చంద్రబాబుకు ప్రజలు శిక్ష వేశారు

27 May, 2019 03:38 IST|Sakshi

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ విడుదల కాకముందే సైకిల్‌కు పంక్చర్‌ పడింది

దర్శకుడు రాంగోపాల్‌ వర్మ

గాంధీనగర్‌ (విజయవాడసెంట్రల్‌): లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రం విడుదలకు ముందే చంద్రబాబుకు ప్రజలు శిక్ష వేశారని ఆ చిత్ర దర్శకుడు రాంగోపాల్‌ వర్మ అన్నారు. చిత్రం విడుదల చేయాలనుకున్నప్పుడు సైకిల్‌ జోరు మీద ఉందని, ఇపుడు సైకిల్‌కు పంక్చర్‌ పడిందని వ్యాఖ్యానించారు. విజయవాడలోని ఫిలిం చాంబర్‌హాలులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రంలోని సన్నివేశాలు 25 ఏళ్ల కిందట జరిగిన వాస్తవ సంఘటనలు అని రాంగోపాల్‌ వర్మ తెలిపారు.

ఆ సంఘటనల్లో పాల్గొన్న ప్రధాన పాత్రలు ఇప్పటికీ రాజకీయాల్లో ఉన్నారన్నారు. అప్పట్లో మీడియా లేకపోవడంతో ఎన్టీఆర్‌ జీవితంలో చివరిరోజుల్లో జరిగిన సంఘటనలపై రకరకాల కథలు వినిపిస్తున్నాయన్నారు. నిజంగా ఆ సమయంలో ఏం జరిగిందో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రంలో చూపించినట్లు చెప్పారు. ఒక వ్యక్తిని నమ్మి ఎన్టీఆర్‌ పెద్ద తప్పు చేశారన్నారు. ఆ వ్యక్తే ఎన్టీఆర్‌ను ఏం చేశారో..  థియేటర్‌లో చూడవచ్చన్నారు. తాను కాంట్రవర్సీని మాత్రమే సినిమాగా తెరకెక్కించానని, చంద్రబాబు సినిమాను కాంట్రవర్సీ చేశారన్నారు. 

ఎన్టీఆర్‌ వెనుక కుట్రలను బయటపెట్టడమే ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ ఉద్దేశం
తెలుగు ప్రజల ఆరాధ్యదైవం ఎన్టీఆర్‌ వెనుక జరిగిన కుట్రలను బయటపెట్టడమే ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రం ముఖ్య ఉద్దేశమని వర్మ అన్నారు. ఈనెల 31న ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రం విడుదల చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. అందరి ఆరాధ్య దైవం ఎన్టీఆర్‌ నిజజీవితంలో చివరి రోజుల్లో ఏం జరిగిందో ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో తానీ సినిమా తీశానని చెప్పారు. ఏపీలో చిత్రం విడుదల కాకుండా అనేక రకాల అడ్డంకులు సృష్టించారన్నారు. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్, కోర్టులు ఉన్నప్పటికీ అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చిత్రం విడుదలైందన్నారు. ప్రస్తుత తన ప్రెస్‌మీట్‌కు పోలీసులు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వార్తలు