ప్రిన్సి‘ఫ్రాడ్‌’పై విచారణకు ఆదేశం

20 Aug, 2019 08:26 IST|Sakshi
జూనియర్‌ కాలేజీలో విచారణ నిర్వహిస్తున్న ఆర్‌జేడీ నగేష్‌కుమార్‌

 తవ్వేకొద్దీ బయటపడుతున్న అవినీతి

చివరి దశకు రెండున్నరేళ్ల పోరాటం

సాక్షి, రాజమహేంద్రవరం : స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కొత్తపల్లి వీర్రాజుపై ఉచ్చు బిగుస్తోంది. కళాశాలలో వేధింపులకు గురి చేస్తున్న ఆయనపై మహిళా అధ్యాపకులు రెండున్నరేళ్లుగా చేస్తున్న పోరాటం చివరి దశకు చేరుకుంది. ప్రిన్సిపాల్‌ వ్యవహార శైలి, అవకతవకలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని పోలీసులకు, ఉన్నతాధికారులకు బాధితులు చేసిన ఫిర్యాదులను తనకున్న రాజకీయ పలుకుబడితో బుట్టదాఖలు చేయించి ఇన్నాళ్లూ ఆయన బయటపడుతూ వచ్చారు.  విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు, మార్కెట్‌లోకంటే ఎక్కువ ధరకు యూనిఫాం విక్రయాలు తదితర అవకతవకలను ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకి తీసుకురావడంతో రాష్ట ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశించింది.

ఇంటర్మీడియట్‌ బోర్డు జాయింట్‌ డైరెక్టర్‌ గోవిందరావు ఆదేశాల మేరకు శనివారం రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ నగేష్‌కుమార్‌ విచారణ నిర్వహించారు. కాలేజీ క్యాంపస్‌లోని సెమినార్‌ హాలులో నాలుగు గోడల మధ్య గోప్యంగా జరిపిన విచారణలో అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్‌తోపాటు సుమారు 48 మంది బోధన, బోధనేతర సిబ్బంది హాజరయ్యారు. మొబైల్‌ ఫోన్లను హాలులోకి అనుమతించలేదు. విచారణలో ప్రతి ఒక్కరికీ 14 అంశాలతో కూడిన ప్రశ్నావళిని అందజేసి బాధితులతో వ్యక్తిగతంగా పూర్తి చేసి ఇచ్చిన పత్రాలను ఆర్‌జేడీ రికార్డు చేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన విచారణ సుమారు 8 గంటలపాటు సాగింది. తొలుత బోధన, బోధనేతర సిబ్బందిని విచారించిన ఆర్‌జేడీ తరువాత అధిక ఫీజులు, యూనిఫారంల విక్రయాలపై విద్యార్థులను విచారించారు.

ఇదీ ప్రశ్నావళి
ప్రిన్సిపాల్‌ వేధింపులపై 17 మంది మహిళా అధ్యాపక బాధితులు తమకు ఇచ్చిన ప్రశ్నావళిలో పూసగుచ్చినట్టు రాసి ఇచ్చారని తెలిసింది. కాంట్రాక్ట్‌ లెక్చరర్‌ ఉదయశాంతిని ప్రిన్సిపాల్‌ దూషించినపుడు స్వయంగా మీరు ఎలా చూశారు, అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారా, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాయితీ ఇవ్వకుండా ఫీజులు వసూలు చేశారా, పేరెంట్స్‌ ,టీచర్స్‌ అసోసియేషన్‌ పేరుతో రూ.100 వంతున వసూలు చేశారా, ఉదయశాంతి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పుడు మీరు ఆమెకు అండగా ఉన్నారా, పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందస్తు అనుమతి ఏమైనా తీసుకున్నారా, వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టారా, మీరంతా ఫిర్యాదులు చేశాక కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారా, ఉదయశాంతి అవమాన భారంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడేందుకు వెళ్లడం చూశారా, ప్రిన్సిపాల్‌పై వచ్చిన అభియోగాలు నిజమని నమ్ముతున్నారా...ఇలా 14 అంశాలతో ప్రశ్నావళి అందజేసి సమాధానాలు లిఖితపూర్వకంగా తీసుకొని రికార్డు చేశారు. బోధనేతర సిబ్బందిలో కొందరు మినహాయించి బోధనా సిబ్బంది సహా దాదాపు మూడొంతులు మంది ప్రిన్సిపాల్‌ వేధింపులతో కాలేజీలో పనిచేసే వాతావరణం లేకుండా పోయిందని వాంగ్మూలమిచ్చారు.

ప్రిన్సిపాల్‌ వీర్రాజు అరుపులు, కేకలు విని పరుగున వెళ్లేసరికి ఉదయశాంతి వెక్కివెక్కి ఏడుస్తూ కనిపించారని మహిళా అధ్యాపకులు ఆ లేఖల్లో పేర్కొన్నారు. ఇంటర్‌బోర్డు కమిషనర్‌ వరకూ వెళ్లినా న్యాయం జరగకపోగా, ప్రిన్సిపాల్‌ వేధింపులు, కక్ష సాధింపు చర్యలు మరింత ఎక్కువైపోయాయని చెప్పుకున్నారు. సహచర అధ్యాపకురాలు కావడంతోనే ఆమెకు మద్దతుగా నిలిచామని తెలియజేశారు. కుటుంబ సభ్యులు వెంట రాగా ఉదయశాంతి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు తాము కూడా వెళ్లిన మాట వాస్తవమేనని అధ్యాపకులు ధైర్యంగా చెప్పారు. పిల్లలకు పాలు ఇచ్చేందుకు వెళతామన్నా, తమ అంగాంగాలను ప్రస్తావిస్తూ అసభ్యంగా మాట్లాడడం, చివరకు తమ నడకపై కూడా కామెంట్లు చేయడం, సెలవులు అడిగినప్పుడు వెకిలి మాటలతో మానసికంగా వేధించేవారని మహిళా అధ్యాపకులు ఆర్‌జేడీ నగేష్‌కుమార్‌ వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. 

విద్యార్థుల ఫీజుల్లో అవినీతి నిజమే
విద్యార్థుల ఫీజులు అధికంగా వసూలు చేయడం వాస్తవమేనని మెజార్టీ అధ్యాపకులు కుండబద్దలు కొట్టారు. అధిక ఫీజులు వసూలు చేయడం, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు రాయితీలు ఇవ్వకపోవడం, ఒకరి రశీదుపై ముగ్గురు, నలుగురు నుంచి ఫీజులు వసూలు చేయడం నిజమేనని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలతో కూడిన రశీదులను విచారణాధికారికి అందజేశారని సమాచారం. వీటిని రికార్డుల్లో సరిచూడగా అవకతవకలు వాస్తవమేనని తేల్చి విచారణ సందర్భంలోనే అప్పటికప్పుడు ప్రిన్సిపాల్‌ వీర్రాజుకు ‘మెమో’ కూడా ఇచ్చారని తెలిసింది. విచారణ జరుగుతుండగా పలువురు విద్యార్థులు ఆర్‌జేడీ వద్దకు వెళ్లి కళాశాల భవనాలకు పెయిటింగ్‌లు, కరెంటు, శ్లాబ్‌లు కూలగొట్టే పనులు నెల రోజులపాటు చేయించుకుని ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఫిర్యాదు చేసిన విషయంపై ఆర్‌జేడీ ప్రశ్నించగా అప్పటికప్పుడు ఇద్దరు విద్యార్థులకు (ఒకరికి రూ.2,500లు, మరొకరికి రూ.1500) ప్రిన్సిపాల్‌ ఇచ్చారని తెలిసింది.

విషయం బయటకు పొక్కడంతో సుమారు 30 మంది విద్యార్థులు మూకుమ్మడిగా వెళ్లి తమతో కూడా పనులు చేయించుకున్నారని, పైసా ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఆర్‌జేడీ నగేష్‌కుమార్‌ను ‘సాక్షి ప్రతినిధి’ సంప్రదించగా విచారణ పూర్తి పారదర్శకంగా జరుగుతుందన్నారు. బాధితులందరి నుంచీ వ్యక్తిగతంగా వివరాలు సేకరించామని చెప్పారు. విచారణ అంశాలను రెండు రోజుల్లో పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని ఆర్‌జేడీ చెప్పారు.

>
మరిన్ని వార్తలు