ఐదేళ్లు ‘రాళ్ల’పాలు!

22 Mar, 2019 13:48 IST|Sakshi
అడుగంటిన రాళ్ళపాడు జలాశయం

కరువు రక్కసిలో రాళ్లపాడు రైతాంగం

రాళ్లపాడు ప్రాజెక్టుకు సోమశిల జలాలు ఇవ్వని నేతలు 

ఐదేళ్లలో 40వేల ఎకరాలు బీళ్లుగా మారిన వైనం

సాక్షి, లింగసముద్రం: కందుకూరు నియోజకవర్గానికే తలమానికమైన రాళ్లపాడు ప్రాజెక్టు ఎన్నడూ లేని విధంగా కరువు రక్కసిలో కొట్టుమిట్టుడుతోంది. 5 సంవత్సరాల నుంచి వర్షాలు లేక ప్రాజెక్టు దిగువ ప్రాంతం రైతులు అప్పుల్లో కూరుకుపోయి దిక్కుతోచని పరిస్థితుల్లో గ్రామాలు విడిచి రాష్ట్రం దాటి బయటకు వెళ్లారు. ఇంత జరుగుతున్నా తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం రైతులపై చిన్నచూపు చూసిందనే చెప్పుకోవచ్చు. 5 సంవత్సరాల నుంచి సోమశిల ఉత్తర కాలువ పనులు పూర్తి చేయించి ప్రాజెక్టుకి సోమశిల జలాలు తీసుకురండి అని రైతులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా నాయకులు రైతుల గోడు ఎవరూ పట్టించుకోలేదు. రైతు సంఘం నాయకులు ప్రాజెక్టు వద్ద ధర్నా కార్యక్రమాలు గత మూడు సంవత్సరాల నుంచి చేపట్టారు. తన వ్యాపారాలకే పరిమితమైన ఎంఎల్‌ఏ పోతుల రామారావు రాళ్లపాడు ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.


చింతలదేవి వద్ద అడ్డంకులు
నెల్లూరు జిల్లా కొండాపురం మండలం చింతలదేవి వద్ద సోమశిల ఉత్తర కాలువ పనులను ఆగ్రామ రైతులు ఆపివేశారు. దాదాపు ఒకటిన్న సంవత్సరం ఈకాలువ పనులను నాయకులు పట్టించుకోలేదు. చింతలదేవి రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారంలో జాప్యం కారణంగా కాలువ పనులు అప్పట్లో ఆగాయి. ప్రభుత్వం ఎంఎల్‌ఏ రామారావు పట్టించుకోక పోవడంతో కాలువ పనులు పూర్తి కాలేదు.
ఎన్నికలు ముంచుకొస్తుండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు కందుకూరులో జరిగిన బహిరంగ సభలో కాలువ విషయం చెప్పడంతో కాలువ పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తక్షణమే చింతలదేవి వద్ద రైతులకు నష్ట పరిహారం చెల్లించ కుండానే కాలువను తీశారు.

పనులు పూర్తి కాకుండానే గేట్లు ఎత్తిన ఎంఎల్‌ఏ 
సోమశిల ఉత్తర కాలువ పనులు పూర్తి కాకుండానే హంగు, ఆర్భాటాలతో ఎంఎల్‌ఏ రామారావు అక్కడికి వెళ్లి ఉత్తర కాలువకు నీటిని వదిలారు. ఈకాలువ ద్వారా నీరు 10రోజులకు కలిగిరి మండలం చేరుకుంది. అయితే అక్కడ కాలువలో పూడికితీత పనులు పూర్తి కాకపోవడంతో కాలువలో నీరు కట్టపొర్లి తెగిపోయే ప్రమాదం ఉండడంతో నీటిని సోమశిల అధికారులు నిలిపివేశారు. కాలువ పనులు అరకొరగా చేసి మళ్ళీ నీటిని వదిలారు. ప్రాజెక్టులోకి కేవలం 30ఎంఫ్‌టీ నీరుమాత్రమే ప్రాజెక్టులోకి చేరింది. కానీ సాగుకి, తాగుకి నీరిస్తామని చెప్పిన ఎంఎల్‌ఏ రామారావు పూర్తిగా విఫల మయ్యారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.


2014కి ముందే 90 శాతం పూర్తి 
దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాజీమంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి సోమశిల ఉత్తర కాలువ ద్వారా రాళ్ళపాడు ప్రాజెక్టుకు 1.5టిఎంసీల నీరు వచ్చే విధంగా ప్రణాళిక రూపొందించి రాజశేఖర్‌రెడ్డికి చెప్పారు. ఆయన వెంటనే స్పందించడంతో టెండర్లు పిలిచి వెంటనే కాలువ పనులు మొదలు పెట్టారు.
కాలువ పనులు నిరంతరం పర్యవేక్షిస్తూ త్వరిత గతిన పూర్తి చేసి ప్రాజెక్టుకు నీరందించే విధంగా మహీధర్‌రెడ్డి కృషి చేశారు. 2014 ఎలక్షన్‌కి ముందే ఉత్తర కాలువ పనులు 90 శాతం పూర్తిచేసిన ఘనత మహీధర్‌రెడ్డికే దక్కుతుంది. 2014 తరువాత టీడీపీ ప్రభుత్వంలో కాలువ పనులను నాయకులు పట్టించుకోకనే ప్రాజెక్టుకు నీళ్లు రాలేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం కొంతమేర తాగునీరు వచ్చినా సాగుపై ఈప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకనే సోమశిల జలాలు రప్పించడంలో విఫలమైందని చెప్పవచ్చు.

టీడీపీ నాయకులకు పట్టదా?
సోమశిల జలాలు 5 సంవత్సరాల నుంచి రాళ్ళపాడు ప్రాజెక్టుకు తీసుకురావడంలో ఈప్రభుత్వం విఫలమైంది. ప్రాజెక్టులో నీళ్ళు లేక రైతాంగం దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. సోమశిల జలాలు వచ్చి ఉంటే ప్రాజెక్టు కింద భూములు సస్యస్యామంలంగా ఉండేవి. రైతులు అప్పుల బాదలు లేకుండా పసు గ్రాసానికి ఇబ్బందులు లేకుండా ఉండేవి. నాయకులకు చిత్తశుద్ధి లేకనే సాగుకి నీరివ్వలేదు.
– జి.హనుమంతరావు, పెదపవని 

కరువు వల్ల జ్యూస్‌ కొట్లకు వెళ్ళాం
తీవ్ర అనావృష్టి వలన ప్రాజెక్టులో నీరు లేక పంటలు పండక అప్పులపాలై ఏంచేయాలో అర్థంకాక రాష్ట్రం దాటి జ్యూస్‌ కొట్లు పెట్టుకుని వలస వెళ్లవలసి వచ్చింది. సోమశిల జలాలు ప్రాజెక్టుకు వచ్చింటే తాగు నీటికి, సాగు నీటికి ఇబ్బందులు తొలగిపోయేవి. ప్రభుత్వం, నాయకులు పట్టించుకోకనే ప్రాజెక్టు కింద భూములు బీళ్ళుగా మారాయి.
–గొర్రెపాటి ప్రభాకర్, మేదరమిట్లపాలెం

పాలకుల నిర్లక్ష్యంతో ప్రాజెక్టు కింద కరువు
సోమశిల ఉత్తర కాలువ పనులు 2014లోనే 90శాతం పనులు పూర్తయినా 2014 నుండి 2018 వరకు ఈకాలువ పనులుపై ఎంఎల్‌ఏ పర్యవేక్షణ లేకపోవడంతో పనులు కాంట్రాక్టర్‌ పూర్తి చేయలేదు. సోమశిల జలాలు రాళ్లపాడు ప్రాజెక్టుకి 2015 నుంచి వచ్చి ఉంటే ఈరోజు ప్రాజెక్టు కింద ఉన్న రైతులు బతుకు దెరువు కోసం వలసలు వెళ్లేవారు కాదు. పాలకుల నిర్లక్ష్యమే దీనికి నిదర్శనం.
– డేగా మాల్యాద్రి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు