అపార నష్టం

29 Oct, 2013 05:34 IST|Sakshi

 

=వాన నష్టం రూ.225 కోట్లు
 =4053 ఇళ్లు నేల మట్టం
 =ఆరుగురి మృతి
 =సహాయక చర్యలు పూర్తి
 =అదుపులోకి వస్తున్న పరిస్థితి
 =ఊపిరి పీల్చుకున్న జనం
 =క్షేత్ర స్థాయిలో సర్వేకు కలెక్టర్ ఆదేశం
 =రెండు రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక!
 =పొంచి ఉన్న వ్యాధుల ముప్పు
 =అంధకారంలో పలు గ్రామాలు

 
విశాఖ రూరల్, న్యూస్‌లైన్:  ఎట్టకేలకు వర్షాలు తెరిపినిచ్చాయి. జిల్లాలో పరిస్థితులు నెమ్మదిగా అదుపులోకి వస్తున్నాయి. రెండు గ్రామాలు ఇంకా ముంపులో ఉన్నప్పటికీ.. మిగిలిన ప్రాంతాలు వరద నీటి నుంచి బయటపడ్డాయి. పునరావాస కేంద్రాలు కూడా మూసేశారు. ఎడతెరిపిలేకుండా వారం రోజులు కురిసిన భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వేలాది ఎకరాల్లో పంటలు మునిగిపోయాయి. వెయ్యికిపైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఆరుగురిని బలితీసుకున్నాయి. ఆదివారం సాయంత్రం నుంచి వర్షం తెరిపినివ్వడంతో అధికారులు, ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. సహాయక చర్యలు పూర్తవడంతో అధికారులు ప్రస్తుతం నష్టం అంచనాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.
 
ప్రాథమిక అంచనా రూ.225 కోట్లు

ఈ వర్షాలకు జిల్లాలో రూ.225 కోట్లు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. ఆర్‌అండ్ బీకి రూ.78.52 కోట్లు, పంచాయతీరాజ్‌కు రూ.38.98 కోట్లు, పబ్లిక్‌హెల్త్, జీవీఎంసీలకు రూ.33.83 కోట్లు, మేజర్ ఇరిగేషన్‌కు రూ.8.47 కోట్లు, మీడియం ఇరిగేషన్‌కు రూ.2.71 కోట్లు, మైనర్ ఇరిగేషన్‌కు రూ.14.13 కోట్లు, ఆహార పంటలకు రూ.43.15 కోట్లు, ఉద్యాన పంటలకు రూ.2.65 కోట్లు నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా లెక్కలు వేశారు. జిల్లాలో 4053 ఇళ్లు దెబ్బతిన్నట్లు నిర్ధారించారు. అయితే అంచనాలు రెట్టింపయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
 
రెండు రోజుల్లో నష్టం నివేదిక

వర్షాలు తగ్గకుండా అధికారులు నష్టం అంచనాలను తయారు చేసే పనిలో పడ్డారు. రెండు రో జుల్లో పూర్తి స్థాయిలో నివేదికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు నష్టాలను లెక్కగట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఇళ్ల నష్టం, పంటలకు సం బంధించి రెవెన్యూ, వ్యవసాయాధికారులు స మన్వయంగా నివేదికలను తయారు చేస్తున్నారు. రెండు రోజుల్లో నష్టం నివేదికలను తయారు చేసి ప్రభుత్వానికి పంపించనున్నారు.
 
ఊపిరిపీల్చుకున్న ప్రజలు

వారం రోజులుగా భయపెట్టిన వర్షాలు ఉపశమనమివ్వడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పటికీ చూచుకొండ, గణపర్తి గ్రామాలు నీటిలోనే ఉన్నాయి. మిగిలిన గ్రామాల్లో పరిస్థితి అదుపులోకి వచ్చింది. రవాణా మార్గాలకు కూడా అవకాశం ఏర్పడింది. అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. రిజర్వాయర్లకు ఇన్‌ఫ్లో తగ్గడంతో గేట్లను మూసివేశారు. దీంతో ప్రజలు పునరావాస కేంద్రాల నుంచి వారి వారి నివాసాలకు తరలివెళ్లారు. సోమవారం సాయంత్రం నుంచి ఈ కేంద్రాలను మూసివేశారు. అయితే ఇప్పటికీ కొన్ని గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయి. వర్షాలు పూర్తిగా తగ్గడంతో విద్యుత్ పునరుద్ధరణ కార్యక్రమాలను అధికారులు వేగవంతం చేశారు.
 

మరిన్ని వార్తలు