‘సై’ అనకుంటే సాగనంపడమే..

17 Oct, 2014 01:38 IST|Sakshi

 సాక్షి, రాజమండ్రి :   నగరంలో కొందరు బడా బిల్డర్లు తమ భవన నిర్మాణాలకు సంబంధించిన ప్లాన్‌లకు అనుమతిని ఇవ్వడంలో చూసీచూడనట్టు వ్యవహరించని అధికారులను సాగనంపేందుకు ‘మాస్టర్ ప్లాన్’ వేస్తున్నారు. ముఖ్యంగా తాము నిర్మించే భవనాలకు.. నిబంధనలను గోదాట్లో కలిపైనా అనుతులు ఇవ్వడానికి అంగీకరించని పట్టణ ప్రణాళికా విభాగం (టౌన్ ప్లానింగ్) అధికారులపై కన్నెర్రజేస్తున్నారు. ఇక్కడి నుంచి బదిలీ చేయిస్తూ వారి సత్తా చూపుతున్నారు. ఈ క్రమంలో నగర పాలక సంస్థ ఆదాయానికి గండి కొడుతున్నారు. మాట వినని అధికారుల పై బదిలీ వేటు వేయించడంలో బిల్డర్లకు.. భవన నిర్మాణరంగంలో అపార అనుభవం ఉన్న ఓ ప్రజా ప్రతినిధి సహకరిస్తున్నట్టు సమాచారం. అడిగిందే తడవుగా అనుమతులు ఇవ్వనందున దాదాపు 15 మంది బిల్డర్లు పట్టణ ప్రణాళికా విభాగంలో కీలకమైన సిటీ ప్లానర్‌ను సాగనంపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
 
 ఇందుకు నగర పాలక సంస్థలో ఓ ఉన్నతాధికారి సైతం సై అంటున్నట్టు సమాచారం. మున్సిపాలిటీల్లో భవన నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలంటే స్థలం రిజిస్ట్రేషన్ విలువలో 14 శాతం ఓపెన్ స్పేస్ చార్జీలుగా చెల్లించాలి. భవన నిర్మాణానికి  చెల్లించే రుసుముల్లో ఇదే పెద్ద మొత్తం. ఈ నిబంధన సొంతానికి ఇళ్లు కట్టుకునే వారి కన్నా అపార్టుమెంట్లు నిర్మించే బిల్డర్లు దీన్ని భారంగా భావిస్తున్నారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నిబంధనల ప్రకారం 1985 కన్నా ముందు జరిగిన నిర్మాణాలను బిల్డప్ ఏరియాలుగా గుర్తిస్తారు. మిగిలిన ప్రాంతాల్లో భవన నిర్మాణాలకు అనుమతి పొందాలంటే విధిగా 14 శాతం లే అవుట్ ఓపెన్ స్పేస్ చార్జీలు చెల్లించాలి. అయితే సుమారు పదేళ్ల క్రితం వరకూ నిర్మాణ ప్రాంతాలుగా అభివృద్ధి చెందిన ప్రాంతాలన్నింటినీ బిల్డప్ ఏరియాలుగాా పరిగణించాలని బిల్డర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ఈ విషయంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనాన్ని కూడా ప్రచురించింది. దీంతో పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు నిబంధనల ప్రకారం నాన్ బిల్డప్ ఏరియాల్లో భవనాలకు 14 శాతం చార్జీలు చెల్లించకపోతే అనుమతులను నిరాకరిస్తున్నారు.
 
 ఆరునూరైనా అనుమతి ఇవ్వాల్సిందే..
 అయితే తమ నిర్మాణాలకు నిబంధనలు పక్కన పెట్టయినా అనుమతులు ఇవ్వాలని బిల్డర్లు ఆ విభాగం అధికారులపై ఒత్తిడి తేవడం ప్రారంభించారు. అక్కడితో ఆగకుండా ప్లాన్‌ల అనుమతులు ఇవ్వనందుకు పట్టణ ప్రణాళికా విభాగం డిప్యూటీ సీపీ, ఇన్‌చార్జి సిటీ ప్లానర్ (ఎఫ్‌ఏసీ) రామ్‌ప్రసాద్‌ను బదిలీ చేయించాలని రెండు రోజులుగా ఓ ప్రజాప్రతినిధి సహకారంతో ఉన్నతస్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వాస్తవానికి ఇన్‌చార్జి సీపీగా ఉన్న రామ్‌ప్రసాద్‌ను 10 రోజుల క్రితం కర్నూలుకు బదిలీ చేయించారు. అయితే ఆయన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి తిరిగి అదే స్థానంలో బాధ్యతలు నిర్వర్తిస్తునారు. ఈలోగానే కమిషనర్ రవీంద్రబాబు ఇన్‌చార్జి సీపీగా మరో డీసీపీ ప్రదీప్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. దీని వెనుక కూడా బడా బిల్డర్ల ఒత్తిడులు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రిబ్యునల్‌కు వెళ్లి, ఇక్కడికి తిరిగి వచ్చిన రామ్‌ప్రసాద్ రోజూ నగర పాలక సంస్థ కార్యాలయానికి వచ్చి హాజరు పట్టీలో సంతకం చేసి ఇన్‌చార్జి సీపీ హోదాలో తన  చాంబర్‌లో కూర్చుంటున్నారు. దీంతో ఆయనను ఎలాగైనా తిరిగి బదిలీ చేయించాలని పంతం పట్టిన బడా బిల్డర్లు ప్రజా ప్రతినిధి సహకారంతో ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. అంటే.. నిబంధనలకు నీళ్లు వదిలినా, నగర పాలక సంస్థ రాబడికి గండి పడ్డా బిల్డర్ల స్వార్థమే పరమార్థమైందన్న మాట!
 

మరిన్ని వార్తలు