ఆయన నిబద్ధత గల కమ్యూనిస్టు: రామచంద్రమూర్తి

21 Jan, 2020 12:08 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ప్రముఖ కాలమిస్ట్‌, కమ్యూనిస్ట్‌ నేత డాక్టర్‌ ఏపీ విఠల్‌ పార్థివదేహానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు రామచంద్రమూర్తి మంగళవారం నివాళులర్పించారు.  అనంతరం విఠల్‌ కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'విఠల్‌ గొప్ప మేధావి. కమ్యూనిస్టు నాయకులలో అగ్రజుడు అయిన పుచ్చలపల్లి సుందరయ్యకి ప్రియమైన శిష్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక వైద్యుడిగా పేదప్రజలకు ఉచితంగా వైద్య సహాయం అందించారు.

కమ్యూనిస్టు భావాలను నరనరాలలో జీర్ణించుకున్న వ్యక్తిగా.. నిబద్ధత గల కమ్యూనిస్టుగా ఆయన జీవించారు. అలాంటి వారు ప్రస్తుతం మన మధ్య నుంచి దూరం కావడం తీరని లోటు. తెలంగాణ ఉద్యమకాలంలో ముందుండి అనేక వ్యాసాలు రాశారు. జీవితంలో చివరి క్షణం వరకు నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న  వ్యక్తి ఆయన' అంటూ విఠల్‌తో ఉన్న అనుబంధాలను గుర్తుచేసుకున్నారు. అయితే గత కొద్ది రోజులుగా షుగర్‌, హృద్రోగంతో బాధపడుతున్న ఏపీ విఠల్‌ సోమవారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.  (సీపీఎం మాజీ నేత ఏపీ విఠల్ కన్నుమూత)

మరిన్ని వార్తలు