మరో రెండ్రోజులు విస్తారంగా వర్షాలు

14 Jul, 2020 06:07 IST|Sakshi

మహారాణిపేట (విశాఖ దక్షిణ)/సాక్షి నెట్‌వర్క్‌: దక్షిణ భారత ద్వీపకల్ప ప్రాంతంపై ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం చురుగ్గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌పై గాలి విలోమ ప్రభావం తక్కువ స్థాయిలో ఉంటుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ దృష్ట్యా రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

మంగళ, బుధవారాల్లో  కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలతోపాటు రాయలసీమ ప్రాంతాల్లో కొన్నిచోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల్లోని పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. 

మరిన్ని వార్తలు