రైతుబజార్ వ్యాపారి ఆత్మహత్య

7 Oct, 2014 00:19 IST|Sakshi
రైతుబజార్ వ్యాపారి ఆత్మహత్య

గుంటూరు రూరల్: నగరశివారు తురకపాలెం రోడ్డులోని జన్మభూమినగర్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. రూరల్ ఎస్‌ఐ కృష్ణానందం తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు  కృష్ణనగర్‌కు చెందిన కర్రి రవీంద్రసాయి(33) పట్టాభిపురం రైతుబజార్‌లో కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. కొంతకాలంగా అన్యమనస్కంగా ఉంటున్న రవీంద్రసాయి ఆదివారం మధ్యాహ్నం వరకు రైతుబజార్‌లో కూరగాయలు విక్రయించాడు. తర్వాత సొంత కారులో బయలుదేరి తురకపాలెం రోడ్డు శివారులో ఉన్న చెట్ల మధ్య ఖాళీస్థలంలో ఆపి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు సోమవారం గమనించి  రూరల్ పోలీసులకు సమాచారమివ్వడంతో రూరల్ ఎస్‌ఐ సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకుని విచారించారు.  

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించి కేసు నమోదుచేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రవీంద్రసాయికి కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉండడంతో కుటుంబ కలహాలు చోటుచేసుకుంటున్నాయి. ఈనేపథ్యంలో మనస్తాపానికి లోనై ఆత్మహత్య చేసుకుని ఉంటాడని మృతుడి సన్నిహితులు చెబుతున్నారు. ఇదిలాఉంటే రైతుబజార్ తొలగిస్తున్నారని జీవనోపాధి ఉండదని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కొందరు అంటున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

మరిన్ని వార్తలు