రోడ్డున పడేశారు

13 Jun, 2014 00:55 IST|Sakshi
రోడ్డున పడేశారు

 కంబాలచెరువు (రాజమండ్రి): రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం)లో పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లుగా పనిచేస్తున్న వారు రోడ్డున పడ్డారు. ఆర్ట్, క్రాప్ట్, పీఈటీలుగా జిల్లాలో సుమారు 300 మంది వరకు,  రాజమండ్రి అర్బన్‌లో 15 మంది రెండేళ్లుగా పనిచేస్తున్నారు. వీరికి రూ. 4,500 జీతం ఇస్తున్నారు. పేరుకు పార్ట్ టైం అయినా తాము ఫుల్‌టైం సేవలు అందిస్తున్నామని వారు పేర్కొన్నారు. జీతం పెంపుదలకోసం పోరాటం చేయగా రూ. 6 వేలు చేశారు. జీతం పెంచినట్టే పెంచి మా అందర్నీ ఇప్పుడు రోడ్డున పడేశారని వారు వాపోతున్నారు. ఈ విద్యాసంవత్సరంనుంచి తిరిగి ఆ ఉద్యోగాలకు వారిని దరఖాస్తు చేసుకోమంటున్నారు. కొత్తవారితో కలసి వారు ఆ పోస్టుకోసం పోటీపడాలి. అతి తక్కువ జీతంతో పనిచేసిన తమను ఇలా వీధిపాలు చేయడం సబబు కాదని వారందరూ ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు. తెలంగాణాలో గతంలో పనిచేసిన ఇన్‌స్ట్రక్టర్లను యథావిధిగా విధుల్లో కొనసాగుతున్నారని, ఆంధ్రాలో దీనికి వ్యతిరేకంగా ఉందన్నారు. తాము చేసిన ఉద్యోగాలను ఇప్పించి ఆ తర్వాతే కొత్తవారిని విధుల్లోకి తీసుకోవాలని వారు అభ్యర్థిస్తున్నారు.
 
 ఇంత అన్యాయమా..
 రెండేళ్లుగా తక్కువ జీతంతో పనిచేయించుకుని జీతాలు పెరి గిన తర్వాత మమ ల్ని పక్కకు నెట్టేయడం చాలా అన్యా యం. మాకు పని అనుభవం ఎంతో ఉంది. తిరిగి కొత్తవారితో దరఖాస్తు చేసుకోమంటున్నారు. అది దారుణం.
                                           - పి.దుర్గాప్రసాద్
 మమ్మల్ని ఆదుకోవాలి
 మాతో ఇప్పటివరకు వెట్టిచాకిరీ చేయించుకుని కూరలో కరివేపాకులా ఇప్పుడు తొలగించారు. ఇన్నాళ్లూ మేం చేసిన సేవను గుర్తించరా? ఇదెక్కడిన్యాయం. మేం ఎక్కడికి వెళ్లాలి. ఈ ఉద్యోగంపైనే నమ్మకం పెట్టుకుని బతుకుతున్నాం.
                                         - డి. సలోమి
 
 

మరిన్ని వార్తలు