-

యువకుడి అదృశ్యం కేసులో వివాహితే కీలకం ?

1 Jun, 2016 16:57 IST|Sakshi
యువకుడి అదృశ్యం కేసులో వివాహితే కీలకం ?

సాయి కోసం కొనసాగుతున్న గాలింపు, దర్యాప్తు
అతని పాత కేసులపై పోలీసుల దృష్టి
పోలీసులపై తీవ్ర ఒత్తిళ్లు
సంబంధీకుల కదలికలపై పోలీసులు ఆరా


వైఎస్సార్ జిల్లా: రాజంపేటలో అదృశ్యమైన గాదెరాజు సాయిప్రకాశ్‌రాజు(19) కేసులో ఓ వివాహిత కీలకంగా మారింది. ఈ వివాహితతో సాయికి వివాహేతర సంబంధం ఉందన్న కారణంతో ఆ దిశగా పోలీసులు విచారణ చేపడుతున్నారు.

అలాగే ఆ యువకుడి అదృశ్యానికి కారణమైన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ వివాహిత నుంచి పోలీసులు వివరాలు రాబడుతున్నారు. అయితే ఈ వివాహిత గతంలో ఆ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అప్పట్లో ఆమె సన్నిహితులు కొందరు సర్దుబాటు చేసి పంపినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ వివాహితకు పట్టణ పోలీసుస్టేషన్‌లో కొందరి ఖాకీలకు బాగా సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. అదృశ్యమైన ఆ యువకుడి సన్నిహితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సాయికి సంబంధించిన పాత కేసులపై కూడా పోలీసుల దృష్టి సారించడంతో కొంతమంది ఆందోళనకు గురవుతున్నారు. మిస్సింగ్ కేసు వ్యవహారంలో భారీ స్థాయిలో పోలీసులపై ఒత్తిళ్లు వస్తున్నాయని ఆరోపణలు వెలువడుతున్నాయి. ఏదీ ఏమైనప్పటికి సాయి మిస్సింగ్ కేసు ఏవిధంగా చేధిస్తారన్నది వేచి చూడాల్సిందే.  
 
కేసు మిస్టరీని ఛేదించేందుకు చర్యలు
గాదెరాజు సాయిప్రకాశ్‌రాజు మిస్సింగ్ కేసును ఛేదించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పట్టణ సీఐ మోహనకృష్ణ తెలిపారు. సోమవారం రాత్రి తన చాంబరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 28న సాయి కనపించడంలేదని అతని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఆ దిశగా గాలింపు చర్యలు చేపడుతున్నామని వివరించారు. త్వరలో ఈ కేసును ఛేదిస్తామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు