హైకోర్టు భవనంలోకి వర్షపు నీరు 

19 Sep, 2019 04:28 IST|Sakshi
హైకోర్టు భవనంలోకి చేరిన వర్షపు నీటిని బయటకు పంపిస్తున్న సిబ్బంది

గోడల నుంచి ధారాళంగా కారిన నీరు  

అసెంబ్లీ, సచివాలయ చాంబర్లలోకి గతంలో వర్షపు నీరు  

నిర్మాణంలో చోటుచేసుకున్న అవినీతిపై పెద్ద ఎత్తున విమర్శలు 

సాక్షి, అమరావతి బ్యూరో: రాజధాని అమరావతిలో నిర్మితమైన భవనాల్లో నాణ్యత లోపం మరోసారి బట్టబయలైంది. బుధవారం కురిసిన వర్షానికి తుళ్లూరు మండలం నేలపాడు వద్ద నిర్మించిన తాత్కాలిక హైకోర్టు భవనం గోడల్లోంచి నీరు కారింది. సుమారు రూ.150 కోట్లతో షేర్వాల్‌ టెక్నాలజీతో నిర్మించిన భవనం చిన్నపాటి వర్షానికే కారిపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సుమారు నాలుగెకరాల విస్తీర్ణంలో గత టీడీపీ ప్రభుత్వం తాత్కాలిక హైకోర్టు (జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌) నిర్మాణాన్ని జీ+2 విధానంలో నిర్మించింది.

తాజాగా కురిసిన వర్షానికి గ్రౌండ్‌ ఫ్లోర్‌లోకి నీరు చేరింది. మొదట రూ.98 కోట్ల అంచనాలతో టెండర్లు పిలిచిన అధికారులు ఆ తర్వాత మౌలిక సదుపాయాల కల్పన పేరుతో మరో రూ.56 కోట్లతో మళ్లీ టెండర్లు పిలిచారు. ఇంటీరియర్, ప్రధాన భవనాలకు లిఫ్టులు, మౌలిక వసతులు, ప్రహరీ, ప్రవేశ మార్గాలు, అంతర్గత రోడ్లు, పార్కింగ్, మురుగునీటి పారుదల వ్యవస్థ.. తదితర వాటి కోసమని ఈ మొత్తాన్ని వినియోగించారు. హైకోర్టు నిర్మాణంలో ప్రమాణాలకు పాతరేశారు. అలాగే తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయ భవనాల నిర్మాణాల వ్యయాన్నీపెంచి..టీడీపీ నాయకులు దోచుకున్నారనే విమర్శలున్నాయి. 

గతంలోనూ ఇవే ఘటనలు  
ఈ ఏడాది మార్చిలో హైకోర్టు వద్ద జనరేటర్‌ రూమ్‌ కోసం ఆరుగదులు నిర్మిస్తుండగా అందులో రెండు గదులకు వేసిన శ్లాబ్‌ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో నలుగురు కూలీలు గాయపడ్డారు. అలాగే 2017లో కురిసిన వర్షాలకు అసెంబ్లీలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చాంబర్‌ తడిసిముద్దయింది. గతేడాది కురిసిన వర్షాలకు సచివాలయంలో మాజీ మంత్రులు అమర్‌నాథ్‌రెడ్డి, దేవినేని ఉమ చాంబర్లలో వర్షం నీరు కారింది. షేర్వాల్, ప్రీ కాస్టింగ్‌ టెక్నాలజీతో రాజధానిలో భవనాలు నిర్మించామని ఆర్భాటంగా చెప్పుకొని మురిసి పోయిన టీడీపీ నాయకులు.. నాణ్యతలో డొల్లతనంపై మాత్రం మిన్నకుండిపోతున్నారు. రాజధానిలో జరిగిన నిర్మాణాలపై, వాటికి చేసిన వ్యయంపై, నాణ్యత ప్రమాణాలపై విచారణ చేయించాలని రాజధాని వాసులు డిమాండ్‌ చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు