కరోనా వైరస్‌తో మహిళ మృతి

19 Jun, 2020 12:39 IST|Sakshi
రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్‌

రిమాండ్‌ ఖైదీలకు, జైల్‌ సిబ్బందికి పరీక్షలు  

సెంట్రల్‌ జైల్‌ సూపరింటెండెంట్‌ రాజారావు వెల్లడి  

తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: కరోనా వైరస్‌ (కోవిడ్‌–19) వ్యాధితో మహిళ మృతి చెందిన సంఘటన రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది. రాజమహేంద్రవరం సీటీఆర్‌ఐకు చెందిన 55 ఏళ్ల మహిళ కరోనా వ్యాధితో గురువారం మృతి చెందింది. ఈనెల 16వ తేదీ రాత్రి వ్యాధితో బాధపడుతున్న ఆమెను చికిత్స కోసం రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సోమ సుందరరావు పర్యవేక్షణలో డాక్టర్‌ నాయక్‌ ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఈనేపథ్యంలో గురువారం ఆమె మృతి చెందింది. ఆమెకు షుగర్, బీపీ వంటి వ్యాధులు ఉన్నట్టు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌  సోమసుందరరావు తెలిపారు. మహిళ కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు పది మందికి కరోనా టెస్ట్‌లు నిర్వహించామని ఆయన తెలిపారు. ఎవరికైనా పాజిటివ్‌ వస్తే క్వారంటైన్‌కు తరలించి వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. 

రిమాండ్‌ ఖైదీకి పాజిటివ్‌
రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్‌లో రిమాండ్‌ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రేప్‌ కేసులో విజయవాడ కోర్టు రిమాండ్‌ విధించడంతో శిక్ష అనుభవించేందుకు నిమిత్తం ఖైదీని ఈనెల 16న రాజమహేంద్రవరం సెంట్రల్‌జైల్‌ కు తరలించారు. రిమాండ్‌ ఖైదీకి పాజిటివ్‌ ఉన్నట్టు ఈనెల 17వ తేదీ రాత్రి జైల్‌ అధికారులకు విజయవాడ నుంచి సమాచారం అందించడంతో వెంటనే చికిత్స కోసం అతడిని క్వారంటైన్‌కు తరలించామని సెంట్రల్‌ జైల్‌ సూపరింటెండెంట్‌ ఎస్‌. రాజారావు తెలిపారు. ఖైదీతో పాటు బ్లాక్‌లో ఉన్న సహ రిమాండ్‌ ఖైదీలకు, సెంట్రల్‌ జైల్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి కరోనా టెస్ట్‌లు చేయిస్తున్నామని సెంట్రల్‌జైల్‌ సూపరింటెండెంట్‌ తెలిపారు. ఖైదీల్లో ఎవరికైనా పాజిటివ్‌ కేసులు నమోదైతే వెంటనే క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. 

మరిన్ని వార్తలు