అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం

10 Sep, 2014 03:00 IST|Sakshi
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం

కళ్యాణదుర్గం రూరల్ : అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ ఎస్.వి.రాజశేఖర్‌బాబు తెలిపారు. కళ్యాణదుర్గం పోలీస్ సర్కిల్ కార్యాలయ ఆవరణలో మంగళవారం ‘పోలీస్ ప్రజాబాట’ నిర్వహించారు. సబ్ డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 73 మంది ఎస్పీకి అర్జీలు సమర్పించారు. ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి, ఆర్డీఓ మలోల హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘పోలీస్ ప్రజాబాట’, విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ కర్ణాటక కేంద్రంగా చేసుకుని అసాంఘిక శక్తులు, అంతర్రాష్ర్ట ముఠాలు ‘అనంత’లో అనేక సంఘటనలకు పాల్పడుతున్నాయన్నారు. ఈ ముఠాలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామన్నారు.
 
త్వరలోనే వీటి ఆట కట్టించి.. జిల్లాలో శాంతియుత వాతావరణం నెలకొల్పుతామన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇసుక మాఫియాను అరికట్టేందుకు ప్రజలు సహకరించాలన్నారు. ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెంచామన్నారు. గ్రామ పోలీస్ వ్యవస్థను పటిష్టం చేస్తామని చెప్పారు. గ్రామానికి ఒక కానిస్టేబుల్‌ను నియమించామని, ఆ గ్రామంలో చోటు చేసుకునే సంఘటనలకు ఆ కానిస్టేబులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యం చేస్తే పోలీసు అధికారులపై చర్యలు తప్పవన్నారు.
 
జిల్లాలో 101 సమస్యాత్మక గ్రామాలను గుర్తించామన్నారు. డీఎస్పీ నెలకోసారి, సీఐ 15 రోజులకోసారి, ఎస్‌ఐ వారానికోసారి గ్రామాలను సందర్శించి అక్కడ చోటు చేసుకుంటున్న సంఘటనలను సభల ద్వారా సమీక్షించాల న్నారు. పది రోజులకొకసారి గ్రామాల్లో పోలీస్ ప్రజాబా ట నిర్వహించాలని ఎస్‌ఐలకు సూచించారు. భూ వి వాదాలు, అసాంఘిక కార్యాకలాపాలు, ఫ్యాక్షన్, దోపిడీలు, దొంగతనాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు.
 
రాజకీయ జోక్యాన్ని అరికట్టండి
ప్రభుత్వ కార్యకలాపాల్లో రాజకీయ పార్టీ నేతల జోక్యాన్ని అరికట్టాలని వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తిప్పేస్వామి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతలు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు, చౌకడిపో డీలర్లను అక్రమ తొలగింపజేయిస్తూ కక్షలు రేపుతున్నారని ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారని, కౌంటర్ కేసులూ బనాయిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు