కేంద్రం ఇస్తున్న బడ్జెట్‌ సరిపోదు : ఎంపీ

1 Oct, 2019 19:13 IST|Sakshi

సాక్షి, తూర్పు గోదావరి జిల్లా : కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న రూ. రెండు వేల కోట్లు క్రీడలకు సరిపోదని రాజమండ్రి వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్‌ వ్యాఖ్యానించారు. ఈ నెల 4 నుంచి మూడు రోజుల పాటు స్థానికంగా జరిగే ఆంధ్రప్రదేశ్‌ జూనియర్‌ డిస్ట్రిక్ట్‌ అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌ నిర్వహణ కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఈ పోటీలకు 13 జిల్లాల నుంచి 1200 మంది విద్యార్థులు హాజరుకానున్నారని వెల్లడించారు. వంద మీటర్ల నుంచి పదివేల మీటర్ల వరకు రన్నింగ్‌ పోటీలు, హైజంప్‌, జావెలిన్‌ త్రో వంటి అంశాల్లో పోటీలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. క్రీడలు చదువులో ఒక భాగం కావాలని, రాబోయే ఒలంపిక్స్‌లో మన దేశం గతం కంటే ఎక్కువ పథకాలను సాధించాలని ఆకాంక్షించారు. క్రీడలకు బడ్జెట్‌ పెంచే అంశాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లామని భరత్‌ వెల్లడించారు. మరోవైపు రాజమండ్రిలో అంతర్జాతీయస్థాయి స్టేడియం నిర్మాణంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.    

మరిన్ని వార్తలు