నాలుగైదు రోజుల్లో రుతుపవనాల జోరు

20 Jun, 2018 03:19 IST|Sakshi

భగ్గుమంటున్న భానుడు.. రాష్ట్ర వ్యాప్తంగా వడగాడ్పులు

సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు

సాక్షి, విశాఖపట్నం/అమరావతి: ఎండలు, వడగాడ్పులతో అల్లాడుతున్న వేళ నైరుతి రుతుపవనాలు త్వరలో ఊపందుకోనున్నాయి. కొద్దిరోజుల నుంచి ఇవి బలహీనంగా ఉండడంతో వర్షాల జాడ లేకుండా పోయింది.  ఈ నేపథ్యంలో రుతుపవనాలు ఈ నెల 24 నుంచి మళ్లీ బలం పుంజుకుంటాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం పశ్చిమ బంగాళాఖాతంలో ఉత్తరాం ధ్రకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది. ఇది మంగళవారం నాటికి ఒకింత దిగువకు అంటే 5.8 కిలోమీటర్లకు వచ్చింది.

ఈ నెల 24 అనంతరం ఇది 3.6 కిలోమీటర్ల కిందకు వస్తే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలకు ఆస్కారం ఏర్పడనుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు మంగళవారం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు (40 డిగ్రీలకు పైగా) నమోదయ్యాయి. సాధారణంకంటే ఐదారు డిగ్రీలు అధికంగా రికార్డవడంతో వడగాడ్పులు వీచాయి. రానున్న మరో రెండు మూడు రోజులు కోస్తాంధ్రలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

అదే సమయంలో కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు గానీ, వర్షం గానీ కురిసే అవకాశం ఉందని మంగళవారం రాత్రి నివేదికలో ఐఎండీ తెలిపింది. బుధవారం కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో పాటు పిడుగులు పడేందుకు అవకాశాలున్నాయని, ఆయా ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గడచిన 24 గంటల్లో విశాఖలో 4, కురుపాంలో 3, గరివిడిలో 2 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. 

మరిన్ని వార్తలు