ఆ పెట్రోల్‌ బంక్‌లో డీజిల్‌కు బదులు నీరు..!

27 Oct, 2019 08:51 IST|Sakshi
బంక్‌ యజమానితో మాట్లాడుతున్న బాధిత వాహనదారులు

శ్యామలగౌరీపురం సమీపంలోని ఓ బంక్‌ సిబ్బంది నిర్వాకం 

సాక్షి, సాలూరు: పెట్రోల్‌ బంక్‌లో డీజిల్‌ కొట్టించుకోవాలని వెళ్లిన ప్రయాణికులకు వింత పరిస్థితి ఎదురైంది. డీజిల్‌కు బదులు వర్షపు నీరు రావడంతో వాహన చోదకులకు ఇక్కట్లు తప్పలేదు. వివరాల్లోకి వెళితే.. పాచిపెంట మండలంలోని శ్యామలగౌరీపురం సమీపంలో జాతీయ రహదారికి పక్కనున్న ఓ బంక్‌లో డీజిల్‌కు బదులు వర్షపు నీరు వచ్చింది. శనివారం ఉదయం ఐదు గంటల సమయంలో ఓ కారు యజమాని బంక్‌కు వెళ్లి డీజిల్‌ కొట్టమని సిబ్బందిని కోరాడు. దీంతో సిబ్బంది కారు ట్యాంక్‌ ఓపెన్‌ చేసి డీజిల్‌ కొట్టారు. అయితే ఆ కారు కొంతదూరం వెళ్లాక ఆగిపోయింది. పరిశీలించి చూడగా.. ట్యాంక్‌లో డీజిల్‌కు బదులు వర్షపు నీరు ఉండడంతో కారు ఓనర్‌ అవాక్కయ్యాడు.

వెంటనే ఓ ఆటో సహాయంతో కారును బంక్‌కు తీసుకువచ్చి సిబ్బందిని నిలదీశాడు. అయితే అప్పటికే కొంతమంది వాహనదారులు డీజిల్‌కు బదులు వర్షపునీరు కొట్టిన విషయం గుర్తించి సిబ్బందితో గొడవపడుతున్నారు.  వాహనాలు ఆగిపోవడంతో కొంతమంది మెకానిక్‌లను సంప్రదించగా.. మరికొంతమంది వాహనాలను ఆయా షోరూమ్‌లకు తీసుకెళ్లారు. ఇదిలాఉంటే  కంపెనీ వారు పదిహేను సంవత్సరాల కిందట పైపులు వేశారని.. అవి పాడవ్వడం వల్ల వర్షపునీరు కలిసిపోయి ఉంటుందని బంకు యజమాని సాధనాల గోపాల్‌ అన్నారు. ఈ విషయమై కంపెనీ వారికి సమాచారం ఇచ్చామని తెలిపారు.    

ఆటో​కు తాడు కట్టి కారును తీసుకువస్తున్న దృశ్యం

కొత్త వాహనం  ఆగింది.. 
పదిహేను రోజుల కిందటే కారు కొన్నాను. అత్యవసరమైన పని మీద ఒడిశా వెళ్తూ బంక్‌లో ఆయిల్‌ కొట్టించాను. అయితే డీజిల్‌కు బదులు వర్షపునీరు రావడంతో వాహనం ఆగిపోయింది. వెంటనే ఆటో సహాయంతో కారును బంక్‌కు తీసుకువచ్చాను. కారు మరమ్మతులకు అయిన ఖర్చు ఇస్తామని బంకు యజమాని ఒప్పుకున్నారు. ఆటోలు, ద్విచక్ర వాహనాలు కూడా ఆగిపోవడంతో ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. 
– యమరాపు ముత్యాలునాయుడు, కవిరిపల్లి, మక్కువ మండలం 

మరిన్ని వార్తలు