'నాకే ముడుపులిస్తామన్నారు'

12 Jun, 2017 21:41 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో జరుగుతున్న భూ పోరాటాన్ని విరమించుకుంటే తనకే ముడుపులిస్తామని భూ బకాసురులు దూతల ద్వారా రాయబారం పంపారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి వెల్లడించారు. వెంకట రామరాజు అనే వ్యక్తి స్వయంగా మొబైల్‌లో తనకు సంక్షిప్త సందేశం పంపించారని చెప్పారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం ముదపాక అసైన్డ్‌ భూములను అఖిలపక్ష నేతలతో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమను ఎంత ప్రలోభపెట్టినా, భయపెట్టినా ప్రజల పక్షాన పోరాడటం ఆపేదిలేదని స్పష్టంచేశారు. విశాఖలో జరుగుతున్న భూ కుంభకోణాలు, బాధితులపై తప్పుడు కేసులకు వ్యతిరేకంగా త్వరలో అఖిలపక్షం ఆధ్వర్యంలో విశాఖ కలెక్టరేట్‌ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ముదపాకలో కొండల మధ్య ఉన్న వెయ్యి ఎకరాల్లో దాదాపు 450 ఎకరాలను పేదలు, దళితులకు ఇచ్చారని, వాటిని హైదరాబాద్‌లో ఉంటున్న వెంకట రామరాజు అలియాస్‌ జలవిహార్‌ రాజు ఆక్రమించుకోవడానికి రాత్రికి రాత్రే రోడ్లు వేసేశారని విజయసాయిరెడ్డి తెలిపారు. ఆయన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లకు బినామీ అనే విషయం జగమెరిగిన సత్యమన్నారు.

ఎకరం రూ.పది లక్షలకు పైగా విలువుంటే రూ.లక్ష ఇచ్చి వారి నుంచి భూములు లాక్కున్నారని చెపాపరు. చంద్రబాబు, లోకేశ్‌ల ప్రోత్సాహంతో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, బండారు సత్యనారాయణ, వెలగపూడి రామకృష్ణ, వంగలపూడి అనితలు ఈ భూ అక్రమణల్లో పాలుపంచుకున్నారని ఆరోపించారు. ఐకమత్యంగా ఈ ఉద్యమాన్ని నడుపుతాం. ఎవరి దగ్గరి నుంచి లాక్కున్నారో వారికి ఆ భూములను తిరిగి ఇప్పిస్తామన్నారు. ఇంతటితో ఈ భూ కబ్జాను ఆపకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.

ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ తనను బ్రోకర్‌ అన్నారని, కాని తానింత వరకు ఎలాంటి బ్రోకర్‌ పని చేయలేదన్నారు. నిన్నటికి నిన్న చంద్రబాబు, లోకేశ్‌ల ప్రోద్బలంతో రామరాజు తనకు మెసేజ్‌ పంపిచారని, ఉద్యమాన్ని ఆపేస్తే తన ప్రయోజనాలు చూసుకుంటానన్నారని ఆయన తెలిపారు. ఈ రెండేళ్లు ప్రజా సమస్యలపై పోరాడటంతో పాటు, అధికారంలోకి రాగానే కబ్జా దారులందరిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. విశాఖలో త్వరలో జరిగే మహాధర్నాకు అన్ని పార్టీల నాయకులు హాజరై దళితులకు, పేదలకు న్యాయం చేయాలని కోరారు.

విశాఖలో రూ.రెండులక్షల కోట్ల విలువైన భూములపై కొందరు అక్రమార్కులు గద్దల్లా వాలారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేశ్‌ల కనుసన్నల్లోనే కబ్జా పర్వం సాగుతోందన్నారు. విశాఖలో ల్యాండ్‌ పూలింగ్‌ కోసం చట్ట విరుద్ధంగా ప్రభుత్వం 304 జీవోను విడుదల చేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ నర్సింగరావు అన్నారు. ముదపాక భూములు లేకపోయినా తొలి ఫేజ్‌ తర్వాత ఈ భూములు తీసుకుంటారనే కారణంతో కొందరు ఇక్కడ కబ్జాకు పాల్పడుతున్నారని చెప్పారు. ల్యాండ్‌ పూలింగ్‌ అనేదే తప్పని, భూములు తీసుకోవాలంటే 2013 భూ అధీకరణ చట్టం ప్రకారం తీసుకోవాలన్నారు. కావున వెంటనే ఈ జీవోను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

నడింపల్లి వెంకటరమణ రాజు అనే వ్యక్తి దళితుల్ని మోసం చేసి దౌర్జన్యంగా రోడ్లు వేస్తుంటే కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే బండారు ఎందుకు అడ్డుకోలేదని సీపీఐ జిల్లా కార్యదర్శి స్టాలిన్‌ ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనే అనుమానం కలుగుతోందన్నారు. భూ కుంభకోణాలను అడ్డుకునేందుకు ప్రతిపక్షంతో కలిసి పోరాడతామని లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బీసెట్టి బాబ్జి చెప్పారు. అక్రమ జీవోలతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల సహకారంతోనే ఈ కుంభకోణాలు యథేచ్ఛగా సాగుతున్నాయన్నారు. దళితులకు చంద్రబాబు ప్రభుత్వం వ్యతిరేకంగా పనిచేస్తోందని బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు జార్జీ బంగారి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అఖిలపక్ష పార్టీ నేతల క్షేత్ర స్థాయి పరిశీలన గురించి తెలుసుకున్న ప్రభుత్వం రైతులను వారి వద్దకు రానివ్వలేదు. ముందు రోజే పోలీసులతో అందరినీ బెరించింది. అఖిలపక్ష నాయకులను స్థానిక టీడీపీ ఎంపీటీసీ రాంబాబు, సర్పంచ్‌ మల్లీశ్వరమ్మ భర్త రమణలు ఘోరావ్‌ చేయాలని ప్రయత్నించారు. వారిని పోలీసులు, వైఎస్సార్‌సీపీ నాయకులు అడ్డుకున్నారు. అనంతరం టీడీపీ నా‘ుకులు విలేకరులతో మాట్లాడుతూ తమ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ దేవుడని, జైలుకెళ్లి వచ్చిన వారు తమ సమస్యలపై పోరాటమేమీ చేయనవసరం లేదన్నారు.

మరిన్ని వార్తలు