డోలాయమానం

30 Jun, 2014 01:29 IST|Sakshi
డోలాయమానం
  • కరుణించని వరుణుడు
  •  కనికరించని పాలకులు
  •  సాగునీటి జాడే లేదు..
  •  రుణమాఫీ పైనా అనుమానాలే
  • వరుణుడు ఊరించి ఉసూరుమనిపిస్తున్నాడు. ఎండిన కాలువలు వెక్కిరిస్తున్నాయి. కనీసం నారుడుమడులు పోసుకునేందుకు కూడా నీరు లేక రైతులుఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. కమ్ముకున్న కారుమబ్బులు సాయంత్రానికి మెల్లగా జారుకుంటున్నాయి. ఆనక అన్నదాత కంటిమీద కునుకు పడటంలేదు. సాగు సాగేనా.. అనే సందేహం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. గ్రామాల్లో నలుగురు రైతులు కలిస్తే చాలు సాగునీటి విడుదల, రుణమాఫీ గురించే చర్చించుకుంటున్నారు.
     
    మచిలీపట్నం : రుతుపవనాలు వచ్చి రోజులు గడస్తున్నా వర్షాల జాడ మాత్రం లేదు. పాలకులు సాగునీటి విడుదలపై స్పష్టత ఇవ్వడం లేదు. ఈ పరిస్థితుల్లో పంటలు సాగు చేయాలా.. వద్దా.. అనే డోలాయమానంలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. గత ఏడాది జూలై నెల ప్రారంభం నాటికే వర్షాలు కురవడంతో వర్షాధారంగానే నారుమడులు పోశామని ఈ ఏడాది ఆ పరిస్థితి లేకపోవడంతో నారుమడులు పోసేందుకు అవకాశం లేకుండా పోయిందని రైతులు చెబుతున్నారు. ఇక అంతా పైవాడు... పాలకుల దయపైనే ఆధారపడి ఉందని నిస్సహాయతను వ్యక్తంచేస్తున్నారు.
     
    వర్షపాతం చాలా తక్కువ నమోదు
     
    జూన్ నెలలో జిల్లాలో 98.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 24.4మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. జూన్ నెలలోనే 74.3 మిల్లీ మీటర్ల వర్షపాతం తక్కువగా నమోదైంది. కురిసిన కొద్దిపాటి వర్షం కూడా అక్కరకు రాకపోవడంతో రైతులు భారీ వర్షం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో జిల్లాలో ఒక్క ఎకరంలోనూ ఇంతవరకు వరినాట్లు ప్రారంభం కాలేదు.

    జిల్లాలో 1.40 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతుందని వ్యవసాయ శాఖ అధికారుల అంచనా. విత్తనం మొలకెత్తడానికి అవసరమైన వర్షపాతం నమోదు కాకపోవడంతో పత్తి విత్తాలా.. వద్దా.. అనే సందిగ్ధంలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. కాలువలకు తాగునీటిని మాత్రమే విడుదల చేసిన ప్రభుత్వం.. సాగునీటిని ఎప్పుడు విడుదల చేస్తుందో ప్రకటించలేదు. దీంతో ఎప్పుడు నారుమడులు పోసుకోవాలి, వరినాట్లు ఎప్పుడు పూర్తిచేయాలని, రుణమాఫీ చేస్తారా.. అని గ్రామాల్లో రైతులు చర్చించుకుంటున్నారు.
     
    ముందస్తుగానే నాట్లు వేసేవాడిని
    మా గ్రామంలో ముందస్తుగానే నేనే వరినాట్లు పూర్తి చేస్తాను. రాత్రింబవళ్లు తిరిగి పొలానికి నీరు పెట్టుకుని నారుమడులు, వరినాట్లు త్వరితగతిన పూర్తి చేసేవాడిని గత ఏడాది ఈ రోజుల్లో నారు మడి పోశాను. వర్షాలు లేకపోవటంతో నారుమడి పోసేందుకు అవకాశం లేకుండా పోయింది. కాలువల ద్వారా సాగునీటి అవసరాల కోసం నీరు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి కాలువలకు సాగునీటిని విడుదల చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. గత ఏడాదితో పోల్చుకుంటే వరినాట్లు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.
     - ఆరేపల్లి తిరుపతయ్య, సుల్తానగరం, మచిలీపట్నం
     
     వర్షాభావంతో ఏమీ చేయలేకున్నాం
     గతేడాది ఈ రోజుల్లో వర్షాలు బాగా కురవడంతో క్షణం తీరికలేకుండా పొలం పనుల్లో నిమగ్నమయ్యాం. ఈ సంవత్సరం జూన్ నెల ముగిసినా వర్షాలు పడలేదు. దుక్కి దున్ని పొలాన్ని సాగుకు సిద్ధం చేసి రోజూ వాన కోసం ఎదురుచూస్తున్నాం. నాలుగు ఎకరాల మెట్టలో పత్తి సాగు కోసం పొలాన్ని సిద్ధం చేయడానికి రూ.8వేలకు పైగా ఖర్చయింది.  తొమ్మిది ఎకరాల మాగాణిలో వరి సాగుకు ముందు పచ్చిరొట్ట విత్తనాలు వేయగా, వర్షపాతం లేకపోవడంతో మొలకెత్తలేదు. వర్షాలు పడకపోతే ఈ సీజన్లో పంటలు సాగు చేయడం సాధ్యపడదు.
     - కొల్లా రామారావు, ఎర్రమాడు, తిరువూరు మండలం
     

మరిన్ని వార్తలు