గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ ఆఫీస్‌ రూమ్‌ జలమయం

21 Aug, 2019 20:06 IST|Sakshi

సాక్షి, విజయవాడ : గన్నవరం విమానాశ్రయం ఆఫీస్‌ రూమ్‌ జలమయమైంది. బుధవారం సాయంత్రం గన్నవరంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం దాటికి ఎయిర్‌పోర్ట్‌ ఆఫీస్‌ రూమ్‌ చెరువును తలపించింది. ఆఫీస్‌ రూమ్‌పై భాగం దెబ్బతినడంతో వర్షపు నీరు లోనికి ప్రవేశించింది. భారీగా వర్షపు నీరు ఆఫీస్‌ రూమ్‌లోకి చేరడంతో.. ఆ నీటిని తోడేందుకు ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. పై నుంచి నీరు కారడంతో ఆఫీసులోని ఫర్నీచర్‌ కూడా తడిసిపోయింది. 


ఏలూరు రోడ్డులో భారీగా ట్రాఫిక్‌ జామ్‌
విజయవాడ, ఏలూరు రోడ్డులో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. దాదాపు 2 కి.మీ మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఓ వైపు వర్షం, మరోవైపు ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. 

మూడు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక..
కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. కృష్ణా జిల్లాలోని విజయవాడ రూరల్‌, గన్నవరం, గుడివాడ, కృత్తివెన్ను, బంటుమిల్లి, కలిదిండి, ముదినేపల్లి, మండవల్లి, నందివాడ, పెదపారుపూడి, బాపులపాడు, ఉంగుటూరు, గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల, వినుకొండ, కాకుమాను, పెద్దనందిపాడు, నిజాంపట్నం, కొల్లిపర, కొల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, మొగల్తూరు, నర్సాపురం, కాళ్ల మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు విపత్తు నిర్వహణ శాఖ పేర్కొంది. ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండ, సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలని తెలిపింది. 

మరిన్ని వార్తలు