రైవాడ కోసం ప్రాణత్యాగానికి సిద్ధం

17 Feb, 2016 03:22 IST|Sakshi
రైవాడ కోసం ప్రాణత్యాగానికి సిద్ధం

ప్రాజెక్టు నీటి సాధన కమిటీ హెచ్చరి క
ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమం ఉధృతం
కెనాల్‌కు గండ్లు కొట్టేందుకు రైతులు
వెనుకాడబోరని స్పష్టీకరణ
 
 
దేవరాపల్లి: రైవాడ నీటిని రైతులకు అంకితం చేస్తూ జీవో జారీ చేసేవరకు పోరాటం కొనసాగిస్తామని, అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని రైవాడ ప్రాజెక్టు నీటి సాధన కమిటీ అల్టిమేటం విధించింది. రైవాడ సాధన కమిటీ ఈ నెల 14 నుంచి చేపట్టిన పాదయాత్ర మంగళవారం మండలంలోని అచ్చియ్యపాలెం, కొండూరుపాలెం, ఎ. కొత్తపల్లి, కేఎం పాలెం మీదుగా సాగింది. సాధన కమిటీ ప్రతినిధులు ముషిడిపల్లి వద్ద బసచేశారు. ఇప్పటివరకు 62 కిలోమీటర్ల మేర కొనసాగింది.  సాధన కమిటీ సభ్యుడు వేచలపు చినరామునాయుడు మాట్లాడుతూ కొన్నేళ్లు రైవాడ రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వాల ఆటలు ఇకపై సాగనిచ్చేది లేదన్నారు. రైవాడను జలాశయాన్ని రైతులకు అంకితం చేస్తానని చెప్పి గద్దెనెక్కిన సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని విస్మరించారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం దిగిరాకుంటే కెనాల్‌కు గండ్లు కొట్టేందుకుకూడా రైతులు వెనుకాడరని హెచ్చరించారు. ఎదురయ్యే తీవ్ర పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.ఈ నెల 18న జరగనున్న ముగింపు సభలో ఉద్యమం ఉధృతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్లు ముట్టడించి నిరసన తెలుపుతామని అన్నారు. సాధన కమిటీ సభ్యుడు లెక్కల శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతాంగానికి నష్టం కలిగించే జీవో నంబరు 160ను రద్దు చేయడమే కాకుండా, జీవీఎంసీ బకాయిపడ్డ రూ.112 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా 50 వేల ఎకరాలకు సాగునీరందించేలా ప్రభుత్వం స్పందించాలని కోరారు.


మద్దతు తెలిపిన అజయ్‌శర్మ
రైవాడ ప్రాజెక్టు నీటి సాధన కమిటీ పాదయాత్రకు ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కమిటీ ప్రధాన కార్యదర్శి అజయ్‌శర్మ మద్దతు తెలిపారు. మంగళవారం ఆయన ఎ.కొత్తపల్లి సమీపంలో పాదయాత్ర బృందాన్ని ఆయన కలిశారు. ఇతర దేశాలనుంచి పరిశ్రమలు ఆహ్వానిస్తున్న ప్రభుత్వం అందుకు అవసరమయ్యే నీరు, పట్టణవాసుల తాగునీటికి అవసరమైన ప్రాజెక్టు నిర్మాణంపై దృష్టి సారించకపోవడం దారుణమన్నారు. పట్టి సీమ మాదిరిగా పురుషోత్తపురం వద్ద ఎత్తిపోతల పథకం నిర్మిస్తే విశాఖ నగర ప్రజలకు తాగునీటితో పాటు పారిశ్రామిక అవసరాలకు నీటి సమస్య తీరిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు డి.వెంకన్న, గండి నాయనబాబు, ఆదిరెడ్డి కన్నబాబు, ఎన్నంశెట్టి సత్యనారాయణ, చల్లా జగన్, పెద్ది నాయుడు, సీహెచ్ రాజు, నాగిరెడ్డి సత్యనారాయణ, శీరంరెడ్డి సింహాద్రప్పడు, గొంప మల్లునాయుడు, రాము, వి.నాయుడుబాబు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు