'తూర్పు' దారిలో నేత్తుటేరులు

27 Dec, 2015 00:47 IST|Sakshi
'తూర్పు' దారిలో నేత్తుటేరులు

 ‘తూర్పు’న ఈ సంవత్సరం రక్తచరిత్రను లిఖించింది. అత్యంత ఘోరంగా  జరిగిన ప్రమాదాలు, వివిధ సంఘటనలు జిల్లావాసులను తీవ్ర కలవరపాటుకు గురి చేశాయి. పుష్కరాల తొలిరోజున జరిగిన తొక్కిసలాటలో 29 మంది.. ధవళేశ్వరం బ్యారేజి పైనుంచి తూఫాన్ వ్యాన్ బోల్తా పడి 22 మంది.. గండేపల్లివద్ద లారీ బోల్తా పడి 16 మంది మృత్యువాత పడిన సంఘటనలు రాష్ర్టవ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి. ఇంకా హత్యలు, ఆత్మహత్యలు, అనుమానాస్పద మరణాలు.. దోపిడీలు, దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లవంటి ఘటనలతో జిల్లావాసులు బెంబేలెత్తారు.
 - కాకినాడ క్రైం/రాజమండ్రి క్రైం
 

 రహదారులు రక్తసిక్తం
 ఫిబ్రవరి 1 : రాజమండ్రి మోరంపూడి సెంటర్‌లో జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఐదుగురు గాయపడ్డారు. వేమగిరివైపు వెళ్తున్న స్కూల్ బస్సు.. బ్రేక్‌లు ఫెయిలవడంతో అదుపుతప్పి ఒక కారును, మూడు ద్విచక్ర వాహనాలను ఢీకొని, పక్కనే ఉన్న డ్రైనేజీలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో మండపేట గొల్లపుంతకు చెందిన ఇనుపకోళ్ళ దుర్గాప్రసాద్ (13), రాజమండ్రి గాంధీపురానికి చెందిన ర్యాలి వెంకన్న (55), కాకినాడ రూరల్ కరప మండలం కోదాడకు చెందిన శివనేని మహాలక్ష్మి (70) దుర్మరణం పాలయ్యారు.
 
 జూన్ 4 : రంపచోడవరం సమీపంలో పెళ్లిబృందం వ్యాన్ బోల్తా పడి తొమ్మిది మంది మృతి చెందారు.
 జూన్ 13 : ధవళేశ్వరం బ్యారేజి పైనుంచి దిగువన ఉన్న స్కవర్ స్లూయిజ్‌లోకి తూఫాన్ వ్యాన్ అర్ధరాత్రి బోల్తా పడిన దుర్ఘటనలో.. అందులో ప్రయాణిస్తున్న 22 మంది నిద్రలోనే మృత్యువాత పడ్డారు. మృతులందరూ విశాఖ జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందినవారు.
 
 సెప్టెంబర్ 14 : గండేపల్లివద్ద జాతీయ రహదారిపై లారీ బోల్తాపడి 16 మంది వలస కూలీలు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో మరో 18 మంది గాయాలతో బయటపడ్డారు. ఈ ఏడాది జిల్లా పోలీసుల పరిధిలో 556 రోడ్డు ప్రమాదాలు జరగగా, వాటిలో 592 మంది మృతి చెందారు. 1163 మంది గాయపడ్డారు. రాజమండ్రి పోలీసు అర్బన్ జిల్లా పరిధిలో 483 ప్రమాదాలు జరగగా, 163 మంది మృతి చెందారు. 492 మంది గాయపడ్డారు.
 
 వణికించిన హత్యలు
 జిల్లాలో గత ఏడాది నమ్మకద్రోహం కేసులు 96 నమోదైతే, ఈ సంవత్సరం ఆ సంఖ్య 102కు చేరుకుంది. మహిళలపై లైంగిక దాడులు గత ఏడాదికంటే ఈసారి 13 పెరిగాయి.
 
 జనవరి 23 : పిల్లలు పుట్టలేదన్న కోపంతో రామచంద్రపురంలో భార్య వెంకటలక్ష్మి మెడకు తాడు బిగించి భర్త పడగ అంజి హత్య చేశాడు. దీనిని ఆత్మహత్యగా చిత్రించేందుకు ప్రయత్నించాడు.

 ఫిబ్రవరి 5 : రాజమండ్రి ఏవీ అప్పారావు రోడ్డు కోకా భాస్కరరావు వీధిలో గంటా నరసింహమూర్తి, గంటా సంతోషి(24)లకు 2, 3 ఏళ్ల పిల్లలు ఇద్దరున్నారు. తన పిన్ని కొడుకుతో సన్నిహితంగా ఉంటోందన్న అనుమానంతో సంతోషిని నరసింహమూర్తి రాడ్డుతో కొట్టాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
 
 ఫిబ్రవరి 7 : మండపేటకు చెందిన దుర్గాదేవి(35)కి కపిలేశ్వరపురం మండలం కాలేరుకు చెందిన మేనమామ బూరుల వీరబాబుతో పద్దెనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. రెండేళ్ల క్రితం దుర్గాదేవి మండపేటకు చెందిన తాపీమేస్త్రి గణేష్‌తో వెళ్లిపోయింది. కాకినాడలోని ఒక ఇంట్లో అద్దెకు ఉండేవారు. వారిమధ్య తరచూ ఘర్షణలు జరిగేవి. ఈ నేపథ్యంలో దుర్గాదేవిని గణేష్ గొంతు నులిమి హత్య చేశాడు.
 
 ఫిబ్రవరి 20 : సఖినేటిపల్లి చర్చిపేటలో ఉంటున్న చింతపల్లి మంగాదేవి(28)ని భర్త సత్యనారాయణ గొంతు నులిమి చంపాడు. ఖత్తర్‌లో ఉండగా 2010లో వారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దీనికి సత్యనారాయణ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. తిరిగి ఖత్తర్ వెళ్లిపోయాడు. మూడు నెలల  తరువాత ఖత్తర్ నుంచి వచ్చిన సత్యనారాయణ భార్యతో ఘర్షణకు దిగాడు. బంధువులపై పెట్టిన కేసు ఉపసంహరించుకునే విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఇంట్లో నిద్రిస్తున్న భార్యను సత్యనారాయణ హత్య చేశాడు.
 
 మార్చి 2 : కొత్తపేట మండలంలో అంతటి శిరీష(25)ను ఆమె భర్త గెడ్డం జగదీష్ చీరకొంగుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. మృతదేహాన్ని స్నేహితుల సహాయంతో ఆటోలో తీసుకువెళ్లి, పాశర్లపూడి డ్రైనేజీ గట్టున పాతిపెట్టాడు.
 
 మార్చి 13 : రాయవరం మండలం చెల్లూరు కొత్తపేట కాలనీకి చెందిన గుత్తుల సూర్యారావుకు, కొత్తపేట మండలం పలివెల గ్రామానికి చెందిన వీర రాఘవమ్మ(44)తో 24 ఏళ్లక్రితం వివాహమైంది. ఆమెపై అనుమానంతో కర్రతో విచక్షణా రహితంగా కొట్టి చంపాడు.
 
 మే 19 : రాజోలు మండలం వేగివారిపాలేనికి చెందిన బొక్కా మధుసూదనరావుకు, పి.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన దుర్గభవాని(26)తో వివాహమైంది. గల్ఫ్‌లో ఉంటున్న అతడు వివాహహానంతరం భార్యను అక్కడకు తీసుకువెళ్ళాడు. గర్భవతి కావడంతో తిరిగి ఇంటికి పంపించాడు. గొడవల నేపథ్యంలో అత్తవారిపై దుర్గాభవాని కేసు పెట్టింది. గల్ఫ్ నుంచి వచ్చిన మధుసూదనరావు అత్తవారింటికి వెళ్లి భార్యను తనతో తీసుకువెళ్లాడు. ఆ రోజు రాత్రి తాటిపాకలో ఒక హోటల్‌లో గడిపారు. ఉదయం గదులు శుభ్రం చేయడానికి వచ్చిన సిబ్బంది దుర్గాభవాని మృతి చెంది ఉండడం గమనించారు.
 
 సెప్టెంబర్ 29 : గండేపల్లి మండలం మల్లేపల్లికి చెందిన గుదే శ్రీనివాస్ తాపీపని చేసుకుని జీవిస్తాడు. భార్య ఝాన్సీ టైలరింగ్ చేస్తుంది. రాజమండ్రి తుమ్మలావలోని అద్దె ఇంట్లో వారు నివసిస్తున్నారు. భార్యపై అనుమానం పెంచుకున్న శ్రీనివాస్ ఆమెను కత్తెరతో పొడిచి హత్య చేశాడు.

 డిసెంబర్ 11 : యానాం దరియాలతిప్పవద్ద గౌతమీ గోదావరిలో కారు జలసమాధి అయి ఆరుగురు మృతి చెందారు. లక్షల రూపాయలు అప్పు చేసిన కొప్పాడ పవన్‌కుమార్.. వాటిని తీర్చే దారి కానరాక, ఒత్తిళ్లకు తాళలేక.. ఆత్మహత్యకు పథకం వేశాడు. తనతోపాటు కారులో కుటుంబ సభ్యులను కూడా తీసుకువెళ్లి గోదావరిలో జలసమాధి అయ్యాడు.
 
 పేట్రేగిన చైన్‌స్నాచర్లు
 జిల్లాలో చైన్‌స్నాచర్లు పేట్రేగిపోయారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ముఠాలు, చెడు వ్యసనాలకు బానిసైన విద్యార్థులు, చదువు మధ్యలో ఆపేసినవారు వీటికి పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్‌గా చేసుకుని వారి మెడలోని బంగారు ఆభరణాలు దోచుకుపోతున్నారు. రాజమండ్రి పోలీసు అర్బన్ జిల్లాలో 120 చైన్ స్నాచింగ్ కేసులు నమోదవగా.. మూడింటిలో మాత్రమే నిందితులను అరెస్టు చేయగలిగారు. కొందరు ఆటో డ్రైవర్లుగా అవతారమెత్తి, కిరాయికి ఎక్కిన మహిళలను నిర్జన ప్రదేశాలకు తీసుకువెళ్లి వారిపై దాడులకు పాల్పడుతున్నారు.
 
 పెరుగుతున్న గంజాయి మత్తు
 గంజాయి కేసులు కూడా ఈ ఏడాది రికార్డు స్థాయిలోనే నమోదయ్యాయి. గత ఏడాది 27 కేసులలో 73 మందిని అరెస్టు చేసి రూ.82.59 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది 46 కేసులలో 115 మందిని అరెస్టు చేసి, రూ.1.61 కోట్ల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
 
 మహాపర్వం వేళ.. మాయని మచ్చ
 పావనవాహిని గోదావరి మహాపర్వం.. పుష్కరాల తొలి రోజైన జూలై 14న రాజమండ్రి పుష్కరాల రేవులో జరిగిన తొక్కిసలాటలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. పుష్కరాల చరిత్రలోనే ఈ సంఘటన మాయని మచ్చగా మిగిలింది. ఆ రోజు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబ సమేతంగా పుష్కరాల రేవులో పుష్కర స్నానం ఆచరించడం.. పుష్కరాల ప్రారంభంపై డాక్యుమెంటరీ ఫిల్మ్ చిత్రీకరణ కోసం మూడు గంటలపాటు అక్కడే ఉండిపోవడంతో వేలాదిగా వచ్చిన భక్తులను నిలిపివేశారు.
 
 ముఖ్యమంత్రి వెళ్లిన తరువాత ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తొక్కిసలాట జరిగి 29 మంది మృతి చెందారు. అనేకమంది గాయపడ్డారు. సీఎం బాధ్యతారాహిత్యం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇది జరిగిన చాలా నెలల తరువాత ఈ సంఘటనపై విచారణకు ప్రభుత్వం సోమయాజులు కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ ఈ నెల 12న విచారణ జరపనున్నట్టు ప్రకటించింది. కానీ ఆ రోజు విచారణ జరపలేదు.

మరిన్ని వార్తలు