బస్తీల్లో కొత్త జమానా

4 Jul, 2014 00:07 IST|Sakshi
బస్తీల్లో కొత్త జమానా

- జిల్లాలో కొలువుదీరిన కొత్త కౌన్సిళ్లు రాజమండ్రి మేయర్‌గా రజనీ శేషసాయి
- రామచంద్రపురంలో టీడీపీ కుటిల వ్యూహం ఏలేశ్వరంలో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్‌కు ఎర

 సాక్షి, రాజమండ్రి : రాజమండ్రి నగర పాలక సంస్థ, అమలాపురం, తుని, మండపేట, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీలు, ముమ్మిడివరం, ఏలేశ్వరం, గొల్లప్రోలు నగర పంచాయతీల  తొలి కౌన్సిల్ సమావేశాలు గురువారం జరిగాయి.  అన్నిచో ట్లా పురపాలన టీడీపీకే దక్కింది. ఎన్నికల అధికారులు ఉదయం 11.00 గంటలకు కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో తెలుగు అక్షర క్రమంలో ప్రమాణం చేయించారు.

అనంతరం మేయర్, మున్సిపల్ చైర్మన్‌ల ఎన్నికలను,  డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్‌ల ఎన్నికలను నిర్వహించారు. ముమ్మిడివరం మినహా అన్నిచోట్లా ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. రాజమండ్రి మేయర్‌గా పంతం రజనీ శేషసాయి  పేరును 22వ డివిజన్ కార్పొరేటర్ మాటూరి రంగారావు ప్రతిపాదించగా, 32వ డివిజన్ కార్పొరేటర్ ద్వారా పార్వతీసుందరి బలపరిచారు. మరో నామినేషన్  పడక పోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్టు ఎన్నికల అధికారి, కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ ప్రకటించారు.  

డిప్యూటీ మేయర్‌గా వాసిరెడ్డి రాంబాబు ఎన్నిక కూడా ఏకగ్రీవమైంది. సమావేశానికి ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీ మాగంటి మురళీమోహన్, ఎమ్మెల్సీ ఆది రెడ్డి అప్పారావు, రాజమండ్రి రూరల్, అర్బన్ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి,ఆకుల సత్యనారాయ ణ హాజరయ్యారు. అమలాపురంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ఆర్డీఓ సీహెచ్ ప్రియాంక పర్యవేక్షణలో  జరిగాయి. ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు హాజరయ్యారు. పెద్దాపురంలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఒక్కొక్క నామినేషనే పడ్డందున  ఎన్నిక ఏకగ్రీవమైందని ఆర్డీఓ కూర్మానాథ్ ప్రకటించారు.

పిఠాపురంలోనూ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఏకగ్రీవమైనట్టు ఎన్నికల అధికారి, డీఆర్‌డీఏ పీడీ చంద్రశేఖర్‌రావ ు ప్రకటించారు. ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ సమావేశానికి హాజరయ్యారు. మండపేటలో కూడా రెండు పదవులూ ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికల అధికారిగా డీఈఓ శ్రీనివాసులురెడ్డి వ్యవహరించారు.
 
సామర్లకోటలో ఆయనకు బదులు ఆవిడ..
సామర్లకోటలో చైర్మన్ ఎన్నిక అనుకోని మలుపు తిరిగింది. ముందుగా చైర్మన్‌గా మన్యం చంద్రరావు పేరును ఖరారు చేసినా.. చివరి క్షణంలో సామాజిక సమీకరణాల పేరుతో పోటీ నెలకొనడంతో చంద్రరావు భార్య, 26వ వార్డు కౌన్సిలర్ సత్యవతికి ఆ పదవిని కట్టబెట్టారు. ఇతరుల అసంతృప్తిని మహిళా సెంటిమెంట్‌తో  అధిగమించే ప్రయత్నం చేశారు టీడీపీ పెద్దలు. సమావేశానికి హాజరైన డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప పరిస్థితిని సమీక్షించి చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నిక ఏకగ్రీవం చేశారు.  
 
బలమున్నా.. ఇండిపెండెంట్‌కు పట్టం
రామచంద్రపురంలో టీడీపీకి మెజారిటీ సభ్యులున్నా పార్టీ అభ్యర్థిని కాక ఇండిపెండెంట్‌ను చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక్కడ చైర్మన్ అభ్యర్థిగా ఎన్నికలకు ముందే ఎస్‌ఆర్‌కే గోపాల్‌బాబును ప్రకటించారు. తీరా ఆయన ఓటమి పాలవడంతో కంగు తిన్న పార్టీ నేతలు కొత్త ఎత్తుగడగానే ఇండిపెండెంట్‌కు పట్టం కట్టించారని తెలుస్తోంది. త్వరలోనే ఇండిపెండెంట్ చై ర్మన్‌తో రాజీనామా చేయించి అదే స్థానంలో మళ్లీ గోపాల్‌బాబును గెలిపించి చైర్మన్  చేయాలన్నదే ఆ ఎత్తుగడ అని పార్టీ వర్గాలంటున్నాయి.  
 
చైర్ పర్సన్ విప్ ధిక్కరణపై ఫిర్యాదు
ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్మన్ పీఠం కోసం టీడీపీ తప్పుడు రాజకీయానికి పాల్పడింది. ఇక్కడ చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ కాగా మెజారిటీ స్థానాల్లో గెలుపొందిన టీడీపీకి ఆ కేటగిరీలో విజేతే లేకపోయా రు. దీంతో వైఎస్సార్ సీపీ నుంచి గెలిచిన ఆరో వార్డు కౌన్సిలర్ కొప్పాడ పార్వతికి చైర్మన్ పదవిని ఎరగా చూపి తమ వైపు తిప్పుకొన్నారు.

గురువారం ఆమెనే చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీనిపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ తమ కౌన్సిలర్‌ను కిడ్నాప్ చేసిందని ఆరోపించారు. పార్వతి విప్ ధిక్కరించడంపై వైఎస్సార్ సీపీ నేతలు ఫిర్యాదు చేయగా నిబంధనల ప్రకారం నోటీసు జారీ చేస్తామని ఎన్నికల అధికారిగా వ్యవహరించిన పోలవరం ప్రాజెక్టు భూసేకరణ విభాగం డిప్యూటీ కలెక్టర్ విజయ సారథి చెప్పారు.
 
గొల్లప్రోలులోనూ కుట్రే
గొల్లప్రోలు నగర పంచాయతీలోనూ టీడీపీ కుటిల రాజకీయాలకు పాల్పడింది.  ఇక్కడ టీడీపీకి 10, వైఎస్సార్ కాంగ్రెస్‌కు 10 ఓట్ల బలం ఉంది. ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఎమ్మెల్యే వర్మతో టీడీపీ ఓట్లు 11 అవుతాయి. అయినా వైఎస్సార్ సీపీకి చెందిన 10వ వార్డు కౌన్సిలర్ పడాల రాంబాబుకు వైస్ చైర్మన్ పదవిని ఆశ చూపి ఓటింగ్‌కు గైర్హాజరయ్యేలా చేశారు.

ప్రమాణ స్వీకారం చేశాక రాంబాబు చైర్మన్ ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. చైర్మన్ ఎన్నిక అనంతరం టీడీపీ కౌన్సిలర్లు పడాలను వైస్‌చైర్మన్‌గా ఎన్నుకున్నారు. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ విప్ తెడ్ల చిన్నారావు ఆధ్వర్యంలో ఎన్నికల అధికారి అయిన పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్  టి.విఎస్.జి.కుమార్‌కు ఫిర్యాదు చేశారు.

ముమ్మిడివరంలో ఓటింగ్‌లో గెలిచిన చెల్లి
ముమ్మిడివరం నగర పంచాయతీలో చైర్మన్ పదవికి జరిగిన ఓటింగ్‌లో టీడీపీ అభ్యర్థి చెల్లి శాంత కుమారికి 13 ఓట్లు, వైఎస్సార్ సీపీ అభ్యర్థి కాశిన బాల ముని కుమారికి 9 ఓట్లు వచ్చాయి.  ఎన్నికల్లో రెండుపార్టీలకు చెరో ఎనిమిది వార్డులు లభించగా నలుగురు ఇండిపెం డెంట్లలో ముగ్గురిని టీడీపీ తన వైపు తిప్పుకుంది. ఎక్స్ అఫీషియో సభ్యులైన ఎంపీ రవీంద్రబాబు, ఎమ్మె ల్యే దాట్ల బుచ్చిబాబు ఓట్లతో కలిపి 13 ఓట్లు సాధిం చింది.  
 
తునిలో ‘వైస్ కోసం తెలుగుతమ్ముళ్ల పోటీ
తునిలో చైర్మన్ పదవి ఏకగ్రీవమైనా వైస్ చైర్మన్ పదవికి కుచ్చర్ల జగన్నాథరాజు, కె.బాలాజీ పోటీ పడగా గంటపాటు అయోమయం నెలకొంది. జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు యనమల కృష్ణుడు ఇద్దరికీ చెరో రెండున్నరేళ్లు పదవి ఇచ్చేలా రాజీ కుదిర్చారు. దీంతో తొలి విడతకు జగన్నాథరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

మరిన్ని వార్తలు