నన్ను విధుల్లోకి తీసుకోండి..

25 Dec, 2018 05:13 IST|Sakshi

     టీటీడీ ఈవోకు రమణదీక్షితులు లేఖ

     తిరుచానూరు తీర్పు వర్తింపజేయాలని కోరిన మాజీ ప్రధానార్చకుడు 

     న్యాయశాఖకు నివేదించిన టీటీడీ

     మళ్లీ మొదటికొచ్చిన అర్చక వివాదం

తిరుమల: అర్చకుల వయోపరిమితి వివాదం టీటీడీని ఇప్పట్లో వీడేలా లేదు. తిరుచానూరు ఆలయంలో మిరాశీ అర్చకులకు వయోపరిమితి లేదంటూ.. వారిని విధుల్లోకి తీసుకోవాలని టీటీడీని హైకోర్టు ఇటీవల ఆదేశించిన నేపథ్యంలో అవే నిబంధనలను తమకూ వర్తింపచేయాలని శ్రీవారి ఆలయ మాజీ ప్రధానార్చకుడు రమణదీక్షితులు టీటీడీ ఈవోకు రెండు రోజుల కిందట లేఖ రాశారు. దీంతో అర్చకుల వివాదం ఒక్క పట్టాన తెగేలా లేదు. 1986లో మిరాశీ వ్యవస్థ రద్దు చేసినప్పటి నుంచి కూడా కోర్టుల చుట్టూ అర్చకుల వివాదం తిరుగుతూనే ఉంది. ఈ ఏడాది మే నెలలో అర్చకులకు 65 ఏళ్ల వయోపరిమితి నిబంధనలను అమలు చేయాలని టీటీడీ బోర్డు.. అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఫలితంగా శ్రీవారి ఆలయంలో ప్రధానార్చక హోదాలో ఉన్న నలుగురు మిరాశీ అర్చకులతో సహా.. తిరుచానూరు ఆలయంలోని అర్చకులతో పాటు దాదాపు 20 మంది అర్చకులకు ఉద్వాసన పలికారు. మిరాశీ అర్చకులకు వయోపరిమితి నిబంధన అమలు చేయడం సబబు కాదంటూ వారు కోర్టును ఆశ్రయించారు.

రమణ దీక్షితుల ఉద్వాసనకే.. 
టీటీడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన రమణదీక్షితులను సాగనంపేందుకే అన్నట్లుగా 65 సంవత్సరాల వయోపరిమితి నిబంధనను పాలకమండలి తెరపైకి తెచ్చింది. శ్రీవారి ఆలయంలో ఏడుగురు, తిరుచానూరు అమ్మవారి ఆలయంలోని ఇద్దరు అర్చకులను ఉద్యోగ విరమణ చేయించారు. తిరుచానూరు అమ్మవారి ఆలయ అర్చకులు హైకోర్టునాశ్రయించగా.. శ్రీవారి ఆలయ అర్చకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ దశలో ఉండగానే.. హైకోర్టులో మాత్రం తిరుచానూరు అమ్మవారి ఆలయ అర్చకులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. మిరాశీ అర్చకులకు రిటైర్మెంట్‌ అనేదే లేదని, పనిచేసే శక్తి ఉన్నన్నాళ్లు వారిని సంభావన అర్చకులుగా అర్చకత్వానికి అనుమతించాలని టీటీడీని హైకోర్టు ఆదేశించింది. అయితే ఇదే తీర్పును తమకు అమలుజేయాలని రమణదీక్షితులు టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌కు వెంటనే లేఖ రాశారు. హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లే ఆలోచనలో ఉన్న టీటీడీ.. రమణదీక్షితుల వ్యవహారంలో ఎలా ముందుకెళుతుందోనన్నది ఆసక్తిగా మారింది. సుప్రీంకోర్టులో కేసు తేలే వరకు మిరాశీ అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకునే పరిస్థితి మాత్రం ప్రస్తుతానికి టీటీడీలో కనిపించడం లేదు. రమణదీక్షితులు పక్షాన రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యంస్వామి కూడా హైకోర్టులో కేసును దాఖలు చేశారు. రమణదీక్షితులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ దశలోనే ఉంది. ఈ నేపథ్యంలో లేఖను పరిశీలించిన టీటీడీ.. న్యాయశాఖకు పంపినట్లు సమాచారం.  

మరిన్ని వార్తలు