3 కిలోమీటర్ల మేర.. మూడు రాజధానుల హోరు..!

13 Jan, 2020 14:47 IST|Sakshi

సాక్షి, తిరుపతి : పాలన, అభివృద్ధి వికేంద్రీకరణను స్వాగతిస్తూ.. మూడు రాజధానులు కావాలంటూ తిరుపతి వాసులు సోమవారం కదం తొక్కారు. ‘ఒక్క రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు’అంటూ నినాదాలు చేశారు. భారీగా కదిలివచ్చిన మద్దతుదారులతో దాదాపు మూడు కిలోమీటర్ల మేర రోడ్డు జనమయమైంది. మూడు రాజధానుల మాట హోరున వినిపించింది. ఈ ర్యాలీలో ఎంపీ బల్లి దుర్గాప్రసాద్, ఎమ్మెల్యే భూమన, యువ నేత భూమన అభినయరెడ్డి పాల్గొన్నారు. కృష్ణపురం తనా నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. అడుగడుగునా జైజై జగన్ అంటూ అభిమానులు నినాదాలు చేశారు.
(చదవండి : వికేంద్రీకరణకే మొగ్గు)

అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా అభిమానులు, ప్రజలు విజయనగరం జిల్లా గజపతినగరంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. విశాఖపట్టణాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక ఆంజనేయ స్వామి గుడి నుంచి నాలుగు రోడ్ల జంక్షన్ వరకు బైక్‌ ర్యాలీ సాగింది. ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో మూడు రాజధానులకు మద్దతుగా ఎమ్మెల్యే కంబాల జోగులు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు. మూడు రాజధానులతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే అన్నారు.
(చదవండి : జిల్లాల వారిగా అభివృద్ధిపై సుదీర్ఘ చర్చ..)

మరిన్ని వార్తలు