స్పెషల్‌ పీపీగా రాజేంద్ర ప్రసాద్‌ ఓకే

10 Mar, 2018 01:30 IST|Sakshi

హైకోర్టుకు నివేదించిన బాధిత మహిళల న్యాయవాది వసుధా నాగరాజ్‌

సాక్షి, హైదరాబాద్‌: గ్రేహౌండ్స్‌ పోలీసుల అత్యాచార ఘటనకు సంబంధించి నమోదైన కేసులో కింది కోర్టులో వాదనలు వినిపించేందుకు స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా విజయవాడకు చెందిన సుంకర రాజేంద్రప్రసాద్‌ నియామకానికి బాధిత గిరిజన మహిళలు మొగ్గు చూపారు. హైకోర్టు రూపొందించిన ఆరుగురు ప్రముఖ క్రిమినల్‌ లాయర్ల జాబితా నుంచి సుంకర రాజేంద్రప్రసాద్‌ను ఎంపిక చేసుకున్నారు. రాజేంద్రప్రసాద్‌ను స్పెషల్‌ పీపీగా నియమించవచ్చునని బాధిత మహిళల తరఫు న్యాయవాది వసుధా నాగరాజ్‌ శుక్రవారం హైకోర్టుకు నివేదించారు.

రాజేంద్రప్రసాద్‌ నియామకం పట్ల ప్రభుత్వ న్యాయవాది సైతం ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. దీంతో స్పెషల్‌ పీపీ నియామకం విషయంలో రాజేంద్రప్రసాద్‌ అంగీకారం తెలుసుకోవాలని రిజిస్ట్రా్టర్‌ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. ఫీజుపై కూడా స్పష్టత తీసుకోవాలని రిజిస్ట్రా్టర్‌ జనరల్‌కు స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలంటూ విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 

మరిన్ని వార్తలు