషియల్‌గా ఇంకో నాలుగ్గంటలు కరెంట్ తీసేస్తారు.. ఎండాకాలం మరీ దారుణం.. అసలు ఎప్పుడు చూసినా కరెంట్ ఉండదు గానీ.. బిల్లు మాత్రం పాత బాకీలని.. సర్ చార్జీలని ముక్కు పిండి మరీ కట్టిస్తారు. (పసుపు రంగులో ఉన్న విసనకర్ర విసురుకుంటూ..) మళ్లీ ఎండాకాలం వస్తోంది.. ఎలాగూ కరెంట్ ఉండదు.. ఎక్కడకు పోవాలా అని ఆలోచిస్తున్నా.. ఆయనున్నప్పుడే నయమండీ.. అసలు కరెంట్ ఎప్పుడూ పోయేది కాదు.. ఆయనొస్తేనే బాగుంటుందండీ.. చాలా బాగుంటుంది’’.  
 - ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ టీవీల్లో కామేశ్వరరావు అనే పాత్రధారితో హోరెత్తించిన ప్రకటనిది
 
 ఆయనొచ్చాక  
 ఎడాపెడా కోతలు పెడుతున్నారు        
 కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంట్ కోతలతో ఇబ్బందులు పడ్డాం. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇస్తున్న హామీలను చూసి భవిష్యత్‌లో కరెంట్ కష్టాలు తొలగిపోతాయని భావించాం. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఎడపెడా కోతలు విధిస్తున్నారు.  గత ప్రభుత్వమే నయమన్నట్లుంది. ఇంట్లో ఉండాలంటేనే భయపడే పరిస్థితి వుంది. కరెంట్ ఎప్పుడు వస్తుందో..ఎప్పుడు పోతుందో అర్థం కాదు. ఈ మధ్య రాత్రి సమయాల్లో కూడా కోతలు పెడుతున్నారు.  
 - ప్రసన్నలక్ష్మి, గృహిణి, రజక్‌నగర్,
 అనంతపురం  
 
 అనంతపురం టౌన్ :  గృహావసరాలకు 24 గంటలు, వ్యవసాయానికి 9 గంటల పాటు పగటివేళల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరా అంటూ అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు ఆరంభంలోనే చుక్కలు చూపిస్తోంది. హామీలను నెరవేర్చకుండా శ్వేత పత్రాల పేరుతో కాలయాపన చేస్తూ అప్రకటిత కోతలు విధిస్తుండడంతో జనం బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా రైతులు ఖరీఫ్ సీజన్‌లో పంటలు సాగు చేసే సమయం కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం వ్యవసాయానికి 7 గంటలు విద్యుత్ సరఫరా చేస్తే.. ప్రస్తుతం 5 గంటలు కూడా సక్రమంగా రావడం లేదని రైతులు వాపోతున్నారు.
 
 ఇక నగరంలో 4, పట్టణాల్లో 6, మండలాల్లో 8 గంటలు విద్యుత్ కోత వేళలుగా ప్రకటించిన అధికారులు అనధికారికంగా మరికొన్ని గంటలు సరఫరా నిలిపివేస్తున్నారు. అనంతపురంలో 6 నుంచి 7 గంటలు కోత విధిస్తున్నారు. అందులోనూ ప్రజలకు అవసరాలున్న ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు, 10 నుంచి 11 గంటల వరకు కోత అమలు చేస్తున్నారు. వర్షాలు రాకపోవడం..ఎండలు తీవ్రంగా ఉండడంలో ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. ఈ క్రమంలో కరెంట్ కోతలు మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
 
 పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి చెప్పనవసరం లేదు. పట్టణాల్లో వ్యాపారాలు ఉన్న సమయంలో కరెంట్ తీస్తుండడంతో తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లుతోంది. రంజాన్ మాసంలో కోతలు విధించవద్దని ముస్లింలు విజ్ఞప్తి చేసినా అధికారులు కనికరించడం లేదు. వర్షాలు సమృద్ధిగా పడేంత వరకూ అధికార విద్యుత్ కోతలు కొనసాగిస్తామని, అప్రకటిత కోతలు తగ్గడానికి మరో వారం రోజులు సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.
 
 అన్ని వర్గాలకూ ఇబ్బంది
 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన హమీలలో ప్రధానమైనవి రుణమాఫీ, గృహా వసరాలకు  24 గంట లు, వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా. ఈ రెండు హామీలను నెరవేరిస్తే చాలు. కానీ వాటిని విస్మరించడంతో   అన్ని వర్గాల ప్రజలూ కష్టాలు పడుతున్నారు.
 - వెంగళరెడ్డి, వ్యాపారి, అనంతపురం
 
 తీవ్రంగా నష్టపోతున్నాం
 సాయంత్రం 7-8 గంటల సమయంలోనే వ్యాపారం బాగా జరుగుతుంది. అలాంటి సమయం లో కరెంట్ కట్ చేస్తున్నారు. చిన్న చిన్న వస్తువులు కనపడకపోవడం, ఇతర కారణాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం.
 - విజయ్‌కుమార్, ఆటో మొబైల్
    నిర్వాహకుడు, అనంతపురం
 
 ఎప్పుడు పడితే అప్పుడు కోత
 కరెంట్ కోతలతో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఉదయం వేళ ఉక్కపోత భరిం చలేకపోతున్నాం.  చదువుకుందామంటే ఇబ్బందికరంగా ఉంది. ఉదయం, ఎప్పు డుపడితే అప్పుడు కరెంట్ తీస్తున్నారు.
 - దేవి, విద్యార్థిని,
 సోమనాథ్‌నగర్, అనంతపురం
 
 వర్షాలొచ్చి డ్యాంలు నిండాలి        
 కరెంట్ కష్టాలు కొద్ది రోజులు తప్పవు. వర్షాలు వచ్చి డ్యాంలు నిండేంత వరకూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చు.విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో 1170 మెగావాట్ల  లోటు ఏర్పడుతోంది.
 -  ప్రసాద్‌రెడ్డి, ట్రాన్స్‌కో ఎస్‌ఈ
 

మరిన్ని వార్తలు