ఏపీకి భారీ వర్ష సూచన

13 Dec, 2018 14:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆగ్నేయ బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి గురువారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయ దిశగా 1350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ విభాగం తెలియజేసింది. ఇది క్రమంగా బలపడి రాగల 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి, తదుపరి 24 గంటల్లో తుపానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర అంతటా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ ఒక మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలియజేసింది. తదుపరి 72 గంటలలో ఇది వాయువ్య దిశగా ప్రయాణించి  ఆంధ్ర ప్రదేశ్ మరియు దానిని ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు తీరాలవైపు ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో తీరప్రాంతంలో అలల ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ అయ్యాయి.

మరిన్ని వార్తలు