రోజంతా... జడివానే...

21 Jul, 2018 14:19 IST|Sakshi

విజయనగరం గంటస్తంభం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో శుక్రవారం ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపు అన్ని మండలాల్లో చిటపట చినుకులు పడుతూనే ఉన్నాయి. ఒకటి, రెండు మండలాల్లో మినహా మిగతాచోట్ల మధ్యమధ్యలో చిరుజల్లులు, భారీ వర్షాలు పడ్డాయి. దీంతో జనజీవానికి ఇబ్బంది కలిగినా పంటలకు నామమాత్రపు ప్రయోజనమే కలిగింది. 25వ తేదీ వరకు వర్షాలు పడతాయని వాతావరణశాఖ చెప్పడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మరోవైపు తుఫాన్‌ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. 

గత రాత్రి నుంచీ చిరుజల్లులు

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా శుక్రవారం తెల్లవారు జాము నుంచి చినుకులు మొదలయ్యాయి. రాత్రి వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. విజయనగరంలో ఉదయం ఒక మోస్తరు వర్షం పడగా మధ్యాహ్నం భారీ వర్షం పడింది. సాయంత్రం నుంచి రాత్రి వరకు చిటపట చినుకులు పడ్డాయి. ఉదయం నుంచి రాత్రి 8.30గంటల వరకు దాదాపుగా 2సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పార్వతీపురంలో ఒక మోస్తరు వర్షం పడింది.

ఇక్కడ 5.25మిల్లీమీటర్లు వర్షం నమోదైంది. కురుపాం నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఒకటి నుంచి రెండు సెంటీమీటర్ల వరకు నమోదుకాగా... బొబ్బిలి నియోజక వర్గంలోనూ ఇదే పరిస్థితి. పూసపాటిరేగ, భోగాపురంలో 3సెంటీమీటర్ల వరకు వర్షం పడింది. మొత్తం 34మండలాల్లో 17 మండలాల్లో ఒక మోస్తరు వర్షాలు పడగా మరో 17మండలాల్లో కొద్దిపాటి భారీ వర్షాలు పడినట్లు విపత్తుల నిర్వహణశాఖ ద్వారా అందిన సమాచారం.

వర్షాల మూలంగా వివిధ పనులపై బయటకు వెళ్లే వారు ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఫుట్‌పాత్‌ వ్యాపారుల ఉపాధికి నష్టం జరిగింది. ఇదిలాఉండగా పంటలకు పెద్దగా ప్రయోజనం లేదు. ఆకుమడులకు కొన్నాళ్లపాటు ఢోకా లేకుండా వరుణుడు ఆదుకున్నాడు. ఇతర పంటలకు కొంతవరకు ఉపయోగం కలిగింది. ఏపంటకు ప్రస్తుతానికి నష్టం లేదు. శని, ఆదివారాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉండడంతో రైతులు ఆశగా చూస్తున్నారు.  

మరిన్ని వార్తలు