ఆశలకు జీవం

28 Aug, 2014 01:57 IST|Sakshi
ఆశలకు జీవం

జిల్లా వ్యాప్తంగా వర్షాలు
- రైతుల్లో వెల్లివిరిసిన ఆనందం
- పొలాలు పదునెక్కడంతో సాగుకు సమాయత్తం
- ఇప్పటికే వేసిన పంటలకు మేలు
- సాగర్ నీటి విడుదల కోసం వరి రైతుల నిరీక్షణ
సాక్షి, గుంటూరు: ఎట్టకేలకు వరుణ దేవుడు కరుణించటంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరిసింది. బీడుగా మిగులుతాయనుకున్న పంట భూములు మంగళ, బుధవారాల్లో విస్తారంగా కురిసిన వర్షాలకు పదునెక్కడంతో కొత్త ఆశలు చిగురించారు. ఖరీఫ్ పంటల సాగు పనులు జూన్ మొదటివారంలోనే ప్రారంభం కావాల్సి ఉండగా తీవ్ర వర్షాభావం కారణంగా ఈ ఏడాది జాప్యమైంది. కొద్దిమంది రైతులే ముందుగా పంటలు వేశారు. మిగిలినవారంతా వర్షాల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లకు వారి నిరీక్షణ ఫలించి.. వరుసగా రెండు రోజులు వర్షాలు కురియటంతో భూములు తడిసి ముద్దయ్యూరుు. దీంతో సాగు పనులు ఊపందుకున్నారు.

ముఖ్యంగా పత్తి, మిర్చి రైతులు గురువారం నుంచి విత్తనాలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. మెట్ట పంటలు అధికంగా పండించే పల్నాడు ప్రాంతంలోని మాచర్ల, గురజాల, వినుకొండ, నరసరావుపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్లో రైతులు సాగు పనుల్లో బిజీ అయ్యూరు. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకూ జిల్లాలో అత్యధికంగా మాచర్లలో 18 సెంటీమీటర్ల వర్షం పడగా  మిగిలిన చోట్ల 5 నుంచి 8 సెం.మీ. వర్షపాతం నమోదయింది. ముందుగా వేసిన పత్తి పంటకు ఈ వర్షం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
 
పెరగనున్న పత్తి సాగు విస్తీర్ణం.: గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో ఈ ఏడాది 1,01,038 ఎకరాల్లో పత్తి సాగు చేయాల్సి ఉంది. అయితే ఎక్కువమంది రైతులు పత్తి సాగుపై ఆసక్తి కనబరుస్తుండటంతో అదనంగా 50 వేల ఎకరాల్లో సాగయ్యే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. మిర్చి 1,34,079 ఎకరాలు, వరి 4,33,114 ఎకరాల్లో వేయాల్సి ఉంది. సాగర్ కాలువల ద్వారా నీరు విడుదలైతే వరి వేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం తాగునీటి అవసరాల కోసమే నీరు విడుదల చేసినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో సాగు నీటి విడుదల జరుగుతుందా లేదా అనే సందిగ్ధంలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటివరకు వేసిన వరిలో అధిక శాతం వెద పద్ధతిలో సాగు చేస్తున్నదే కావటం గమనార్హం.
 
రుణాలు అందక ఇబ్బందులు
వర్షాలు కురియటంతో సాగుకు సమాయత్తమైన రైతులు పెట్టుబడులు ఎలా పెట్టాలో తెలియక సతమతమవుతున్నారు. అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తామంటూ అధికార టీడీపీ చెప్పిన మాటలు నమ్మిన రైతులు రుణాలు చెల్లించకపోవడంతో ఈ ఏడాది ఖరీఫ్ రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకరించటం లేదు. దీంతో ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు