‘పోలవరం’ అక్రమాలపై ప్రశ్నల వర్షం

24 Jul, 2019 04:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అంచనా వ్యయాన్ని పెంచేయడం నిబంధనలకు విరుద్ధం కాదా? 

జల వనరుల శాఖ అధికారులను నిలదీసిన మంత్రివర్గ ఉపసంఘం 

కనెక్టివిటీస్, కుడి, ఎడమ కాలువ పనుల రికార్డులు అందజేయాలని ఆదేశం

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల్లో చోటుచేసుకున్న అక్రమాల విషయంలో జలవనరుల శాఖ అధికారులపై మంత్రివర్గ ఉపసంఘం ప్రశ్నల వర్షం కురిపించింది. కాంట్రాక్టు ఒప్పందం గడువు ముగియకుండానే 2015–16 ధరలను వర్తింపజేస్తూ అంచనా వ్యయాన్ని ఎలా పెంచారంటూ నిలదీసింది. ఇంజనీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌(ఈపీసీ) ఒప్పందాన్ని రద్దు చేసుకోకుండా లంప్సమ్‌(ఎల్‌ఎస్‌)–ఓపెన్‌ విధానంలో నవయుగ సంస్థకు రూ.3,102.37 కోట్ల విలువైన పనులు, బీకెమ్‌కు రూ.387.56 కోట్ల విలువైన పనులను నామినేషన్‌ పద్ధతిలో ఎలా అప్పగించారని ప్రశ్నించింది. పనులన్నీ సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించడం నిబంధనలకు విరుద్ధం కాదా? అని పేర్కొంది. అప్పటి ప్రభుత్వ పెద్దలు, మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాల మేరకు పోలవరం పనులు చేపట్టామని జలవనరుల శాఖ అధికారులు మంత్రివర్గ ఉపసంఘానికి వివరించారు. రాష్ట్రంలో టీడీపీ సర్కార్‌ హయాంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, సాగునీటి ప్రాజెక్టులు, ఇంజనీరింగ్‌ పనుల్లో అక్రమాలపై విచారణ చేయడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్, మేకపాటి గౌతంరెడ్డితో కూడిన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం సచివాలయంలో సమావేశమైంది. పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌పై(జలాశయం) విచారణ చేపట్టింది. హెడ్‌ వర్క్స్‌లో 2005 నుంచి ఇప్పటివరకూ చేసిన పనులను ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు వివరించారు.  

పీపీఏ అనుమతి ఎందుకు తీసుకోలేదు? 
హెడ్‌ వర్క్స్‌ను రూ.4,054 కోట్లకు ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థ 2013లో దక్కించుకుందని.. ఆ ఒప్పందం గడువు 2018 మార్చి వరకూ ఉందని, కానీ పోలవరం నిర్మాణ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిన మరుసటి రోజే 2015–16 ధరలను వర్తింపజేస్తూ అంచనా వ్యయాన్ని రూ.5,535.91 కోట్లకు ఎలా పెంచడం నిబంధనలకు విరుద్ధం కాదా? అని మంత్రివర్గ ఉపసంఘం అధికారులను నిలదీసింది. అంచనా వ్యయం పెంచినప్పుడు పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) అనుమతి ఎందుకు తీసుకోలేదని అడిగింది. అప్పటి రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం వల్ల అంచనా వ్యయాన్ని పెంచామని అధికారులు తెలియజేశారు. అంచనా వ్యయం పెంచడం ద్వారా కాంట్రాక్టర్‌కు రూ.1,481.91 కోట్ల మేర ప్రజాధనాన్ని దోచిపెట్టినట్లయిందని మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. ట్రాన్స్‌ట్రాయ్‌ని ముందు పెట్టి కీలకమైన పనులను ఇతర సంస్థలకు సబ్‌ కాంట్రాక్టుకు ఎలా అప్పగించారని ప్రశ్నించింది. ట్రాన్స్‌ట్రాయ్‌కి రోజు వారీ ఖర్చుల కోసం రూ.170 కోట్లతో ఏర్పాటు చేసిన నిధి, నవయుగకు రివాల్వింగ్‌ ఫండ్‌గా ఇచ్చిన రూ.50 కోట్ల వ్యయానికి సరైన లెక్కలు చూపకపోవడంపై ఉపసంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చే సమావేశం నాటికి హెడ్‌ వర్క్స్‌తోపాటు కనెక్టివిటీస్, కుడి, ఎడమ కాలువ పనులకు సంబంధించిన రికార్డులను తమ ముందు ఉంచాలని ఆదేశించింది.  

మరిన్ని వార్తలు