ఫాసిస్ట్‌ పాలన తెచ్చేందుకు బీజేపీ పావులు కదుపుతోంది

1 Feb, 2020 05:31 IST|Sakshi
విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌లో మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకంగా ప్రజా గర్జన సభలో అభివాదం చేస్తున్న స్వామి అగ్ని వేష్, డాక్టర్‌ రాజరత్న అంబేద్కర్, ఎంపీ కేశినేని నాని, రామకృష్ణ, తదితరులు.

మోదీ, అమిత్‌షా తాతలు దిగొచ్చినా సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌ఆర్‌పీలను ప్రవేశపెట్టలేరు 

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ మునిమనుమడు రాజారత్నం అంబేడ్కర్‌ ధ్వజం 

విజయవాడలో సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌ఆర్‌పీలకు వ్యతిరేకంగా ప్రజాగర్జన సభ 

అజిత్‌సింగ్‌నగర్‌ (విజయవాడ సెంట్రల్‌)/గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): దేశాన్ని మతాల పరంగా విడదీసి ఫాసిస్ట్‌ పాలన తెచ్చేందుకు బీజేపీ ప్రభుత్వం పావులు కదుపుతోందని, ఈ ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు దేశ ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ముని మనుమడు డాక్టర్‌ రాజారత్నం అశోక్‌ అంబేడ్కర్‌ పిలుపునిచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌ఆర్‌పీలను వ్యతిరేకిస్తూ విజయవాడ మాకినేని బసవపున్నయ్య మున్సిపల్‌ స్టేడియంలో శుక్రవారం ప్రజా గర్జన సభ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అశోక్‌ అంబేడ్కర్‌ మాట్లాడుతూ.. మోదీ, అమిత్‌షా తాతలు దిగొచ్చినా సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌ఆర్‌పీ బిల్లులను ప్రవేశపెట్టలేరన్నారు.

సిటిజన్‌షిప్‌ కోసం ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్‌ లైసెన్స్‌లేవీ చెల్లవని చెబుతున్న ప్రభుత్వం 2019 ఎన్నికల్లో ఓటర్‌ కార్డు లేకపోయినా ఆయా కార్డులతో ఓటు వేయొచ్చని ఎలా చెప్పిందని ప్రశ్నించారు. ఆ కార్డులు చెల్లకపోతే వాటితో ఎన్నికైన మీరెలా చెల్లుతారని ప్రశ్నించారు. ప్రముఖ సనాతన ధర్మబోధకులు స్వామి అగ్నివేష్‌ మాట్లాడుతూ.. వందల ఏళ్లుగా మన దేశంలో లౌకికతత్వమనే సంస్కృతి పరిఢవిల్లుతోందని, బీజేపీ ప్రభుత్వం ఆ సంస్కృతిని ధ్వంసం చేసి విద్వేషాలు, రక్తపాతాలు సృష్టించేందుకు కుట్రపన్నుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేత రెహ్మాన్, కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి, టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జమాత్‌ ఇస్లామీ హింద్‌ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్‌ రఫీఖ్, సీపీఎం, సీపీఐ నేతలు మధు, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. 

సీఎం వైఎస్‌ జగన్‌ పాలనపై ప్రశంసలు 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనపై డాక్టర్‌ రాజారత్నం అశోక్‌ అంబేడ్కర్‌ ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో అంబేడ్కర్‌ ఆశయాల సాధన దిశగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. విజయవాడ గాంధీనగర్‌లో సమతా సైనిక్‌దళ్‌ రాష్ట్ర కార్యాలయాన్ని శుక్రవారం అశోక్‌ అంబేడ్కర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడం, మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నామన్నారు.

ఇంగ్లిష్‌ అంతర్జాతీయ భాష అని, మనం అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే ఇంగ్లిష్‌ ఎంతో అవసరమన్నారు. రాష్ట్రంలో బుద్ధిస్ట్‌ సొసైటీకి భూమిని కేటాయిస్తే ప్రపంచ స్థాయి బుద్ధిస్ట్‌ యూనివర్సిటీని నెలకొల్పుతామని అశోక్‌ అంబేడ్కర్‌ చెప్పారు. ప్రపంచ శ్రేణి వర్సిటీల సహకారంతో సొంత నిధులతో వర్సిటీని నిర్మిస్తామని తెలిపారు. వర్సిటీ ఏర్పాటుకు 25 ఎకరాలు అవసరమని, దీన్ని సొసైటీకి కేటాయించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. 

మరిన్ని వార్తలు