ఈ నెల 5 నుంచి ‘రాజన్న ప్రజాదర్బార్‌’

3 Sep, 2019 10:23 IST|Sakshi

సాక్షి, కావలి: నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీలు, మున్సిపల్‌ వార్డుల్లో ప్రజల సమస్యలను ప్రజల వద్దకే వచ్చి తెలుసుకుని అక్కడికక్కడే అధికారులతో సమస్యలు పరిష్కరించుకొనేందుకు సాధ్యాసాధ్యాలు చర్చించి నిర్ణయం తీసుకొనే ‘రాజన్న ప్రజా దర్బార్‌’ కార్యక్రమాన్ని ఈ నెల 5 వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి చూపిన స్ఫూర్తితో, ఆయన తనయుడు, రాష్ట్ర ప్రజల అభిమాన నాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రోత్సాహంతో నియోజకవర్గంలో ‘రాజన్న ప్రజాదర్బార్‌’ కార్యక్రమాన్ని నిరంతరం నిర్విహించనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు.

అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం, ముఖ్యంగా ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభ్యున్నత సాధించడానికి అవసరమైన  చారిత్రాత్మకమైన చట్టాలు, పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షల మేరకు, వాటిని ప్రజలకు చేర్చాలనేదే రాజన్న ప్రజాదర్బార్‌ మౌలిక లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కులాలకు, మతాలకు, వర్గాలకు, పార్టీలకు అతీతంగా ప్రభుత్వం అందించే అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందరికీ అందేలా చేయడం కోసం నిర్వహిస్తున్న రాజన్న ప్రజా దర్బార్‌ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని తమ వ్యక్తిగత  సమస్యలు, వార్డు, గ్రామ సమస్యలు తెలియజేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ప్రజల తెలియజేసే ఏ చిన్న పెద్ద సమస్య అయినా, ప్రభుత్వం ద్వారా చేసే అవకాశం ఏమాత్రం ఉన్నా అధికారుల ద్వారా అవసరమైతే సంబంధిత శాఖల మంత్రులు, ముఖ్యమంత్రి ద్వారా వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి చెప్పారు.

మరిన్ని వార్తలు